Smita sabarval
-
మెరుగైన అర్హతలు మాకూ ఉన్నాయ్..
వియ్ డిజర్వ్ బెటర్’.. ఆగ్రహంలోంచి దూసుకొచ్చిం దొక వాగ్బాణం. సంధించారు స్మితా సబర్వాల్. మానవీ యతా, పాలనాదక్షతా కలబోసుకున్న అధికారి. తెలం గాణ సీఎంఓలో అదనపు కార్యదర్శి. దేశంలోనే అలాంటి అరుదైన గౌరవం పొందిన ఏకైక మహిళా ఐఏఎస్ ఆఫీ సర్. 38 ఏళ్లకే గొప్ప హోదా పొందిన స్మిత.. తన అను భవంలోంచి చెబుతున్నారు.. ‘వియ్ డిజర్వ్ బెటర్’ అని. బయటకొచ్చి పని చేసే మహిళలకు సలహా ఇస్తున్నారు - దారితప్పినోళ్లు వక్రంగా వాగుతూ పక్కకి లాగబోతే వెన కడుగు వేయబోకండని. పనితనాన్ని వదిలేసి పైటల సౌందర్యం గురించి వెకిలి రాతలూ, వికారపు గీతలూ ప్రచురించిన ‘అవుట్‌లుక్’ మీద స్మిత ఇప్పుడు కోపంగా ఉన్నారు. తన స్థాయిని తక్కువ చేసి ‘డీప్ త్రోట్’ లోంచి చెత్త గుమ్మరించిన ఆ పత్రికపై న్యాయ పోరాటానికి దిగారు. మానవాభివృద్ధి కోసం మనసు పెట్టి పనిచేసిన అధి కారి స్మితా సబర్వాల్. సర్కారు బడిపిల్లల తిండీతిప్పల్ని పట్టించుకోవడమూ, తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గుద లకు ప్రత్యేక శ్రద్ధ పెట్టడమూ, ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించడం వంటి చర్యలు సామా న్యుల పట్ల ఆమె నిబద్ధతను వెల్లడిస్తాయి. సరైన తిండి లేక పాలిపోయిన ఆడవాళ్ల కోసం ఒక అధికారిగా తన పరిధిలో చేయగలిగింది చేశారు స్మిత. పల్లెల్లో పిల్లలు.. సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకుంటూ నగర బాలలతో సంభాషించగలగాలనీ, తెలియంది తెలుసుకుంటూ విజ్ఞానాన్ని విస్తరించుకోవాలనీ కలగనడమే కాదు.. కరీం నగర్ కలెక్టర్‌గా అలాంటి చర్యలకూ శ్రీకారం చుట్టారు. ఒంట్లో నెత్తురు లేని బాలికలకు చౌకగా దొరికే తిండి ఏం తినాలో నింపాదిగా వివరించిన అరుదైన అధికారి స్మిత. అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా ఉన్న కులవివక్షనూ ఆమె వద ల్లేదు. కరీంనగర్ జిల్లా సుందరగిరి జెడ్పీ స్కూల్లో- దళిత మహిళలు తయారు చేసిన మధ్యాహ్న భోజనం ముట్ట వద్దని పిల్లలపై ‘పై కులపోళ్లు’ ఒత్తిడి తెస్తే-ఆమె ఆ బడి కొచ్చి భోంచేయడం.. కులచిచ్చును ఎగదోయబోయిన టీచర్ని సస్పెండ్ చేయడం.. కొందర్ని హెచ్చరించడం.. ఇవన్నీ రాజ్యాంగనీతికి ఆమె ఇచ్చిన విలువను చెప్పకనే చెబుతాయి. ‘మా వంట తినొద్దంటే ధర్నాచేసినం. మేడ మ్ అచ్చింది. అధికార్లకి గట్టిగ చెప్పింది. గాడ ఇంక అట్ల నే ఉంది’ అంటున్నది అప్పట్లో ఆ బళ్లో వంటచేసిన మల్ల వ్వ. కట్టడిచేసే యంత్రాంగం లేకపోతే అంతే! అణచి వేత పెట్రేగుతుంది. వాతావరణం కలుషితమైపోతుంది. క్షాళన చేయడానికి వేలమంది స్మితలు కార్యనిర్వాహక వ్యవస్థలోకి రావాలి. యువత వాళ్ల నుంచి స్ఫూర్తి పొందాలి. అధికారులు మానవ హృదయ సహజ లక్షణాలకు అతీతులు కాదు. అభిరుచులూ ఆనందాలూ వాళ్లకీ ఉం టాయి. తమదైన కళాదృష్టి వాళ్ల జీవనశైలిలో ప్రతిఫలిం చవచ్చు. ముచ్చటైన చీరల్లో బహు ముచ్చటగా కన్పిం చొచ్చు. అలాంటి సందర్భాల్లో ఫొటోలు తీసి మీడి యాలో ఫోకస్ చేయడం.. వారి మాటలకూ, చేతలకూ తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోవడం.. ఒక్కోమారు పూర్తిగా లక్ష్యపెట్టకపోవడం.. పెచ్చుమీరుతున్న ట్రెండ్. కడుపులో