సాక్షి ముంబై: అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం అహ్మదనగర్ జిల్లా సంగమ్‌నేర్‌కు వెళ్లిన రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొందరు వ్యక్తులు సిరా (ఇంక్)చల్లారు. వీరిలో ఒకడైన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరా చల్లినవారందరూ శివసేన కార్యకర్తలేనని తెలిసింది. అయితే వీళ్లు మంత్రిపై ఎందుకు సిరా చల్లారనే విషయం స్పష్టంకాలేదు.
సంగమ్‌నేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు థోరట్ శనివారం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ధన్‌గార్ వర్గానికి చెందిన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసే థోరట్‌పై సిరా చల్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌గార్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఆందోళనకు దిగిన థోరట్ మద్దతుదారులు..
బాలాసాహెబ్ థోరట్‌పై సిరా చల్లారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సంగమ్‌నేర్ తాలుకాలో అనేక రోడ్లపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు. మరోవైపు స్థానిక శివసేన కార్యాలయాలపై దాడులు జరిపారు. కార్యాలయాల్లోని అనేక వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సంగమ్‌నేర్ తాలూకాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
శాంతంగా ఉండండి: థోరట్
సిరా చల్లిన ఘటనపై మంత్రి స్పందిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలంతా శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఘటన అని, ఇంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.
మంత్రిపై సిరా దాడి
Published Sat, Aug 23 2014 10:21 PM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement