వైభవంగా శివకల్యాణం
లక్ష మందికిపైగా భక్తుల హాజరు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. ఐదురోజులపాటు జరుపుకునే రాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవం నిర్వహించారు. నగర పంచాయతీ తరఫున కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములు కల్యాణాన్ని కన్నులపండువగా జరిపించారు. ఉదయం 6 గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, అభిషేకాలు, పారాయణాలు, 6.50 గంటలకు తీర్థరాజపూజ, అవాహిత దేవతార్చనలు, వృషభ యాగం, ధ్వజారోహణం, ఎదుర్కోళ్ల కార్యక్రమం అనంతరం స్వామివారి కల్యాణం నిర్వహించారు.
సాయంత్రం పురాణ ప్రవచనం, ప్రధాన హోమం, సప్తపది, లాజాహోమం, ఔపాసనం, బలిహరణ కార్యక్రమాల అనంతరం రాత్రి పెద్దసేవపై స్వామివారిని ఊరేగించారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కల్యాణోత్సవం ముగియడంతో భక్తులు బయటికి వెళ్లే క్రమంలో ఉత్తర ద్వారం వద్ద తోపులాట చోటుచేసుకుంది. కార్యక్రమంలో ఈవో దూస రాజేశ్వర్, నగరపంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమ భర్త లక్ష్మీరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఏసీ ఉమారాణి, ఏఈవోలు గౌరీనాథ్, దేవేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, కౌన్సిలర్లు, పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు.