Slum Dog Husband Movie
-
ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమావాళ్లకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ. చాలామంది ప్రత్యేకంగా ఈరోజే చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆరోజు రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్న సరే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికో, ప్రీపోన్ చేసుకోవడానికో ఇష్టపడరు. కచ్చితంగా ఫ్రైడేనే విడుదల చేస్తామంటారు. అలా ఈ రోజు(ఆగస్టు 25న) గాండీవధారి అర్జున, బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్(డబ్బింగ్) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో గాండీవధారి అర్జునకు మిశ్రమ స్పందన లభిస్తుండగా బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్‌కు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో కూడా కొత్త చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బింగ్ మూవీతో కలుపుకుని నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ల బ్రో మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు స్లమ్‌డాగ్ హజ్బెండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. బేబి మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పిజ్జా 3: ద మమ్మీ సైతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పిజ్జా 3 మూవీ థియేటర్లలో విడుదలై కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో వారం రోజులకే దీన్ని ఓటీటీలోకి తెచ్చేశారు. మీరు కూడా పైవాటిలో నచ్చిన మూవీని సెలక్ట్ చేసుకుని ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి.. చదవండి: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ టాక్.. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్.. ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే థియేటర్లలో మహా అయితే ఓ నాలుగైదు సినిమాలు మాత్రం ప్రతి వారం వస్తుండేవి. కానీ ఓటీటీ పుణ్యమా అని ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో కొత్త మూవీస్-వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈసారి కూడా అలానే ఏకంగా 21 సినిమాలు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) అయితే ఈ లిస్టులో తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటిలో బ్రో, బేబీ చిత్రాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అదే టైంలో పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీసులు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే దిగువన లిస్టులో 'స్ట్రీమింగ్ అవుతున్నాయి' అని రాసున్నవి గురువారం విడుదలైనవి అని, మిగతావన్నీ శుక్రవారం (ఆగస్టు 25) ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ బ్రో - తెలుగు మూవీ కిల్లర్ బుక్ క్లబ్ - ఇంగ్లీష్ సినిమా యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా - ఇంగ్లీష్ మూవీ హూ ఈజ్ ఎరిన్ కార్టర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) రగ్నారోక్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ స్లమ్ డాగ్ హజ్బెండ్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద రౌండప్: నో వే ఔట్ - కొరియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హాట్‌స్టార్ ఐరన్ హార్ట్ - ఇంగ్లీష్ సిరీస్ ఆఖరి సచ్ - హిందీ సిరీస్ ఆహా బేబీ - తెలుగు సినిమా జీ5 షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ - బెంగాలీ మూవీ బ్లాక్ అండ్ వైట్ - తమిళ సినిమా ఈ-విన్ పార్థుడు - తెలుగు డబ్బింగ్ సినిమా జియో సినిమా బజావో - హిందీ సిరీస్ సైనా ప్లే ఒన్నమ్ సాక్షి పరేతన్ - మలయాళ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే ఎబౌట్ మై ఫాదర్ - ఇంగ్లీష్ సినిమా మనోరమ మ్యాక్స్ కురుక్కన్ - మలయాళ చిత్రం హోయ్ చోయ్ కుముదిని భవన్ - బెంగాలీ సినిమా ఎమ్ఎక్స్ ప్లేయర్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ - హిందీ సిరీస్ (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) -
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ
