
గాయని మధుప్రియ వివాహం
నాటకీయ పరిణామాల మధ్య ఒక్కటైన ప్రేమజంట
బెజ్జూర్ (కాగజ్‌నగర్): వర్ధమాన గాయని మధుప్రియ శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వేకువజామున రెండు గంటల ప్రాంతంలో మధుప్రియ వివాహం చేసుకోబోయే శ్రీకాంత్ ఇంటికి ఆమె బంధువులు నాలుగు వాహనాల్లో వచ్చారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఒక వాహనంలో మధుప్రియను తరలించారు. మూడు వాహనాలు మంచిర్యాల వైపు వెళ్లగా, మరో వాహనం కౌటాల వైపు వెళ్లింది. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి సమీపంలో మధుప్రియను తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మధుప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు సుజాత-మల్లేష్‌లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చా రు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు పోలీసు బందోబస్తు మధ్య ఆమె వివాహం జరిగింది. శ్రీకాంత్ అనే అబ్బాయిని ప్రేమించానని, తమ వివాహం చేయిం చాలని మధుప్రియ తమను ఆశ్రయిం చిందని సీఐ రమేష్‌బాబు తెలిపారు.
ట్రాప్ చేశారు: మధుప్రియ తల్లి
తన కూతురు మధుప్రియను శ్రీకాంత్ ట్రాప్ చేశాడని ఆమె తల్లి సుజాత ఆరోపించారు. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని కావాలని నాశనం చేశారని ఆరోపించారు. వారం రోజుల నుంచి కూతురు కనబడడం లేదని, చివరకు కాగజ్‌నగర్‌లో ఉందని తెలుసుకుని వచ్చామని రోదించింది.
ఇష్టంతోనే పెళ్లి చేసుకున్న: మధుప్రియ
శ్రీకాంత్‌ను ప్రేమిస్తున్నానని, తన ఇష్టంతోనే అతడిని పెళ్లి చేసుకున్నానని మధుప్రియ వెల్లడించింది. తనకు తల్లిదండ్రుల ఆశీస్సు లెప్పుడూ ఉంటాయని పేర్కొంది.