కడదేరిపోతున్న ఆడపిండాల్ని రక్షించడానికి రాజ్యం పూనుకోవాలన్న బృందాకారత్ ప్రసంగాన్ని వది లేసి, ఆమె ఫొటో మాత్రమే ఫోకస్ చేసిందొక ప్రముఖ జాతీయ దినపత్రిక. గ్లామర్ విమెన్‌ను ఫోకస్ చేసే మార్కెట్ సొసైటీ.. అవి లేని వాళ్లను వెనక వరసలో నిల బెడుతుంది. వాళ్లని గుర్తించ నిరాకరిస్తుంది. ‘సృజనాత్మ కత’ ముసుగులో వర్ణవివక్షతో ఎందరెందర్నో గాయ పరుస్తుంది. గాయాల్ని రోజూ కెలుకుతుంటుంది. సామా జికన్యాయ భావననే గేలిచేస్తుంది. నగలు ధరించి వెలిగి పోతున్న ఐశ్వర్యారాయ్‌కి ఓ నల్ల బాలుడు గొడుగుపడు తున్న దృశ్యంతో ఇటీవల ఓ ఆభరణాల కంపెనీ వెలు వరించిన యాడ్ దీనికి కొనసాగింపే. సామాజిక కార్య కర్తలు అభ్యంతరపెట్టడంతో ఆ కంపెనీ యాడ్‌ని వెనక్కి తీసుకుంది. మార్కెట్ కోసం మహిళల గౌరవంతో ఆడు కునేవాళ్లూ, చిన్న‘చూపు’తో వాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చేవాళ్ల్లూ కొంతైనా వెనక్కి తగ్గాలంటే ఇలాంటి అభ్యంతరాలూ, నిరసనలూ వెల్లువెత్తాలి. న్యాయ పోరా టాలు జరగాలి. జనంకోసం పనిచేసిన అధికారిగా సమా జంలో, సామాజిక మాధ్యమాల్లో స్మితా సబర్వాల్‌కి లభించిన గొప్ప మద్దతూ, ఆదరణా సాధారణ మహిళ వరకూ విస్తరించాలి. వి.ఉదయలక్ష్మి. మొబైల్: 90102 01642 -
అధికారుల గుండెల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:జిల్లా కొత్త కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బాధ్యతలు చేపట్టడంతో అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. బుధవారం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే విధుల్లో చేరిపోవడమేకాక, అధికారులను పరుగులు పెట్టించారు. తనను కలిసేందుకు వచ్చిన అధికారులతో అప్పటికప్పుడు సమీక్ష నిర్వహించటంతోపాటు మెదక్ ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. మరో అడుగు ముందుకు వేసి జెడ్పీ సీఈఓ ఆశీర్వాదంతో... జిల్లాలో విధులు సక్రమంగా నిర్వహించని ఎంపీడీఓల జాబితా సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. విధులు స్వీకరించిందే మొదలు స్మితా సబర్వాల్ మెరుపువేగంతో పాలనా వ్యవహరాల్లో మునిగిపోవటం అధికారులను ఆశ్చర్యచకితులను చేయటంతోపాటు ఒకింత ఆందోళన రేకిత్తించిందని చెప్పవచ్చు. ముక్కుసూటి అధికారిగా స్మితా సబర్వాల్‌కు పేరుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె అవినీతి అధికారులు, విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై కఠినంగా వ్యవహరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిని సైతం ఆమె బదిలీ చేయించారు. అలాగే 40 మంది తహశీల్దార్లను ఒకేమారు బదిలీ చేసి పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేశారు. పరిపాలన వ్యవహారాలు, విధి నిర్వహణతోపాటు అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించే సబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాబోయే రోజుల్లో ఆమె పాలనాపరంగా తనదైన ముద్ర వేసేందుకు జిల్లాలో కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతూ వస్తోంది. గ్రీవెన్స్‌సెల్, ఫోన్‌ఇన్, గ్రామదర్శి, పరిష్కారం సెల్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కలెక్టర్‌కు అందే ఫిర్యాదులు, సమస్యల వెల్లువ తగ్గని పరిస్థితి ఉంది. అలాగే చాలాకాలంగా కలెక్టర్ శాఖల వారీగా నిర్వహించే సమీక్షలు మినహా డీఆర్సీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ జరగలేదు. అధికారుల పనితీరు సమగ్రంగా సమీక్షించే అవకాశం లేకుండాపోయింది. దీనికితోడు జిల్లాకు హైదరాబాద్ సమీపంగా ఉండటంతో జిల్లా అధికారులు పలువురు అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు. మరికొంత మంది వారంలో ఒకరోజు వచ్చి వెళ్తున్న అధికారులు లేకపోలేదు. మరోవైపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో ఉంటే ఇదే అదనుగా జిల్లా అధికారులు తమ శాఖలో అందుబాటులో ఉండేవారు కాదు. కొన్ని సందర్భాల్లో కలెక్టరేట్ అధికారులు లేకుండా బోసిపోయి కనిపించేది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చేవారికి పని జరగకుండానే తిరిగి ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పరిపాలన వ్యవహారాల్లో కలెక్టర్ దినకర్‌బాబు కఠినంగా వ్యవహరించకపోవటాన్ని అలుసుగా తీసుకుని మరికొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముక్కుసూటి అధికారిగా పేరొందిన స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించటంతో అధికార యంత్రాంగంలో ఓ వైపు ఆందోళన చెందుతూనే మరోవైపు అప్రమత్తత కనిపిస్తోంది. -
నేడు విధుల్లోకి కొత్త కలెక్టర్
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్లో ప్రస్తుత కలెక్టర్ దినకర్ బాబు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె చేరికపై ఇన్నాళ్లూ కొనసాగిన అనుమానాలకు తెరపడింది. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న దినకర్ బాబును మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరక్టర్‌గా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ డైరక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను మెదక్ కొత్త కలెక్టర్‌గా నియమిస్తూ గత మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడి వారం రోజులు గడవటంతో స్మితా సబర్వాల్ బాధ్యతల స్వీకరణపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దినకర్ బాబు మెదక్ జిల్లా కలెక్టర్‌గా 2014 సాధారణ ఎన్నికలు వరకు కొనసాగించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు దినకర్‌బాబుకు మద్దతుగా సీఎంను కలిసినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్ కొనసాగేందుకు ఆసక్తితో ఉన్న దినకర్‌బాబు తన బదిలీ నిలిచిపోయేలా కొంత ప్రయత్నం చేశారు. అయితే ఇటు దినకర్‌బాబు, అటు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించడం ఖాయమైపోయింది. బక్రీద్ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ బుధవారం మంచి రోజు కావడంతో స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సామాన్యులకు సేవ చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని పరుగు పెట్టించే కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో అవినీతి అధికారులకు చెక్ పెట్టడంతోపాటు ప్రభుత్వ పథకాల అమలులోనూ తనదైన ముద్రవేశారు.