టైటిల్: స్లమ్ డాగ్ హజ్బెండ్ నటీనటులు: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి నిర్మాణ సంస్థ:మైక్ మూవీస్ దర్శకత్వం: ఏఆర్ శ్రీధర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో విడుదల తేది: జులై 29, 2023 కథేంటంటే.. హైదరాబాద్‌లోని పార్శీగుట్టకు చెందిన లక్ష్మణ్ అలియాస్ లచ్చి(సంజయ్ రావు), మౌనిక(ప్రణవి మానుకొండ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే... ఇద్దరి జాతకాలు ఉండవు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే ఇరు కుటుంబాలలో ఎవరో ఒకరు చనిపోతారని చెబుతాడు పంతులు. ఈ గండం పోవాలంటే లచ్చి ముందుగా ఓ కుక్కను లేదా చెట్టును పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తాడు. స్నేహితుడు సంతోష్(యాదమ్మ రాజు)సలహాతో లచ్చి ఓ కుక్క(బేబీ)ని పెళ్లి చేసుకుంటాడు. వారం రోజుల తర్వాత ప్రియురాలు మౌనికతో పెళ్లి జరుగుతుండగా పోలీసులు లచ్చిని అరెస్ట్ చేస్తారు. బేబీ(కుక్క) ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారు. బేబీతో విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం నేరమని, విడాకుల కోసం రూ.20లక్షలు భరణంగా ఇవ్వాలని కుక్క ఓనర్ డిమాండ్ చేస్తారు. ఈ కేసు కోర్టుకెక్కుతుంది. మరి ఈ కేసులో ఎవరు గెలిచారు? బేబీ ఓనర్ ఎందుకు రూ.20లక్షలు డిమాండ్ చేస్తాడు? మౌనికతో లచ్చి పెళ్లి జరిగిందా లేదా? బేబీతో లచ్చి ఎలా ప్రేమలో పడ్డాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కుక్కతో పెళ్లి.. ఇది వినడానికే కాస్త వింతగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు మనం టీవీల్లో చూస్తుంటాం. జంతువులపై ప్రేమతోనో లేదా దోషం పోవాలనో కొంతమంది ఇలాంటి వింత పనులు చేస్తుంటారు. అదే పాయింట్‌ని కథగా మలిచి స్లమ్ డాగ్ హజ్బెండ్ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీధర్. మూఢనమ్మకంతో ఓ కుక్కను పెళ్లి చేసుకున్నాక..అతనికి ఏర్పడిన ఇబ్బందులు ఏంటనేది కామెడీగా చూపిస్తూనే..అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు. నా అనుకున్నవారే అవసరాన్ని బట్టి మోసం చేస్తుంటారు. కానీ జంతువులకు అలాంటివేవి తెలియదు. ఒక్కపూట తిండి పెడితే చాలు ఎంతో విశ్వాసం చూపిస్తాయని అనేది ఈ సినిమాలో చూపించారు. బస్తీకి చెందిన లచ్చి తన ప్రియురాలు మౌనికతో ఫోన్లో సెక్సీ స్పీకింగ్ చేస్తున్న సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కూడా కాసేపు ఆ తరహా సన్నివేశాలే ఉంటాయి.ఇవి యాత్‌ని బాగా ఆకట్టుకుంటాయి. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. ఇక కుక్కతో పెళ్లి కాస్సెప్ట్ ప్రారంభమై తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే కుక్కతో పెళ్లి జరిగే వరకు కాస్త ఎంటర్టైనింగ్ సాగుతుంది. ఆ తర్వాత కథ కోర్టు చుట్టు తిరుగుతుంది. కోర్డు రూమ్ సీన్స్ ఫేలవంగా ఉంటాయి. కామెడీ పండించడానికి ఆస్కారం ఉన్నా..దర్శకుడు సరిగా వాడుకోలేకపోయాడు. కుక్కకు ‘వెన్నెల’కిశోర్ వాయిస్ పెట్టడం..దాని వెనుక సీక్రెట్‌ని రివీల్ చేసే సీన్స్ అంతగా ఆకట్టుకోలేవు. కోర్టులో జంతువుల విశ్వాసం గురించి చెప్పే సీన్స్ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు రొమాంటిక్ సన్నివేశాలపై పెట్టిన శ్రద్ధ కామెడీపై కూడా పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. బస్తీకి చెందిన లచ్చి అలియాస్ లక్ష్మణ్‌గా సంజయ్ రావు జీవించేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు. ఇక మౌనికగా ప్రణవి మానుకొండ అదరగొట్టేసేంది. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండానే తనదైన నటన, మాటలతో యువతకు మత్తెకించేసింది. ఈ సినిమాలో యాదమ్మ రాజుకు మంచి పాత్ర లభించింది. హీరో స్నేహితుడు సంతోష్‌గా యాదమ్ రాజు కామెడీ సినిమాకు ప్లస్. అంతేకాదు క్లైమాక్స్ అతని పాత్ర ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది. కుక్క ఓనర్‌గా నటించిన వేణు కొలసాని తెరపై కనిపించేది కాసేపే అయినా తనదైన నటనతో అందరికి గుర్తిండిపోయేలా చేశాడు. ఇక లాయర్లుగా బ్రహ్మాజీ, సప్తగిరి నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భీమ్స్ సంగీతం సినిమాకు చాలా ప్లస్. 'లచ్చి గాని పెళ్లి' సాంగ్ థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తుంది. రెట్రోసాంగ్తో పాటు మిగతావి కూడా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
మన హద్దుల్లో ఉంటే అడ్డే ఉండదు: శ్రీలీల
‘‘చిత్ర పరిశ్రమ అనేది గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు చేసుకుంటే అడ్డేదీ ఉండదు.. ఎలాంటి ఇబ్బందులు రావు. తెలుగమ్మాయి అయిన హీరోయిన్ ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే’’ అని హీరోయిన్ శ్రీలీల అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీలీల మాట్లాడుతూ– ‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ సినిమా సూపర్ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘మా సినిమాలో వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’’ అన్నారు ఏఆర్ శ్రీధర్. ‘‘శ్రీలీల, వైష్ణవీ చైతన్య, ప్రణవి తెలుగు అమ్మాయిలే. నా కొత్త సినిమాకు తెలుగు అమ్మాయినే హీరోయిన్గా తీసుకుంటా’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ హిట్ అయితే మరో పదిమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాం’’ అన్నారు అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి. -
ఆర్జీవీకి కథ చెబితే ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టాడు : బ్రహ్మాజీ
‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ స్టోరీని రామ్ గోపాల్‌వర్మకు వినిపించి టైటిల్ అడిగితే ‘కుక్క మొగుడు’అయితే బాగా సెట్ అవుతుందని చెప్పారు. కానీ మా నిర్మాత మాత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ అని పెడితేనే బాగుంటుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా కథ, కథనం రెండూ కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’అని సీనియర్ నటుడు బ్రహ్మాజీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన బ్రహ్మాజీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా షూటింగ్ టైంలోనే నిర్మాత అప్పి రెడ్డి ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి అని అన్నారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బాగుందని చెప్పాను. ఇందులో లాయర్ పాత్రను మీరే అనుకుంటున్నామని అప్పుడు చెప్పారు. మరి హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదని అన్నారు. ఆ తరువాత ఓ నెలకు మా అబ్బాయిని అడగమని అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెబితే నచ్చింది. అలా సినిమా స్టార్ట్ చేశాం. ►సంజయ్ డాగ్ లవర్ అవ్వడంతో కాన్సెప్ట్‌కు ఈజీగా కనెక్ట్ అయ్యాడు. పైగా ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మొన్న ఓ సారి పుష్ప పార్ట్ 2 షూటింగ్లో ఉన్నాను. రాత్రి పూట షూటింగ్ జరుగుతోంది. బన్నీ ఆ ట్రైలర్‌ను చూసి నా దగ్గరకు వచ్చి ప్రశంసించాడు. ట్రైలర్ నిజంగా బాగుందని అన్నాడు. టీం అందరికీ చెప్పి చూపించాడు. ►మామూలుగా నేను కొత్తగా చేసే పాత్రలు రావు. ఎందుకంటే రకరకాల పాత్రలు చేసి ఉన్నాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే ఓ కొత్త కారెక్టర్ దొరికింది. ఓల్డ్ సిటీలో ఉండే లాయర్. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడే ఓ కారెక్టర్. విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా ఇందులో కనిపిస్తాను. ► సప్తగిరి నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమాలో మా ఇద్దరి సీన్లు పోటాపోటీగా ఉంటాయి. సప్తగిరి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఇందులో జడ్జిగా ఫిష్ వెంకట్ కనిపించడం హైలెట్‌గా నిలుస్తుంది. ► జూలై 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. అదే టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జూలై 29న ఫిక్స్ అయ్యాం. ► భీమ్స్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నారు. మా సినిమాకు మంచి మాస్, మెలోడీ పాటలు ఇచ్చారు. మ్యూజికల్ హిట్ అవుతుంది. ► సుకుమార్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తాను అని అన్నారు. కానీ అర్జెంట్‌గా అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది. రాలేకపోతోన్నాను.. వీడియో బైట్ పంపిస్తాను అని మెసెజ్ పెట్టారు. ఆయన ఇక్కడ ఉండుంటే.. కచ్చితంగా వచ్చేవారు. ► ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం, ప్రభాస్ సలార్, బాలయ్య గారి భగవంత్ కేసరి, ఊరి పేరు భైరవకోన, నాగ శౌర్యతో ఓ సినిమా చేస్తున్నాను. ప్రభాస్ సలార్ సినిమాలో కొత్త కారెక్టర్ వేస్తున్నాను. రెండో పార్ట్‌లోనే ఎక్కువగా కనిపిస్తాను. -
Slumdog Husband Movie: ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టని ఇంటర్వ్యూ
-
అద్దం ముందు డైలాగ్స్ చెప్పేదాన్ని
