sirohi district
-
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
మోకరిల్లి మరీ క్షమాపణ చెప్పిన మోదీ...రాజస్తాన్ సీఎం ఫైర్
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పెద్ద ఎత్తున మండిపడ్డారు. మీరు నాకంటే గౌరవప్రదమైన వ్యక్తిగా చూపించుకోవాలనే ఇలా చేశారా అంటూ మండిపడ్డారు. ఐతే ప్రధాని నరేంద్ర మోదీ శక్రవారం రాజస్తాన్‌లో సిరోహి జిల్లాలోని అబురోడ్ వద్ద జరగాల్సిన ర్యాలీ సభా వేదికకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన ఆలస్యంగా రావడంతో ఆ సభలో ప్రసంగించలేకపోయారు. అందుకని మోదీ మోకరిల్లి మరీ ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలోనే మోదీపై అశోక్ గెహ్లాట్ తన అక్కసు వెళ్లగక్కారు. తనకంటే వినయ వంతుడనని ప్రజల్లో మార్కులు కొట్టేయాలని ఇలా చేశారా అంటూ విమర్శించారు. అయినా ఆ సభలో ఇలా పాతకాలం నాటి ‘ఫోజులు’ ప్రదర్శించకుండా ప్రజలకు సోదరభావం, ప్రేమ గురించి చక్కటి సందేశం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు. ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే తానే స్వయంగా ఫోన్ చేసి అభినందించేవాడినని అన్నారు. కానీ ఆయన తన సలహాలను పాటించరని, పైగా మోదీ ఇలా మూడుసార్లు మోకరిల్లడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు. అదీగాక రాజస్తాన్‌లోని ప్రజలకు అశోక్ గెహ్లాట్ అంటే చాలా గౌరప్రదమైన వ్యక్తిగా, సాదాసీదాగా ఉండే వ్యక్తి అని తెలుసు. చిన్నప్పటీ నుంచి తనకు ప్రజల్లో ఇలాంటి ఇమేజే ఉందని, అందువల్ల మోదీ ఇక్కడ ఎలా పోటీ చేయగలరు అని ప్రశ్నించారు. బహుశా అందుకోసమే అనుకుంటా నాకంటే నమ్రతగా ఉండే వ్యక్తిగా పేరుతెచ్చుకునేందుకే ఇలా మోకరిల్లారు కాబోలు అని ఎద్దేవా చేశారు. (చదవండి: రాజస్తాన్ సీఎంగా ఆయనే.. సచిన్ పైలెట్‌కు కీలక పదవి) -
అమానుషం: చెప్పుతో కొట్టి మూత్రం తాగించారు
జైపూర్: ప్రేమించిన పాపానికి ఆ యువకుడిని చితకబాదారు. బలవంతంగా మూత్రం తాగిస్తూ నీచానికి దిగారు. ఈ అమానుష ఘటన రాజస్థాన్‌లో జూన్ 11న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరోహి జిల్లాకు చెందిన కలురామ్ దేవసి అనే యువకుడు ఓ అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. అతడి ప్రేమ విషయం తెలిసిన కులపెద్దలు కలురామ్‌పై దాడికి దిగారు. జుట్టు పట్టుకుని చెడామడా కొట్టారు. (మెడపై కాలేసి తొక్కిపట్టిన పోలీసు!) మైనర్ బాలుడు సహా ఐదుగురు వ్యక్తులు అతడిని చితకబాదుతూ, చెప్పుతో దండిస్తూ హింసించారు. మూత్రం నింపిన బాటిల్‌ను ఇచ్చి బలవంతంగా తాగించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరితోపాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. (‘జైలు నుంచి వచ్చాక ఆ ముగ్గురిని చంపుతాను’) -
రెక్క విప్పిన కల!
