Hyderabad: పోలీసు అధికారుల బూట్లు, చెప్పులు చోరీ
మలక్‌పేట: బంగారం, డబ్బులు, బైక్‌లు, ఇతర విలువైవ వస్తువుల కోసం దొంగతనాలు, దోపిడీ జరగడం సాధారణంగా చూస్తుంటాం. కానీ.. అందుకు భిన్నంగా కొందరు ఆగంతకులు అపార్ట్మెంట్లలో చొరబడి దొరికిన కాడికి చెప్పులు దొంగతనం చేస్తున్నారు. చెప్పులే కదా ఎవరూ పట్టించుకోరు.. లేదా చెప్పులు అమ్ముకుంటే లాభం అనుకున్నారో ఏమో. ముగ్గురు, నలుగురు యువకులు కలిసి ముఠాగా ఏర్పడి చెప్పుల దొంగతనానికి పాల్పడుతున్నారు. వారు చెప్పులు, షూస్ తప్ప ఇతర వస్తువులు ముట్టుకోకపోవడం గమనార్హం.వివరాలు ఇలా ఉన్నాయి.. మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్ డివిజన్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని మైక్రో హెల్త్‌కేర్ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చెప్పులు చోరీకి గురయ్యాయి. అపార్ట్మెంట్లోని ఆరు పోర్షన్లలో చెప్పులు, బూట్లు పొద్దున వరకే మాయమయ్యాయి. దీంతో అపార్ట్‌మెంట్‌వాసులు విస్మయానికి గురయ్యారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించగా.. ముగ్గురు యువకులు ఆటోలో వచ్చి చెప్పులను మూట కట్టుకుని ఆటోలో వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు రికార్డు అయింది. పోలీసు అధికారి షూ.. చెప్పులు కూడా.. మెక్రో హెల్త్‌కేర్ లైన్ అపార్ట్మెంట్ వెనుక భాగంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఓ పోలీసు అధికారి షూస్, చెప్పులు కూడా దొంగతనం చేశారు. నాలుగు అపార్ట్మెంట్లలోని చెప్పులు మూట కట్టి ఖాళీగా ఉన్న స్థలంలో పడేశారు. అనంతరం వాటిని తీసుకొచ్చి ఆటోలో వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. చెప్పులు, షూస్ బ్రాండెండ్వే అని, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అపార్ట్మెంట్ వాసి రవిప్రసాద్ చావ్లా చెప్పారు. నెల రోజుల క్రితం ఇదే తరహాలో.. మైక్రో హెల్త్ కేర్ సంస్థ పక్కనున్న అపార్ట్మెంట్లో కూడా నెల రోజుల క్రితం చెప్పుల దొంగతనం జరిగింది. చోరీపై అపార్ట్మెంట్ నివాసి సయ్యద్ మహబూబ్ బాషా మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లోని 6 ఫ్లాట్లలో మొత్తం 30 జతల బూట్లు, 25 జతల చెప్పులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పిడమర్తి నరేష్ తెలిపారు.