సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చా
‘‘నాది తూర్పు గోదావరి. సినిమాలంటే పిచ్చితో హైదరాబాద్ వచ్చా. పూరి జగన్నాథ్‌గారి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేశా. దర్శకుడిగా నా తొలి చిత్రం ‘నా రాకుమారుడు’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘గుంటూరోడు’ మాస్ సినిమా’’ అన్నారు దర్శకుడు ఎస్.కె. సత్య. మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్ జంటగా అట్లూరి బాలప్రసాద్ సమర్పణలో ఆయన దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ మార్చి 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్య చిత్ర విశేషాలు పంచుకున్నారు.
► పూర్తిగా ఓ కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి వచ్చిందే ‘గుంటూరోడు’. కమర్షియల్ స్టార్‌గా మనోజ్‌కి ఇమేజ్ తెచ్చే చిత్రమిది.
► కోటాగారు, మనోజ్, ప్రగ్యా జైస్వాల్, రాజేంద్రప్రసాద్, విలన్ సంపత్ పాత్రలు వాళ్లు మాత్రమే చేయగలరు అనేలా ఉంటాయి.
► కథ న్యారేషన్, పాత్రల పరిచయాన్ని సెలబ్రిటీలతో చెప్పిద్దామని ముందే ఫిక్సయ్యాం. చిరంజీవిగారు చెబితే ఎలా ఉంటుంది? అన్నారు మనోజ్. మోహన్‌బాబుగారు చిరంజీవిగారితో మాట్లాడటం, ఆయన ఒప్పుకోవడం జరిగింది.
► ప్రివ్యూ చూసిన వాళ్లందరూ సినిమా బాగుందని చెప్పారు. మా అబ్బాయిని ఎలా చూడాలను కుంటున్నానో అలా చూస్తున్నానని మోహన్‌బాబుగారు ఆనందపడ్డారు.
► ప్రస్తుతం మంచి ఆఫర్లు ఉన్నాయి. సైన్ చేశాక వివరాలు చెబుతా.