‘కల’ నిజం చేసుకోవాలంటే... ముందు ‘కల’ అంటూ ఒకటి కనాలి. ఆ కలే లేకపోతే? ‘కల’ కనే పరిస్థితి ఊహకు కూడా అందకపోతే?! ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చురుగ్గా పని చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛందసంస్థ. బడికి వెళ్లని పదిసంవత్సరాల అమ్మాయిని ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వాలంటీర్ ఒకరు అడిగారు... ‘‘నీకు చదువుకునే అవకాశం వస్తే... భవిష్యత్‌లో ఏమవుతావు?’’ అని. సమాధానం... నిశ్శబ్దం! ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత మాత్రం.... ‘‘ఇలా నన్ను ఎవరూ అడగలేదు. నాకు ఏం చెప్పాలో తెలియదు’’ అని చెప్పింది ఆ అమ్మాయి. ‘భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నావు?’ ఇదే ప్రశ్నను బడికి వెళుతున్న అమ్మాయిని అడిగితే... ‘‘ఆర్మీలో చేరాలనుకుంటున్నాను. ఆడవాళ్లు కూడా సైన్యంలో చేరవచ్చు అని మా టీచర్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కేవలం మగవాళ్లు మాత్రమే ఆర్మీలో చేరాలి కాబోలు అనుకునేదాన్ని’’ అని చెప్పింది. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాకు చెందిన పన్నెండు సంవత్సరాల సురీలి, బడిలో ఎప్పుడూ కాలు పెట్టలేదు. వంట చేయడం, బట్టలు ఉతకడం, నీళ్లు పట్టడం, పశువులకు మేత పెట్టడం... ఇదే ఆమె ప్రపంచం. మరోవైపు చూస్తే... ఆమె సోదరుడు ఎనిమిదవతరగతి చదువుకుంటున్నాడు. ఇది సురీలి మాత్రమే కాదు... మన దేశంలో లక్షలాది బాలికల దీన జీవనచిత్రం. ఆడపిల్ల అంటే... ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయడం, పెళ్లీడు వచ్చాక పెళ్ళి చేయడం... ఇక తమ బాధ్యత తీరింది అనుకోవడం... ఇలా కొద్ది మంది తల్లిదండ్రులు ఆలోచించబట్టే... చాలామంది ఆడపిల్లలు బడి గడప తొక్కలేకపోతున్నారు. కల కనడానికి సైతం నోచుకోలేకపోతున్నారు. సురీలిలాగే ఇంకా చాలామంది బాలికలకు తాము ఏం కోల్పోతున్నామో తెలియదు. వారికి చదువు ప్రాముఖ్యత గురించి చెప్పేవారు కూడా ఎవరు లేరు.‘ఎడ్యుకేట్ గర్ల్’ ఆ లోటును పూరిస్తుంది.బడికి దూరం అయిన, అవుతున్న ఆడపిల్లలను బడిలో చేర్పించడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యాపరంగా బాలురతో సమాన అవకాశం కల్పించడానికి కృషి చేస్తుంది. చదువుకు దూరమైన లక్షకు పైగా బాలికలను ఇప్పటి వరకు స్కూల్లో చేర్పించి వారి మెరుగైన భవిష్యత్ కోసం కృషి చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్స్’. ‘‘ఎన్నో వెనకబడిన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో పని చేశాను. అయితే... ఒక్క బాలిక కూడా... నేను బడికి వెళ్లను అని చెప్పలేదు. చదువు పట్ల వారి ఆసక్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది మాకు ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. మమ్మల్ని మరింత ఉత్సాహవంతంగా ముందుకు నడిపించడానికి తోడ్పడుతుంది’’ అంటున్నారు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్. ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్’ అయిన సఫీనా సౌత్ అమెరికా, ఆఫ్రికాలలో పనిచేశారు. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత... ఆడపిల్లల చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు. మాటల ద్వారా మాత్రమే కాదు... డాక్టర్, ఇంజనీర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, మ్యూజిషియన్... ఇలా రకరకాల పోస్టర్ల ద్వారా పిల్లలు తమదైన ఒక లక్ష్యం ఏర్పర్చుకునే దిశలో ప్రయత్నిస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ చదువు అనేది ఆడపిల్లల స్వీయ అభివృద్ధికి మాత్రమే కాదు... కుటుంబానికి, సమాజానికి, జాతికి కూడా ఎంతో ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని నలుదిశలా ప్రచారం చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’.