Siri Fort Auditorium
-
‘ప్రవేశిక’పై వివాదం
తమకు నచ్చని అంశాలను వివాదాస్పదం చేయడంలో, చర్చనీయాంశం చేయడంలో బీజేపీ కావొచ్చు, ఇతర సంఘ్ పరివార్ నేతలు కావొచ్చు... వారి తీరే భిన్నంగా ఉంటున్నది. ఇప్పుడు ఆ కోవలో ఎన్డీయే సర్కారు కూడా వచ్చిచేరింది. ఆ మధ్య ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమాలు అలజడి సృష్టించడం, పార్లమెంటు శీతకాల సమావేశాలు సైతం స్తంభించడం తెలిసిందే. ‘ఘర్‌వాపసీ’తో పార్టీకిగానీ, కేంద్ర ప్రభుత్వానికిగానీ సంబంధం లేదని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతులు దులుపుకున్నారు. అయితే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబమా సైతం వారి మాటలను విశ్వసించలేదని చివరిరోజు సిరిఫోర్టు ఆడిటోరియంలో ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయాలే తెలియజెప్పాయి. సాధారణ సంస్థలేవైనా చేసిన ప్రాముఖ్యంలేని పనిగా ఒబామా ఈ ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమాలను భావించి ఉంటే ఆయన వాటికంత ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదన్నది సుస్పష్టం. ‘మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం తెచ్చేందుకు మేం సిద్ధమే... మీ సంగతేమిటి’ అంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ వివాదం సందర్భంగా సవాళ్లు విసిరారు. ఈ మతమార్పిడుల వ్యవహారం చల్లారిందనుకునే లోగానే ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశిక రూపంలో మరో వివాదం వచ్చిపడింది. గణతంత్ర దినోత్సవం రోజున మీడియాకిచ్చిన వాణిజ్య ప్రకటనలో 1950 నాటి ప్రవేశిక ఛాయాచిత్రాన్ని ఉంచడమే ఈ వివాదానికి మూలకారణం. ఆ ప్రవేశిక... బీజేపీ చెబుతున్నట్టు ‘ఒరిజినల్’ గనుక అందులో ‘సామ్యవాద, లౌకిక’ పదాలు రెండూ లేవు. దీనిపై కాంగ్రెస్ గట్టిగానే విరుచుకుపడింది. ఇలాంటి ప్రవేశికను ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేసింది. 1976లో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఈ రెండు పదాలనూ చేర్చింది. అంతక్రితం ప్రవేశిక ‘సర్వసత్తాక, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర’ అంశాలను ప్రస్తావిస్తే రాజ్యాంగ సవరణ ద్వారా అందులో సామ్యవాద, లౌకిక పదాలు అదనంగా వచ్చి చేరాయి. అంతేకాదు... ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టే అనేకానేక నిబంధనలు రాజ్యాంగంలో చేరాయి. వాటిల్లో కొన్నిటిని సుప్రీంకోర్టు చెల్లబోవని కొట్టేయగా, జనతా ప్రభుత్వం మిగిలిన చాలా అంశాలను మరో సవరణ ద్వారా రద్దుచేసింది. ప్రవేశికలోని ఈ రెండు పదాలూ అలాగే ఉండిపోయాయి. ఆ ప్రవేశిక చెబుతున్న అంశాలనుంచి మన పాలకులు క్రమేపీ దూరం జరుగుతున్నారని పౌర సమాజ ప్రతినిధులు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అది వేరే విషయం. సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై మొదటినుంచీ బీజేపీ నేతలకుండే వైముఖ్యం తెలియనిదేమీ కాదు. సామ్యవాదం ‘పాశ్చాత్య’ భావన అన్న కారణంతో దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ‘గాంధేయ సామ్యవాదం’ తమ లక్ష్యమని ఎన్నడో ప్రకటించింది. పొసగని ఈ రెండు అంశాలనూ బీజేపీ కలిపి చూపడాన్ని అప్పట్లో చాలామంది విమర్శించారు. ఇక లౌకికవాదం విషయంలోనూ ఆ పార్టీది భిన్నమైన అభిప్రాయం. బీజేపీ సీనియర్ నేత అద్వానీ చాన్నాళ్లక్రితమే ‘సిసలైన లౌకికవాదం’, ‘నకిలీ లౌకికవాదం’ అంటూ చర్చలేవనెత్తారు. రాజ్యాంగ సవరణ జరిగాక పాత ప్రవేశికను చూపడంలోని ఉద్దేశాల సంగతలా ఉంచి... అసలు ఆ రెండు పదాలూ వాటి నిజమైన అర్ధంలో ఏనాడైనా ఆచరణలో ఉన్నాయా అని పరిశీలిస్తే చాలా నిరాశ కలుగుతుంది. ఇందిర హయాంలో కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి వాటినే సామ్యవాదం అన్నారు. సామ్యవాదం అసలు అర్ధానికీ, ఆ విధానాలకూ పెద్దగా పోలికలు లేవు. ఇక లౌకికవాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని చాలా దేశాలు భావిస్తుంటే మన దేశంలో మాత్రం అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. లౌకికవాదానికి తానే అసలైన ప్రతినిధినని చెప్పే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అంతర్మథనంలో పడిపోయింది. ‘అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ లౌకిక విధానమైనా...’ ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించలేకపోయారని నిరుడు జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ప్రకటించి సంచలనం సృష్టించారు. షాబానో కేసు, బాబ్రీ మసీదు వివాదం, ఢిల్లీ, గోథ్రా నరమేథాలు మన పాలకుల లౌకికవాద దృక్పథాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఏ రాజ్యాంగ సవరణనైనా పార్లమెంటు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతోపాటు దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల చట్టసభలు దాన్ని ఒప్పుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా దేశ ప్రజల సమష్టి మనోగతం వెల్లడవుతుందని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. 42వ రాజ్యాంగ సవరణ కూడా అలాంటి ప్రక్రియ ద్వారానే వచ్చింది. దాన్ని ఆమోదించేనాటికి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి విపక్ష నేతలందరినీ జైళ్లపాలు చేశారన్నది కూడా నిజం. అలాంటి వాతావరణంలో వచ్చి చేరిన సవరణలను గుర్తించదల్చుకోనట్టయితే బీజేపీ ఆ సంగతి నేరుగానే చెప్పవచ్చు. చర్చ లేవనెత్తవచ్చు. అంతేతప్ప ‘ఒరిజినల్’ ప్రవేశిక మాత్రమే సందర్భానుసారమైనదన్న సమర్థనగానీ, ఆ రెండు పదాలూ అవసరం లేకుండానే మనం లౌకికవాద దేశంగా ఉండవచ్చుననే వాదనగానీ సహేతుకమైనవి కాదు. అసలు ఆ రెండు పదాలూ చేరికపై బీజేపీకి ఎన్ని అభ్యంతరాలున్నా ఇప్పుడు చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే లౌకికవాదం, సామ్యవాదం పదాలు రెండూ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ఎన్నడో తేల్చిచెప్పింది. మౌలిక స్వరూపాన్ని మార్చే ఎలాంటి రాజ్యాంగ సవరణలూ చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేయడంవల్ల వాటిని మార్చడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రవేశిక ‘ఒరిజినల్’ వివాదం వృథా ప్రయాసగానే కనబడుతుంది. దీనికి బదులు ఆ అంశాలపైనా, వాటి ఆచరణ తీరుపైనా నిర్మాణాత్మక చర్చ లేవనెత్తడం ఉత్తమం. -
పరిశుభ్రత....జీవితంలో భాగం కావాలి
జాతీయ బాలల చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ : పరిశుభ్రత అనేది జీవితంలో ఓ భాగంగా మారాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక సిరిఫోర్ట్ ఆడిటోరియంలో శుక్రవారం జాతీయ బాలల చలనచిత్స్రోవ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలనచిత్రోత్సవంలో భాగంగా నగరంలోని అన్ని పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామన్నారు. పరిశుభ్రత కార్యక్రమం చిన్నారుల హృదయాల్లో నాటుకుపోతుందని ఆయన ఆకాంక్షించారు. పసివయసులో ఒత్తిడి అనే పదానికి తావేఉండబోదని, ఆ సమయంలో నేర్చుకున్నందంతా జీవితాంతం గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు. సినిమా అనేది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమమని, కొన్ని సినిమాలు విజ్ఞానాన్ని పెంచుతాయని అన్నారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ బెనెగల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ఆయన ఇటీవల అనేక ధారావాహికలను తీశారన్నారు. ఈ వయసులో కూడా ఆయన అందరికీ విజ్ఞానాన్ని పంచుతున్నారన్నారు. ‘స్వచ్ఛ్’ను ముందుకు తీసుకెళుతున్నాం అనంతరం సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను తమ శాఖ ముందుకు తీసుకెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాలీవుడ్ నటి దియా మీర్జా, బుల్లితెర నటి సాక్షి తన్వర్ తదితరులు పాల్గొన్నారు. కాగా జాతీయ బాలల చలనచిత్రోత్సవంలోభాగంగా తొలిరోజు ‘పప్పూ కీ పుగాడి’ తదితర సినిమాలను ప్రదర్శించారు. అదృష్టవంతురాలిని : సాక్షి తన్వర్ అనంతరం బుల్లితెర నటి సాక్షి తన్వర్ మాట్లాడుతూ తానెంతో అదృష్టవంతురాలినని, కంప్యూటర్ రహిత బాల్యాన్ని గడిపానని పేర్కొన్నారు. ప్రస్తుత తరం చిన్నారులు కంప్యూటర్ ముందే కాలం గడుపుతున్నారని, బయటికి వెళ్లి ఆడుకోవడం లేదని అన్నారు. కాగా చలనచిత్రోత్సవం సందర్భంగా చిన్నారులు తొలుత వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రోత్సవం చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) ఆధ్వర్యంలో జరుగుతోంది. చిన్ననాటినుంచే పాల్గొంటున్నా : దియామీర్జా అనంతరం బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ ‘జాతీయ బాలల చలనచిత్రోత్సవం ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం ఓ గౌరవంగా భావిస్తున్నా. నా స్వస్థలం హైదరాబాద్‌లో 16వ అంత ర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రారంభించా. పాఠశాల దశ నుంచే జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పాల్గొంటున్నా. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించగానే అందుకు సరేనని చెప్పా’అని అంది. చిన్నారులపై సినిమాలు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని, స్ఫూర్తినిస్తాయని అంది. నా జీవిచరిత్రను తెరకెక్కించడం ఇష్టం లేదు తన జీవితచరిత్రపై సినిమా రావాలని అభిలషించడం లేదని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ అంబాసిడార్ సానియామీర్జా పేర్కొంది. ఒక వేళ తీయడమంటూ జరిగితే తన పాత్రలో బాలీవుడ్ హిరోయిన్ దీపికా పదుకొనే నటించాలనే ఆకాంక్షను సానియా వెల్లడించారు. శుక్రవారం జాతీయ బాలల చలన చిత్ర ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల ఓ చిత్ర దర్శకుడు సినిమా తీయాలని చేసిన సూచనను తిరస్కరించినట్లు ఆమె చెప్పారు. ‘తన జీవిత చరిత్రను తెరకు ఎక్కించడం తనకు ఇష్టం లేదని, తన వ్యక్తిగత విషయాలను ప్రజలతో పంచుకోలేనని, తెరపై ప్రదర్శించడం తనకు ఇష్టం లేదని’ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసి సినిమా తీస్తామని చెప్పిన నిర్మాతలకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశానని చెప్పారు. ఒక వేళ భవిషత్లో తనలో ఏదైనా మార్పు రావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన జీవిత చరిత్రపై సినిమా తీస్తే, అందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే ‘సానియా’ పాత్రలో నటించడం తనకిష్టమని ఆమె చెప్పారు. ఇది ఆమె జీవిత చరిత్రపై సినిమా తీయడానికి ఎప్పుడైనా అంగీకరించ వచ్చనే దానికి సంకేతం.. ఇక ఆమె అభిమానులు, క్రీడాకారుల్లో ఆశల్ని లేపింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రముఖ క్రీడాకారుల జీవితాల ఆధారంగా తీసిన సినిమాలు బాక్సు ఆఫీసుల్ని బద్దలు కొట్టాయి. ‘పాన్‌సింగ్ తోమర్’, ‘భాగ్ మిల్కా భాగ్’(అథ్లెటిక్ మిల్కాసింగ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చినవే), తాజాగా వచ్చిన ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీకోమ్’ కూడా బాక్సింగ్‌లో ఒలింపిక్ గోల్డ్‌మెడల్ విజేత జీవిత చరిత్ర ఆధారం తీసిందే. ‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’ ప్రస్తుతం భర్త పాకిస్థానీ క్రికెటర్ సోయాబ్ మాలిక్‌తో కలిసి తన జీవిత చరిత్ర ఆధారంగా రాస్తున్న ‘ఎగైనిస్టు ఆల్ ఓడ్స్’ అనే పుస్తక రచనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 26 చాప్టర్లు పూర్తి అయ్యాయి. ‘అన్ని విషయాలు, అడ్డంకులను 2012 నుంచి ఇప్పటిదాకా కూలంకషంగా పుస్తకంలో చర్చించినట్లు సానియా తెలిపారు. మరికొన్ని చాప్టర్లను పూర్తి చే యాల్సింది ఉన్నదన్నారు. -
14 నుంచి జాతీయ బాలల చలనచిత్రోత్సవం
సాక్షి, న్యూఢిల్లీ: చిల్ట్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఎస్ఐ) నిర్వహించతలపెట్టిన మొట్టమొదటి జాతీయ బాలల చలనచిత్రోత్సవం ఈ నెల 14వ తేదీన స్థానిక సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు జరగనున్న ఈ చిత్రోత్సవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డులు పొందిన సినిమాలతో పాటు నృత్యం సంగీతం, మ్యాజిక్, యానిమేషన్ తదితర చలనచిత్ర నిర్మాణంతో ముడిపడిన రంగాలకు సంబంధించి వర్క్‌షాపులను కూడా నిర్వహించనున్నారు. పరిశుభ్రతే ఇతివృత్తంగా ఈ చలనచిత్రోవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాల కోసారి హైదరాబాద్‌లో నిర్వహించే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంతో పాటు జాతీయ చలనచిత్రోత్సవాన్ని కూడా నిర్వహించాలని సీఎఫ్ఎస్ఐ నిర్ణయించింది. గోల్డెన్ ఎలిఫెంట్ ఫెస్టివల్ గా పేర్కొనే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరగని సంవత్సరాల్లో జాతీయ చలనచిత్రోత్సవాన్ని నిర్వహిస్తారు. జాతీయ చలనచిత్రోత్సవం కూడా రెండేళ్ల కోసారి జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవం కేవలం ఒక్క నగరానికే పరిమితం కాదు. ఢిల్లీలో మొదటిసారి జరిగిన తరువాత దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ నిర్వహిస్తారు.