sira (ink)
-
ఓటేస్తే మజూరీలో రాయితీ
రాయ్‌పూర్: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్‌గఢ్ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అమర్ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్ అసోసియేషన్ 10 శాతం, టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్‌పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. -
సిరాలో తప్ప చట్టాల్లో నలుపు ఎక్కడ?
బస్తి(ఉత్తరప్రదేశ్): వ్యవసాయ చట్టాలను రాయడానికి వినియోగించిన సిరా మాత్రమే నలుపు అని, చట్టాల్లో ‘నలుపు’ ఎక్కడ ఉందని కేంద్ర మంత్రి వి.కె.సింగ్ రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను ఈ నాయకులు పట్టించుకోరా? అని నిలదీశారు. వివాదాస్పద సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి ప్రధాని మోదీ జాతికి క్షమాపణలు చెప్పిన మర్నాడు శనివారం కేంద్ర విమానాయాన శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ విలేకరుల సమావేశంలో రైతు సంఘాలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఇటీవల ఒక రైతు సంఘం నాయకుడితో తాను జరిపిన సంభాషణని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘ఒక్కోసారి మనం విషయాలన్నీ ఎంతో బాగా అర్థం చేసుకుంటాం. కానీ వేరేవరో ఏదో చెప్పగానే గుడ్డిగా వారిని అనుసరిస్తాం. నన్ను కలిసిన ఒక రైతు సంఘం నాయకుడిని నేను ఇదే విషయాన్ని అడిగాను. చట్టాల్ని లిఖించడానికి వాడిన సిరాలో తప్ప నలుపు ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నించాను’’ అని వీకే సింగ్ అన్నారు. -
ఆప్ ఎంపీపై సిరా దాడి
హాథ్రస్/లక్నో: ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్‌పై హాథ్రస్లో సోమవారం ఒక వ్యక్తి సిరా పోసి నిరసన తెలిపాడు. హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న సంజయ్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి సిరా పోశాడు. ‘పీఎఫ్ఐ దళారి.. వెనక్కు వెళ్లిపో’ అని అతడు గట్టిగా అరిచాడు. అతడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఖండించారు. యూపీ ప్రభుత్వ తీరుకు ఇది అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నిధులిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. దేశద్రోహం కేసు: కుల ఘర్షణలకు ప్రయత్నిస్తున్నారని, కులం ప్రాతిపదికన విద్వేషం రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్పా పోలీస్‌స్టేషన్‌లో వారిపై దేశద్రోహం సహా పలు తీవ్ర అభియోగాలు మోపారు. హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ కేసు నమోదు కావడం గమనార్హం. ఇలా ఉండగా, బాధిత దళిత యువతి ఇంటి వద్ద సెక్యూరిటీ పెట్టామని, ఆమె ఇద్దరు సోదరులకు ఇద్దరు గన్మెన్లను ఏర్పాటు చేశామని ఓ అధికారి చెప్పారు. -
మంత్రిపై సిరా దాడి
సాక్షి ముంబై: అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం అహ్మదనగర్ జిల్లా సంగమ్‌నేర్‌కు వెళ్లిన రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొందరు వ్యక్తులు సిరా (ఇంక్)చల్లారు. వీరిలో ఒకడైన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరా చల్లినవారందరూ శివసేన కార్యకర్తలేనని తెలిసింది. అయితే వీళ్లు మంత్రిపై ఎందుకు సిరా చల్లారనే విషయం స్పష్టంకాలేదు. సంగమ్నేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు థోరట్ శనివారం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ధన్‌గార్ వర్గానికి చెందిన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసే థోరట్‌పై సిరా చల్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌గార్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆందోళనకు దిగిన థోరట్ మద్దతుదారులు.. బాలాసాహెబ్ థోరట్‌పై సిరా చల్లారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సంగమ్నేర్ తాలుకాలో అనేక రోడ్లపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు. మరోవైపు స్థానిక శివసేన కార్యాలయాలపై దాడులు జరిపారు. కార్యాలయాల్లోని అనేక వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సంగమ్నేర్ తాలూకాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతంగా ఉండండి: థోరట్ సిరా చల్లిన ఘటనపై మంత్రి స్పందిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలంతా శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఘటన అని, ఇంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.