అధికారుల గుండెల్లో గుబులు
Published Thu, Oct 17 2013 4:25 AM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:జిల్లా కొత్త కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బాధ్యతలు చేపట్టడంతో అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. బుధవారం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే విధుల్లో చేరిపోవడమేకాక, అధికారులను పరుగులు పెట్టించారు. తనను కలిసేందుకు వచ్చిన అధికారులతో అప్పటికప్పుడు సమీక్ష నిర్వహించటంతోపాటు మెదక్ ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించారు. మరో అడుగు ముందుకు వేసి జెడ్పీ సీఈఓ ఆశీర్వాదంతో... జిల్లాలో విధులు సక్రమంగా నిర్వహించని ఎంపీడీఓల జాబితా సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం.
విధులు స్వీకరించిందే మొదలు స్మితా సబర్వాల్ మెరుపువేగంతో పాలనా వ్యవహరాల్లో మునిగిపోవటం అధికారులను ఆశ్చర్యచకితులను చేయటంతోపాటు ఒకింత ఆందోళన రేకిత్తించిందని చెప్పవచ్చు. ముక్కుసూటి అధికారిగా స్మితా సబర్వాల్‌కు పేరుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆమె అవినీతి అధికారులు, విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై కఠినంగా వ్యవహరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారిని సైతం ఆమె బదిలీ చేయించారు. అలాగే 40 మంది తహశీల్దార్లను ఒకేమారు బదిలీ చేసి పాలనను గాడిలో పెట్టే ప్రయత్నాలు చేశారు. పరిపాలన వ్యవహారాలు, విధి నిర్వహణతోపాటు అవినీతి అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించే సబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
రాబోయే రోజుల్లో ఆమె పాలనాపరంగా తనదైన ముద్ర వేసేందుకు జిల్లాలో కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో జిల్లా అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతూ వస్తోంది. గ్రీవెన్స్‌సెల్, ఫోన్‌ఇన్, గ్రామదర్శి, పరిష్కారం సెల్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కలెక్టర్‌కు అందే ఫిర్యాదులు, సమస్యల వెల్లువ తగ్గని పరిస్థితి ఉంది. అలాగే చాలాకాలంగా కలెక్టర్ శాఖల వారీగా నిర్వహించే సమీక్షలు మినహా డీఆర్‌సీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ జరగలేదు. అధికారుల పనితీరు సమగ్రంగా సమీక్షించే అవకాశం లేకుండాపోయింది. దీనికితోడు జిల్లాకు హైదరాబాద్ సమీపంగా ఉండటంతో జిల్లా అధికారులు పలువురు అక్కడి నుంచే రాకపోకలు సాగిస్తూ వస్తున్నారు.
మరికొంత మంది వారంలో ఒకరోజు వచ్చి వెళ్తున్న అధికారులు లేకపోలేదు. మరోవైపు కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో ఉంటే ఇదే అదనుగా జిల్లా అధికారులు తమ శాఖలో అందుబాటులో ఉండేవారు కాదు. కొన్ని సందర్భాల్లో కలెక్టరేట్ అధికారులు లేకుండా బోసిపోయి కనిపించేది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు వచ్చేవారికి పని జరగకుండానే తిరిగి ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పరిపాలన వ్యవహారాల్లో కలెక్టర్ దినకర్‌బాబు కఠినంగా వ్యవహరించకపోవటాన్ని అలుసుగా తీసుకుని మరికొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ముక్కుసూటి అధికారిగా పేరొందిన స్మితా సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించటంతో అధికార యంత్రాంగంలో ఓ వైపు ఆందోళన చెందుతూనే మరోవైపు అప్రమత్తత కనిపిస్తోంది.
Advertisement