స్వాధీనం చేసుకున్న సొమ్ము నొక్కేసిన ఎస్ఐలు
చెన్నై : ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేసే సందర్భంగా స్వాధీనం చేసుకున్న సొమ్మును ఇద్దరు ఎస్ఐలు స్వాహా చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏర్కాడుకు చెందిన ఎం.కుప్పుస్వామి కారును సేలం కుప్పనూర్ చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి పోలీసులు ఆపారు. ఎన్నికల సందర్భంగా నియమితులైన ప్రత్యేక ఎస్ఐలు సుబ్రమణియన్, గోవిందన్ ఆ కారులో తనిఖీ చేశారు. కారు లోపల రెండు సంచుల్లో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆ నగదుకు సంబంధించి డాక్యుమెంట్లు లేకపోవడంతో సదరు సొమ్మును ఎన్నికల సహాయ అధికారి ముత్తురామలింగానికి అప్పగించారు. తాను 35 లక్షల రూపాయలు తెచ్చానని, ఇందులో 26.75 లక్షల రూపాయలు మాత్రమే ఉందంటూ బాధితుడు కుప్పుస్వామి ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సేలం డీఐజీ అమర్‌రాజా, ఎస్పీ శక్తివేల్ విచారించగా స్వాధీనం చేసుకున్న సొమ్ము నుంచి 8.25 లక్షల రూపాయలు ఇద్దరు ఎస్ఐలు నొక్కేసినట్లు తేలింది. దాంతో ఎస్ఐలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.