రియల్ హీరోగా మారిన కర్నాటక మంత్రి!
రాజకీయ నేతలంటేనే నమ్మకం కోల్పోతున్న ప్రస్తుత రోజుల్లో.. సాటి నేతలకు కర్నాటక మంత్రి ఆదర్శంగా, స్పూర్తిగా నిలిచిన సంఘటన బెంగళూరు పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఓ చెరువులో మునిగిపోతున్న ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని తన అంగరక్షకులతో కలిసి రక్షించి రియల్ హీరో అనిపించుకున్నారు.
ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి కిమ్మనే రత్నాకర్ తన వాహనంలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి స్వగ్రామం తిర్థహళ్లికి వెళుతుండగా.. మార్గమధ్యంలో బెగువల్లి వద్ద మారుతి స్విఫ్ట్ కారు నీటిలో మునిగిపోతుండగా గమనించి తన కాన్వాయ్ ను ఆపి.. చెరువులోకి తన అంగరక్షకులతో కలిసి దూకి ఆరుగురిని రక్షించారు. మంత్రి రత్నాకర్ తో గన్ మెన్ హల్ స్వామి, డ్రైవర్ చంద్ర శేఖర్, ఎస్కార్ట్ వెహికిల్ డ్రైవర్ కృష్ణమూర్తి ప్రాణాలకు తెగించి కాపాడారు.
తొలుత మంత్రి రత్నాకర్ నీటిలోకి దూకి రియర్ డోర్ ను ఓపెన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకి లాగి..తన అనుచరులతో కలిసి వారిని సురక్షితంగా రక్షించారు. ఆ తర్వాత మళ్లీ నీటిలోకి వెళ్లి 55 ఏళ్ల మహిళతోపాటు మరో ముగ్గురిని కాపాడారు. డ్రైవర్ సీట్ లో ఉన్న వ్యక్తి అపస్మారక స్ఠితిలోకి వెళ్లగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంత్రి రక్షించకపోతే తామందరు ఈ ప్రమాదంలో మరణించే వాళ్లమని.. మంత్రి రత్నాకర్ కు ఎలా కృతజ్క్షతలు తెలియచేయాలో అర్ధం కావడంలేదని బాధితులు అన్నారు.