డ్రైవర్లపై ఫిర్యాదుకు ‘ఈ-కంప్లెయింట్’
సాక్షి, ముంబై: ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే డ్రైవర్లపై ఫిర్యాదు చేయడానికి రవాణాశాఖ త్వరలోనే ‘ఈ-కంప్లయింట్’ వ్యవస్థను ప్రారంభించనుంది. అంతేగాకుండా ఫిర్యాదు చేసిన 48 గంటల్లో సదరు డ్రైవర్‌పై ఎలాంటి చర్య తీసుకున్నారో తెలిపేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామని రవాణాశాఖ వర్గాలు వెల్లడించాయి. రవాణాశాఖ కార్యదర్శి ఎస్.కె.శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆన్లైన్ కంప్లెయింట్ వ్యవస్థ తయారీకి సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యామనీ, ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. మొదట అన్ని ఆటో, ట్యాక్సీల డ్రైవర్ల సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. అయితే వాహనం నంబర్ ఆధారంగా ప్రయాణికులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్లపై వెంటనే చర్యలు తీసుకోవచ్చని ఆయన వివరించారు.
ఇదిలా ఉండగా అధికచార్జీలు డిమాండ్ చే యడం, ప్రయాణికులను కోరినచోట దిగబెట్టడానికి తిరస్కరించడం, దురుసు ప్రవర్తన, మీటర్లలో అవకతవకలకు పాల్పడడం, మితిమీరిన వేగంతో వెళ్లడం వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి ఫిర్యాదులను వర్గీకరించి కేసులు నమోదు చేసేలా వెబ్‌సైన్‌ను రూపొందిస్తున్నారని శర్మ తెలిపారు. ప్రస్తుతం ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్ నంబరు 1800-22-0110కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. మహా ఆన్లైన్ లిమిటెడ్, మహారాష్ట్ర ప్రభుత్వం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉమ్మడిగా ఈ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తాడ్‌దేవ్ ఆర్టీవో పరిధిలో దాదాపు 37 వేల ట్యాక్సీలు రోడ్లపై సంచరిస్తుండగా జులైలో హెల్ప్‌లైన్ నంబర్‌కు 36 ఫిర్యాదులు వచ్చాయి. 2010 జూన్‌లో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించిన అనంతరం వచ్చిన 3,436 ఫిర్యాదులను రవాణాశాఖ పరిష్కరించింది. ఇదిలా ఉండగా 2012 అక్టోబర్‌లో వడాలా ఆర్టీవో అధికారులకు రోజుకు కనీసం రెండు ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం నెలకు 10 ఫిర్యాదులు మాత్రమే నమోదవుతున్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ-కంప్లెయింట్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తరువాత ప్రయాణికులు తాము చేసిన ఫిర్యాదు గురించి వాకబు చేయడానికి ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా సదరు డ్రైవర్లపై వెంటనే చర్య తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.