రెక్క విప్పిన కల!
‘కల’ నిజం చేసుకోవాలంటే...
ముందు ‘కల’ అంటూ ఒకటి కనాలి.
ఆ కలే లేకపోతే?
‘కల’ కనే పరిస్థితి ఊహకు కూడా అందకపోతే?!
ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి చురుగ్గా పని చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్వచ్ఛందసంస్థ. బడికి వెళ్లని పదిసంవత్సరాల అమ్మాయిని ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వాలంటీర్ ఒకరు అడిగారు...
‘‘నీకు చదువుకునే అవకాశం వస్తే... భవిష్యత్‌లో ఏమవుతావు?’’ అని.
సమాధానం... నిశ్శబ్దం! ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత మాత్రం....
‘‘ఇలా నన్ను ఎవరూ అడగలేదు. నాకు ఏం చెప్పాలో తెలియదు’’ అని చెప్పింది ఆ అమ్మాయి.
‘భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నావు?’ ఇదే ప్రశ్నను బడికి వెళుతున్న అమ్మాయిని అడిగితే...
‘‘ఆర్మీలో చేరాలనుకుంటున్నాను. ఆడవాళ్లు కూడా సైన్యంలో చేరవచ్చు అని మా టీచర్ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. కేవలం మగవాళ్లు మాత్రమే ఆర్మీలో చేరాలి కాబోలు అనుకునేదాన్ని’’ అని చెప్పింది.
రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాకు చెందిన పన్నెండు సంవత్సరాల సురీలి, బడిలో ఎప్పుడూ కాలు పెట్టలేదు. వంట చేయడం, బట్టలు ఉతకడం, నీళ్లు పట్టడం, పశువులకు మేత పెట్టడం... ఇదే ఆమె ప్రపంచం. మరోవైపు చూస్తే... ఆమె సోదరుడు ఎనిమిదవతరగతి చదువుకుంటున్నాడు. ఇది సురీలి మాత్రమే కాదు... మన దేశంలో లక్షలాది బాలికల దీన జీవనచిత్రం. ఆడపిల్ల అంటే... ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయడం, పెళ్లీడు వచ్చాక పెళ్ళి చేయడం... ఇక తమ బాధ్యత తీరింది అనుకోవడం... ఇలా కొద్ది మంది తల్లిదండ్రులు ఆలోచించబట్టే... చాలామంది ఆడపిల్లలు బడి గడప తొక్కలేకపోతున్నారు. కల కనడానికి సైతం నోచుకోలేకపోతున్నారు.
సురీలిలాగే ఇంకా చాలామంది బాలికలకు తాము ఏం కోల్పోతున్నామో తెలియదు.
వారికి చదువు ప్రాముఖ్యత గురించి చెప్పేవారు కూడా ఎవరు లేరు.‘ఎడ్యుకేట్ గర్ల్’ ఆ లోటును పూరిస్తుంది.బడికి దూరం అయిన, అవుతున్న ఆడపిల్లలను బడిలో చేర్పించడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, విద్యాపరంగా బాలురతో సమాన అవకాశం కల్పించడానికి కృషి చేస్తుంది. చదువుకు దూరమైన లక్షకు పైగా బాలికలను ఇప్పటి వరకు స్కూల్లో చేర్పించి వారి మెరుగైన భవిష్యత్ కోసం కృషి చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్స్’.
‘‘ఎన్నో వెనకబడిన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో పని చేశాను. అయితే... ఒక్క బాలిక కూడా... నేను బడికి వెళ్లను అని చెప్పలేదు. చదువు పట్ల వారి ఆసక్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇది మాకు ఎంతో స్ఫూర్తి దాయకంగా నిలిచింది. మమ్మల్ని మరింత ఉత్సాహవంతంగా ముందుకు నడిపించడానికి తోడ్పడుతుంది’’ అంటున్నారు ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్.
‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్’ అయిన సఫీనా సౌత్ అమెరికా, ఆఫ్రికాలలో పనిచేశారు. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత... ఆడపిల్లల చదువు గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ స్థాపించారు.
మాటల ద్వారా మాత్రమే కాదు...
డాక్టర్, ఇంజనీర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, మ్యూజిషియన్... ఇలా రకరకాల పోస్టర్ల ద్వారా పిల్లలు తమదైన ఒక లక్ష్యం ఏర్పర్చుకునే దిశలో ప్రయత్నిస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’
చదువు అనేది ఆడపిల్లల స్వీయ అభివృద్ధికి మాత్రమే కాదు... కుటుంబానికి, సమాజానికి, జాతికి కూడా ఎంతో ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని నలుదిశలా ప్రచారం చేస్తుంది ‘ఎడ్యుకేట్ గర్ల్స్’.