‘‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ కథ కొత్తగా ఉంటుంది. ఇందులో నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు ప్రణవి మానుకొండ. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ నెల 29న రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రణవి మాట్లాడుతూ– ‘‘నాకు చిన్నప్పటి నుంచి నటనంటే ఇష్టం. బాల నటిగా మంచి ఆఫర్లు వచ్చాయి. అనుష్కగారి ‘అరుంధతి’ సినిమా డైలాగ్స్‌ను అద్దం ముందు నిలబడి చెప్పేదాన్ని. ‘రొటీన్ లవ్ స్టోరీ, ఉయ్యాలా జంపాలా, అమిగోస్’ సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. సీరియల్స్‌లోనూ లీడ్‌గా చేశాను. హీరోయిన్గా ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ఫస్ట్ మూవీ. నేను తెలుగమ్మాయిని కావడం ప్లస్‌గా భావిస్తున్నా. ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పటికీ నా ఫోకస్ సినిమాలపైనే’’ అన్నారు. -
బన్నీని చూసి ఇండస్ట్రీలోకి వచ్చా: యంగ్ హీరో సంజయ్ రావు
మా నాన్న(బ్రహ్మాజీ)ను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత బన్నీ(అల్లు అర్జున్)ని ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన జర్నీ నాకు తెలుసు. ఓ పెద్ద నిర్మాత కొడుకు ఈజీగా సినిమాల్లోకి వచ్చాడు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వేరు. సినిమాల కోసం బన్నీ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన పడే కష్టం మా నాన్న నాకు రోజు చెబుతూ ఉంటారు. నేను కూడా బన్నీలాగే కష్టపడి ఇండస్ట్రీలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను’అని యంగ్ హీరో సంజయ్ రావు అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. ప్రణవి మానుకొండ హీరోయిన్. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా హీరో సంజయ్ రావు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ఈ కథ మా నాన్న ద్వారా నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెబుతూనే ఆయన తెగ నవ్వుకున్నారు. నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది. వెంటనే ఒకే చేశా. ►రెగ్యూలర్ సినిమాల్లో హీరోయిన్ అంటే గ్లామర్.. హీరోయిన్ పెట్టాలని పెడతారు. కానీ ఈ సినిమాలో ప్రణవి రోల్ ఫుల్ లెంగ్త్‌లో ఉంటుంది. చాలా ముఖ్యమైన పాత్ర ఆమెది. ఈ సినిమాలో చాలా మంది డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయని అనుకుంటున్నారు. అలాంటివేమి ఉండవు. జనరల్‌గా రాత్రి పూట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకునేదే ఉంటుంది. అదే రియాలిటీ ఉంటుంది. ఈ రియాలిటీకి యంగ్ జనరేషన్ కనెక్ట్ అవుతోంది. ►ఈ సినిమాలో బేబీ (కుక్క)దే కీరోల్. అదే సినిమాను మొత్తం డిసైడ్ చేస్తుంది.నేను డాగ్ లవర్ కావడంతో షూటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేశా. ►సెట్స్‌లో మా నాన్నను ఓ నటుడిగానే చూస్తా. కో యాక్టర్‌గానే కలిసి నటిస్తా. పుష్ప షూటింగ్లో అల్లు అర్జున్ గారు నాన్నతో మాట్లాడారు. 'బ్రహ్మాజీ మీ కొడుకు సినిమా ట్రైలర్ అదిరిపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది..' అని బన్నీ గారు అన్నారు. కారు ఎక్కే ముందు ఫయాద్ ఫజిల్ గారికి ఈ ట్రైలర్‌ను కచ్చితంగా చూడాలని చెప్పారు. ►నాకు పెద్దగా ఎవరితో పరిచయాలు లేవు. నేను ఎవరి అయినా కలవాలంటే వాళ్ల ఇంటి బయట నిల్చుంటా. భీమ్లా నాయక్ సినిమా సమయంలో త్రివిక్రమ్‌ను కలిసేందుకు ఐదు రోజులు అక్కడ జనాల మధ్య లైన్లో నిలబడ్డా. ఒక బౌన్సర్ నన్ను చూసి ఏంటి సార్ అక్కడ నిల్చున్నారని అన్నాడు. తరువాత రెండు నిమిషాలు త్రివిక్రమ్ గారితో మాట్లాడా. ►నేను నావీ నుంచి కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చా. ఆ తరువాత యాక్టింగ్‌లో శిక్షణ కోసం ముంబై వెళ్లా. ఆళ్ల పురుషోత్తం గారి దగ్గరకు వెళ్లా. లావణ్య త్రిపాఠి గారు అక్కడే శిక్షణ తీసుకున్నారు. ఆమె మా నాన్నతో చెప్పి అక్కడికి రికమెండ్ చేశారు. అక్కడ వెళితే.. స్టూడెంట్స్ అంతా నార్త్ వాళ్లే ఉన్నారు. నాది హైదరాబాద్ అని చెబితే.. హైదరాబాదా..? సౌత్ ఇండియానా..? అని ఒక రకంగా చూశారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ ముందుకు వెళుతోంది. ఇప్పుడు ముంబైలో అడుగుపెడితే మనకు ఇచ్చే గౌరవమే వేరు. ►హీరోగా రెండు సినిమాలు ఉన్నాయి. అవి హోల్డ్‌లో పెట్టా. ఒక సినిమా షూట్ స్టార్ట్ అయింది. ఓ పిట్టకథ చిత్రం కో డైరెక్టర్‌గా పనిచేసిన సాయికృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నా. నాకు వెబ్‌సిరీస్ అని.. సినిమా అని వేరే క్యాటగిరీలు ఉండవు.