ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు షాన్‌కు అసోంలో చేదు అనుభవం ఎదురైంది. గువాహటిలో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్లొనేందుకు వెళ్లిన షాన్ పాట పాడుతున్న సమయంలో సమయంలో ప్రేక్షకులు అతడిపై పేపర్ బాల్స్, రాళ్లు విసిరారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం గువాహటిలో షాన్ ప్రదర్శన ఉండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి గాత్రం వినాలని ఆశపడ్డారు.. అయితే షాన్ బెంగాలీ పాట పాడటంతో నిరాశకు గురయ్యారు. దీంతో అతడిపై రాళ్లు విసిరి దాడి చేశాడు.
ఊహించని పరిణామానికి కంగుతిన్న షాన్.. మధ్యలోనే పాటను ఆపివేసి.. ‘ఈ పని చేసిందెవరో పట్టుకురండి. ఒక ఆర్టిస్టుకు ఇచ్చే గౌరవం ఇదేనా. ముందు మర్యాద నేర్చుకోండి. నాకు జ్వరంగా ఉన్నా మీకు వినోదం పంచాలనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తప్పు తెలుసుకున్న అభిమానులు తమని మన్నించాలంటూ ట్విటర్ వేదికగా షాన్‌ను క్షమాపణలు కోరుతున్నారు. షాన్ కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాడు. ‘రాజకీయ నాయకుల మాటల ప్రభావంతోనే మీలో అసహనం పెరిగిపోయింది. ఏదో ఆవేశంలో మీరలా చేసి ఉంటారు. మరేం ఫర్వాలేదంటూ’ సమాధామిచ్చాడు.
కాగా భారత పౌరులను గుర్తించే ‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్’ ప్రకారం.. అసోంలో మొత్తం 3.29 కోట్ల జనాభా ఉండగా వారిలో 2,89,88,677 మందిని మాత్రమే భారత పౌరులుగా కేంద్రం గుర్తించింది. మిగిలిన దాదాపు 40 లక్షల మందికి గుర్తింపు ఇవ్వకపోవడంతో వారిని విదేశీయులుగా పరిగణించే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది ముస్లింలు, అందులో కూడా బెంగాలీ మాట్లాడే ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో షాన్ బెంగాలీ పాట పాడటంతో వారికే తన మద్దతు ప్రకటిస్తున్నాడని భావించిన ప్రేక్షకులు అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.