రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు.