సీఎం బందోబస్తు.. సిద్దిపేట ఎస్పీ చూస్తారు | siddipeta SP.. lookout CM's security | Sakshi
Sakshi News home page

సీఎం బందోబస్తు.. సిద్దిపేట ఎస్పీ చూస్తారు

Published Tue, Oct 4 2016 10:08 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సీఎం బందోబస్తు.. సిద్దిపేట ఎస్పీ చూస్తారు - Sakshi

సీఎం బందోబస్తు.. సిద్దిపేట ఎస్పీ చూస్తారు

అధికారులను, ఆయుధాలను పంచాను
ఎస్పీ కార్యాలయాల ఏర్పాట్లు పూర్తి
అదనంగా సిద్దిపేటలో 2, సంగారెడ్డిలో పోలీస్‌ డివిజన్‌ కోసం ప్రతిపాదనలు
ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆర్భాటానికి ఆయన ఆమడ దూరం. ఎక్కడా హడావుడి లేదు. కానీ ప్రతి పని పక్కాగా...పకడ్బందీగా నిర్వర్తిస్తారు. ఇప్పటికే ప్రతిపాదిత మూడు జిల్లాల్లో ఎవరి బలగాలు వాళ్లకు.. ఎక్కడి కార్యాలయాలు అక్కడ సిద్ధం చేసి పెట్టారు. ఎవరి ఆయుధాలు వాళ్లకు అప్పగించారు. అత్యంత ఆత్మవిశ్వాసంతో ‘సిద్దిపేట జిల్లా ప్రారంభ పండగకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆ జిల్లా ఎస్పీనే బందోబస్తు నిర్వహిస్తారని ప్రకటించారు. కొద్దికాలంలోనే జిల్లాపై తనదైన ముద్ర వేసిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖీ..
సాక్షి: పండుగ రోజు సీఎం బందోబస్తు మీరు చూస్తారా? కొత్త ఎస్పీనా?
ఎస్పీ: నా అంచనా ప్రకారమైతే కొత్త ఎస్పీలు దసరా కంటే ముందే విధుల్లోకి వస్తారు. కొత్త జిల్లా ప్రారంభ కార్యక్రమానికి సిద్దిపేట పట్టణానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిద్దిపేట ఎస్పీనే బందోబస్తు నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లాలో  డీఎప్పీ కార్యాలయాన్ని ఎస్పీ క్యాంపు కార్యాలయంగా,  కొత్తగా కట్టిన వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ను ఎస్పీ కార్యాలయంగా చేస్తున్నాం. మెదక్‌ జిల్లాలో చారి ఆసుపత్రిని ఎస్పీ కార్యాలయంగా, మాచవరంలో రెసిడెన్సీని ఏర్పాటు చేశాం. అయితే ఇవి తాత్కాలికమే. సాధ్యమైనంత త్వరలో సొంత భవనాలు కట్టుకొని అందులోకి వెళ్తాం.

సాక్షి: అధికారుల పంపిణీ, ఆయుధాల పంపిణీ అయిపోయిందా?
ఎస్పీ: ఎక్కడి  అధికారులు, సిబ్బంది అక్కడే ఉంటారు. ప్రస్తుతానికి వాళ్లకు బదిలీలు ఉండవు. అందరికీ వర్క్‌ టూ సర్వ్‌ ఆర్డర్లు జారీ చేస్తాం. ఇక ఎస్పీ కార్యాలయం మినిస్టీరియల్‌ సిబ్బందిని, అధికారులను ఇతర సిబ్బందిని ఆయా జిల్లాల జనాభా ప్రాతిపదికన విభజన చేశాం. ఎస్పీ కార్యాలయంలో ఉండే 10 విభాగాల సిబ్బందిని 45, 30, 25 నిష్పత్తి చొప్పున సంగారెడ్డి జిల్లాకు 649 మందిని, సిద్దిపేటకు 425, మెదక్‌కు జిల్లాకు 353 మందిని పంపిణీ చేశాం. ఆయుధాలనూ అదే పద్ధతిలో పంపిణీ చేశాం.

సాక్షి: కొత్తగా ఎన్ని పోలీసుస్టేషన్లు రాబోతున్నాయి?
ఎస్పీ: కొత్తగా 3 పోలీసు డివిజన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. సిద్దిపేట రూరల్, గజ్వేల్, జహీరాబాద్‌ను ప్రతిపాదించాం. ఇక అల్లాదుర్గంను సర్కిల్‌ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొత్తగా ఎన్ని మండలాలు అమల్లోకి వస్తే అన్ని పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఈ స్టేషన్లకు అవసరమైతే వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐలకు తాత్కాలికంగా పోస్టింగ్‌ ఇస్తాం.

సాక్షి: పోలీసు శాఖలో ఎన్ని కొత్త పోస్టులకు అవకాశం ఉంది? మీరు ఎక్కడ పోస్టింగ్‌ ఇవ్వొచ్చు?
ఎస్పీ: క్షేత్రస్థాయి అనుభవాల తరువాత ఆయా జిల్లాలకు ఇంకా ఎన్ని పోస్టులు అవసరం అవుతాయో అంచనా వేస్తాం. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇక నా విషయం అంటారా..!  ప్రభుత్వం నాకు ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వర్తిస్తా. ఇక్కడే చేస్తా...అక్కడైతే చేయలేననేది లేదు.

సాక్షి: కొత్త జిల్లాల సరిహద్దులతో పోలీసింగ్‌లో సమస్యలు ఏర్పడవా?
ఎస్పీ: అలాంటి ఏమీ ఉండదు. కాకపోతే పోలీసు శాఖ మరింత సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. నేరాల అదుపునకు అంతర్‌ జిల్లా, రాష్ట్ర నేర ముఠాలను పట్టుకోవడానికి ఒక జిల్లా ఎస్పీ పక్క జిల్లా ఎస్పీతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంటారు. అంతర్రాష్ట్ర విషయానికి వస్తే తరచుగా బోర్డర్‌ క్రైం మీటింగ్‌లు పెడతాం. ఇంకో విషయం చెప్పాలి. జహీరాబాద్‌ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అందుకే ఇక్కడ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే కొంత సులువుగా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement