‘ప్రవేశిక’పై వివాదం | After Barack Obama’s religious remarks, parties target Narendra Modi | Sakshi
Sakshi News home page

‘ప్రవేశిక’పై వివాదం

Published Fri, Jan 30 2015 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

After Barack Obama’s religious remarks, parties target Narendra Modi

తమకు నచ్చని అంశాలను వివాదాస్పదం చేయడంలో, చర్చనీయాంశం చేయడంలో బీజేపీ కావొచ్చు, ఇతర సంఘ్ పరివార్ నేతలు కావొచ్చు... వారి తీరే భిన్నంగా ఉంటున్నది. ఇప్పుడు ఆ కోవలో ఎన్డీయే సర్కారు కూడా వచ్చిచేరింది. ఆ మధ్య ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమాలు అలజడి సృష్టించడం, పార్లమెంటు శీతకాల సమావేశాలు సైతం స్తంభించడం తెలిసిందే. ‘ఘర్‌వాపసీ’తో పార్టీకిగానీ, కేంద్ర ప్రభుత్వానికిగానీ సంబంధం లేదని బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేతులు దులుపుకున్నారు. అయితే, గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబమా సైతం వారి మాటలను విశ్వసించలేదని చివరిరోజు సిరిఫోర్టు ఆడిటోరియంలో ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయాలే తెలియజెప్పాయి. సాధారణ సంస్థలేవైనా చేసిన ప్రాముఖ్యంలేని పనిగా ఒబామా ఈ ‘ఘర్‌వాపసీ’ కార్యక్రమాలను భావించి ఉంటే ఆయన వాటికంత ప్రాముఖ్యం ఇచ్చేవారు కాదన్నది సుస్పష్టం. ‘మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం తెచ్చేందుకు మేం సిద్ధమే... మీ సంగతేమిటి’ అంటూ బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఆ వివాదం సందర్భంగా సవాళ్లు విసిరారు.
 
 ఈ మతమార్పిడుల వ్యవహారం చల్లారిందనుకునే లోగానే ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశిక రూపంలో మరో వివాదం వచ్చిపడింది. గణతంత్ర దినోత్సవం రోజున మీడియాకిచ్చిన వాణిజ్య ప్రకటనలో 1950 నాటి ప్రవేశిక ఛాయాచిత్రాన్ని ఉంచడమే ఈ వివాదానికి మూలకారణం. ఆ ప్రవేశిక... బీజేపీ చెబుతున్నట్టు ‘ఒరిజినల్’ గనుక అందులో ‘సామ్యవాద, లౌకిక’ పదాలు రెండూ లేవు. దీనిపై కాంగ్రెస్ గట్టిగానే విరుచుకుపడింది. ఇలాంటి ప్రవేశికను ఉపయోగించినందుకు  క్షమాపణ చెప్పాలని డిమాండు చేసింది. 1976లో ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఈ రెండు పదాలనూ చేర్చింది.
 
 అంతక్రితం ప్రవేశిక ‘సర్వసత్తాక, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర’ అంశాలను ప్రస్తావిస్తే రాజ్యాంగ సవరణ ద్వారా అందులో సామ్యవాద, లౌకిక పదాలు అదనంగా వచ్చి చేరాయి. అంతేకాదు... ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టే అనేకానేక నిబంధనలు రాజ్యాంగంలో చేరాయి. వాటిల్లో కొన్నిటిని సుప్రీంకోర్టు చెల్లబోవని కొట్టేయగా, జనతా ప్రభుత్వం మిగిలిన చాలా అంశాలను మరో సవరణ ద్వారా రద్దుచేసింది. ప్రవేశికలోని ఈ రెండు పదాలూ అలాగే ఉండిపోయాయి. ఆ ప్రవేశిక చెబుతున్న అంశాలనుంచి మన పాలకులు క్రమేపీ దూరం జరుగుతున్నారని పౌర సమాజ ప్రతినిధులు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అది వేరే విషయం. సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలపై మొదటినుంచీ బీజేపీ నేతలకుండే వైముఖ్యం తెలియనిదేమీ కాదు. సామ్యవాదం ‘పాశ్చాత్య’ భావన అన్న కారణంతో దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ‘గాంధేయ సామ్యవాదం’ తమ లక్ష్యమని ఎన్నడో ప్రకటించింది. పొసగని ఈ రెండు అంశాలనూ బీజేపీ కలిపి చూపడాన్ని అప్పట్లో చాలామంది విమర్శించారు. ఇక  లౌకికవాదం విషయంలోనూ ఆ పార్టీది భిన్నమైన అభిప్రాయం. బీజేపీ సీనియర్ నేత అద్వానీ చాన్నాళ్లక్రితమే ‘సిసలైన  లౌకికవాదం’, ‘నకిలీ లౌకికవాదం’ అంటూ చర్చలేవనెత్తారు.  
 
 రాజ్యాంగ సవరణ జరిగాక పాత ప్రవేశికను చూపడంలోని ఉద్దేశాల సంగతలా ఉంచి... అసలు ఆ రెండు పదాలూ వాటి నిజమైన అర్ధంలో ఏనాడైనా ఆచరణలో ఉన్నాయా అని పరిశీలిస్తే చాలా నిరాశ కలుగుతుంది. ఇందిర హయాంలో కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి వాటినే సామ్యవాదం అన్నారు. సామ్యవాదం అసలు అర్ధానికీ, ఆ విధానాలకూ పెద్దగా పోలికలు లేవు. ఇక లౌకికవాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని చాలా దేశాలు భావిస్తుంటే మన దేశంలో మాత్రం అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. లౌకికవాదానికి తానే అసలైన ప్రతినిధినని చెప్పే కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అంతర్మథనంలో పడిపోయింది. ‘అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ లౌకిక విధానమైనా...’ ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించలేకపోయారని నిరుడు జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ ప్రకటించి సంచలనం సృష్టించారు. షాబానో కేసు, బాబ్రీ మసీదు వివాదం, ఢిల్లీ, గోథ్రా నరమేథాలు మన పాలకుల లౌకికవాద దృక్పథాన్ని ప్రశ్నార్థకం చేశాయి.
 
 ఏ రాజ్యాంగ సవరణనైనా పార్లమెంటు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతోపాటు దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల చట్టసభలు దాన్ని ఒప్పుకోవాలి. ఈ ప్రక్రియ ద్వారా దేశ ప్రజల సమష్టి మనోగతం వెల్లడవుతుందని మన రాజ్యాంగ నిర్మాతలు భావించారు. 42వ రాజ్యాంగ సవరణ కూడా అలాంటి ప్రక్రియ ద్వారానే వచ్చింది. దాన్ని ఆమోదించేనాటికి దేశంలో అత్యవసర పరిస్థితి విధించి విపక్ష నేతలందరినీ జైళ్లపాలు చేశారన్నది కూడా నిజం.
 
 అలాంటి వాతావరణంలో వచ్చి చేరిన సవరణలను గుర్తించదల్చుకోనట్టయితే బీజేపీ ఆ సంగతి నేరుగానే చెప్పవచ్చు. చర్చ లేవనెత్తవచ్చు. అంతేతప్ప ‘ఒరిజినల్’ ప్రవేశిక మాత్రమే సందర్భానుసారమైనదన్న సమర్థనగానీ, ఆ రెండు పదాలూ అవసరం లేకుండానే మనం లౌకికవాద దేశంగా ఉండవచ్చుననే వాదనగానీ సహేతుకమైనవి కాదు. అసలు ఆ రెండు పదాలూ చేరికపై బీజేపీకి ఎన్ని అభ్యంతరాలున్నా ఇప్పుడు చేయగలిగింది కూడా లేదు. ఎందుకంటే లౌకికవాదం, సామ్యవాదం పదాలు రెండూ మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని సుప్రీంకోర్టు ఎన్నడో తేల్చిచెప్పింది. మౌలిక స్వరూపాన్ని మార్చే ఎలాంటి రాజ్యాంగ సవరణలూ చెల్లవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేయడంవల్ల వాటిని మార్చడం అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రవేశిక ‘ఒరిజినల్’ వివాదం వృథా ప్రయాసగానే కనబడుతుంది. దీనికి బదులు ఆ అంశాలపైనా, వాటి ఆచరణ తీరుపైనా నిర్మాణాత్మక చర్చ లేవనెత్తడం ఉత్తమం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement