2014లో బీజేపీ సారధ్యంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోని చాలా మంది బడానేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరారు. 2019లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కాంగ్రెస్‌ను వీడిన బడా నేతల జాబితా ఇలా ఉంది.
అల్పేష్ ఠాకూర్
మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ 2019 జూలైలో రాజ్యసభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేసిన తర్వాత పార్టీని వీడారు. అనంతరం బీజేపీలో చేరారు. రాధాపూర్ నుండి ఉప ఎన్నికల్లో పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2022లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ సౌత్ నుంచి గెలుపొందారు.
జ్యోతిరాదిత్య సింధియా
ప్రముఖ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మార్చి 2020లో పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్‌లో పలువురు సింధియా అనుకూల ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దాని కారణంగా కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. అయితే రాజీనామా చేయడానికి ముందు జ్యోతిరాదిత్య సింధియా హోం మంత్రి అమిత్ షాను కలిశారు. తరువాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్‌లో సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు.
జితిన్ ప్రసాద్
జితిన్ ప్రసాద్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితునిగా భావించేవారు. 2021 జూన్‌లో ఆయన కాంగ్రెస్‌ను వీడారు. ఆ తర్వాత ఆయన కూడా బీజేపీలో చేరారు. ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
సుస్మితా దేవ్
ఆగస్ట్ 2021లో మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. సెప్టెంబర్ 2021లో టీఎంసీ ఆమెను రాజ్యసభకు పంపింది. 2023 వరకు పార్లమెంటు ఎగువ సభ సభ్యునిగా కొనసాగారు. ప్రస్తుతం ఆమె తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి. సుస్మితను టీఎంసీ తిరిగి రాజ్యసభకు పంపుతోంది.
ఆర్‌పీఎన్ సింగ్
కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్ 2022 జనవరిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన పార్టీని వీడారు. ఇటీవలే బీజేపీ ఆయనను యూపీ నుంచి రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థిగా ప్రకటించింది.
అశ్విని కుమార్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, 2022 ఫిబ్రవరిలో మాజీ కేంద్ర మంత్రి అశ్విని కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. యూపీఏ హయాంలో అశ్వినీ కుమార్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.
సునీల్ జాఖర్
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న సునీల్ జాఖర్ 2022 మేలో పార్టీని వీడారు. అప్పటి ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని విమర్శించినందుకు అధినాయకత్వం నుండి షోకాజ్ నోటీసు అందుకున్న తర్వాత జాఖర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత జాఖర్ బీజేపీలో చేరారు. జూలై 2023లో బీజేపీ అతనిని పంజాబ్ యూనిట్‌కి చీఫ్‌గా చేసింది.
హార్దిక్ పటేల్
గుజరాత్ పాటిదార్ నేత హార్దిక్ పటేల్ 2022 మేలోనే కాంగ్రెస్‌ను వీడారు. రాహుల్ గాంధీ 2019లో హార్దిక్‌ని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీకి చెందిన పలువురు బాడా నేతలు తమ ఫోన్‌లలో బిజీగా ఉంటున్నారని ఆరోపిస్తూ హార్దిక్ పటేల్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తర్వాత బీజేపీలో చేరారు.
కపిల్ సిబల్
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కూడా పార్టీని వీడిన వారి జాబితాలో చేరారు. సిబల్ 2022 మేలో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాజ్యసభకు చేరుకున్నారు.
గులాం నబీ ఆజాద్
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆగస్టు 2022లో పార్టీకి రాజీనామా చేశారు. దేశంలో ఘన చరిత్ర కలిగిన పార్టీకి ఇది పెద్ద దెబ్బ. తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్‌లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పేరుతో సొంత పార్టీని స్థాపించారు.
అనిల్ ఆంటోని
సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ జనవరి 2023లో పార్టీని వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యదర్శిగా, జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు.
మిలింద్ దేవరా
2024, జనవరి 14 న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన మిలింద్ దేవరాను శివసేన రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
అశోక్ చవాన్
2024, ఫిబ్రవరి 12న అశోక్ చవాన్ భోకర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 13న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో చవాన్ బీజేపీలో చేరారు. ఫిబ్రవరి 14న భారతీయ జనతా పార్టీ.. మహారాష్ట్రలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా అశోక్ చవాన్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment