రైలెక్కిన పట్టాలు!
సాధారణంగా రైళ్లు పట్టాలెక్కుతాయి. కానీ పట్టాలే ఈ ‘స్కై ట్రాన్’లను ఎక్కుతాయి. అంటే... పట్టాలు రైలు కింద కాకుండా,
రైలు పైన ఉంటాయి. వాటిలోని మాగ్నెట్... రైలు బోగీల్లాంటి ఈ పాడ్ (చిన్న కారులాంటి వాహనం ) లను పట్టి ఉంచి, ముందుకు కదిలిస్తుంది.
ఉప్పల్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుంది? ట్రాఫిక్ పెద్దగా లేకపోతే కనీసం ఒక గంట! పడితే ఇంకో అరగంట అదనం. మెట్రో రైలు ఎక్కినా కనీసం 40 నిమిషాలు. అంతేనా? మరి.. ఇంత దూరాన్ని ఓ పదినిమిషాల్లోనే దాటేయగలిగితే ఎలా ఉంటుందంటారూ? కెవ్వు... కేకేగానీ... అయ్యే పనేనా? ‘ఓ ఎస్’ అంటున్నాడు జెర్రీ శాండర్స్! ఎలా అంటే మీరు పక్కనున్న ఫొటోలకేసి చూడాలి మరి! గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అతిచౌకైన, ట్రాఫిక్ ఇబ్బందుల్లేని ఈ సరికొత్త రవాణా వ్యవస్థ పేరు ‘స్కైట్రాన్’. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో కలసి జెర్రీ శాండర్స్, కొంతమంది ఔత్సాహిక ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సూపర్ ఐడియా! చైనా, జపాన్లలో నడుస్తున్న మ్యాగ్లెవ్ ట్రెయిన్ల గురించి మీరు వినే ఉంటారు.
బలమైన అయస్కాంతాలతో కూడిన ట్రాక్‌పై గాల్లో తేలుతున్నట్లు వేగంగా కదులుతాయి ఆ మ్యాగ్లెవ్ ట్రెయిన్లు. స్కైట్రాన్లోనూ ఇదే టెక్నాలజీ వాడతారు. కాకపోతే ఇక్కడ అయస్కాంతాలు అడుగున కాకుండా పైన ఉంటాయి. అంతే తేడా. ప్రయాణీకులతో కూడిన ట్యాక్సీల్లాంటి నిర్మాణాలు 20 అడుగుల ఎత్తయిన స్తంభాలను కలుపుతూ వేసిన అయస్కాంత ట్రాక్‌కు వేలాడుతూ ప్రయాణిస్తాయన్నమాట. మోడల్‌ను బట్టి ఒక్కో పాడ్‌లో ఇద్దరు, నలుగురు కూర్చునే వీలుంది. స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా మీరు ఒకచోటి నుంచి మరోచోటికి ప్రయాణించవచ్చు. మధ్యలో ఎక్కడా స్టాప్‌లు లేకపోవడం, మీ స్టాప్ వచ్చిన చోట మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా పాడ్ కిందికి దిగిపోవడం ఈ వ్యవస్థ ప్రత్యేకతలు. ఒక్కో మైలు స్కైట్రాన్ వ్యవస్థ ఏర్పాటుకు దాదాపు రూ.80 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. మెట్రో రైలు ఏర్పాటు చేయాలంటే ప్రతి కిలోమీటర్‌కు రూ.160 నుంచి రూ.280 కోట్ల వరకూ ఖర్చు అవుతుంది. అండర్‌గ్రౌండ్ మెట్రో అయితే ఇది రూ.400 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. స్కైట్రాన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌లోని ఓ యూనివర్సిటీలో 900 అడుగుల పొడవైన టెస్ట్ట్రాక్ను ఏర్పాటు చేసి టెక్నాలజీని పరీక్షించింది. ఈ ఏడాది చివరికల్లా లాగోస్‌లో పూర్తిస్థాయి ట్రాక్‌ను ఏర్పాటు చేయనుంది. కేరళ, బిహార్ రాష్ట్రాల్లోనూ స్కైట్రాన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి!