SP Chandrasekhar Reddy
-
సీఎం బందోబస్తు.. సిద్దిపేట ఎస్పీ చూస్తారు
అధికారులను, ఆయుధాలను పంచాను ఎస్పీ కార్యాలయాల ఏర్పాట్లు పూర్తి అదనంగా సిద్దిపేటలో 2, సంగారెడ్డిలో పోలీస్ డివిజన్ కోసం ప్రతిపాదనలు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఆర్భాటానికి ఆయన ఆమడ దూరం. ఎక్కడా హడావుడి లేదు. కానీ ప్రతి పని పక్కాగా...పకడ్బందీగా నిర్వర్తిస్తారు. ఇప్పటికే ప్రతిపాదిత మూడు జిల్లాల్లో ఎవరి బలగాలు వాళ్లకు.. ఎక్కడి కార్యాలయాలు అక్కడ సిద్ధం చేసి పెట్టారు. ఎవరి ఆయుధాలు వాళ్లకు అప్పగించారు. అత్యంత ఆత్మవిశ్వాసంతో ‘సిద్దిపేట జిల్లా ప్రారంభ పండగకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఆ జిల్లా ఎస్పీనే బందోబస్తు నిర్వహిస్తారని ప్రకటించారు. కొద్దికాలంలోనే జిల్లాపై తనదైన ముద్ర వేసిన ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డితో ‘సాక్షి’ ముఖాముఖీ.. సాక్షి: పండుగ రోజు సీఎం బందోబస్తు మీరు చూస్తారా? కొత్త ఎస్పీనా? ఎస్పీ: నా అంచనా ప్రకారమైతే కొత్త ఎస్పీలు దసరా కంటే ముందే విధుల్లోకి వస్తారు. కొత్త జిల్లా ప్రారంభ కార్యక్రమానికి సిద్దిపేట పట్టణానికి వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిద్దిపేట ఎస్పీనే బందోబస్తు నిర్వహిస్తారు. సిద్దిపేట జిల్లాలో డీఎప్పీ కార్యాలయాన్ని ఎస్పీ క్యాంపు కార్యాలయంగా, కొత్తగా కట్టిన వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌ను ఎస్పీ కార్యాలయంగా చేస్తున్నాం. మెదక్ జిల్లాలో చారి ఆసుపత్రిని ఎస్పీ కార్యాలయంగా, మాచవరంలో రెసిడెన్సీని ఏర్పాటు చేశాం. అయితే ఇవి తాత్కాలికమే. సాధ్యమైనంత త్వరలో సొంత భవనాలు కట్టుకొని అందులోకి వెళ్తాం. సాక్షి: అధికారుల పంపిణీ, ఆయుధాల పంపిణీ అయిపోయిందా? ఎస్పీ: ఎక్కడి అధికారులు, సిబ్బంది అక్కడే ఉంటారు. ప్రస్తుతానికి వాళ్లకు బదిలీలు ఉండవు. అందరికీ వర్క్ టూ సర్వ్ ఆర్డర్లు జారీ చేస్తాం. ఇక ఎస్పీ కార్యాలయం మినిస్టీరియల్ సిబ్బందిని, అధికారులను ఇతర సిబ్బందిని ఆయా జిల్లాల జనాభా ప్రాతిపదికన విభజన చేశాం. ఎస్పీ కార్యాలయంలో ఉండే 10 విభాగాల సిబ్బందిని 45, 30, 25 నిష్పత్తి చొప్పున సంగారెడ్డి జిల్లాకు 649 మందిని, సిద్దిపేటకు 425, మెదక్‌కు జిల్లాకు 353 మందిని పంపిణీ చేశాం. ఆయుధాలనూ అదే పద్ధతిలో పంపిణీ చేశాం. సాక్షి: కొత్తగా ఎన్ని పోలీసుస్టేషన్లు రాబోతున్నాయి? ఎస్పీ: కొత్తగా 3 పోలీసు డివిజన్ల కోసం ప్రతిపాదనలు పంపాం. సిద్దిపేట రూరల్, గజ్వేల్, జహీరాబాద్‌ను ప్రతిపాదించాం. ఇక అల్లాదుర్గంను సర్కిల్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొత్తగా ఎన్ని మండలాలు అమల్లోకి వస్తే అన్ని పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఈ స్టేషన్లకు అవసరమైతే వీఆర్‌లో ఉన్న ఎస్ఐలకు తాత్కాలికంగా పోస్టింగ్ ఇస్తాం. సాక్షి: పోలీసు శాఖలో ఎన్ని కొత్త పోస్టులకు అవకాశం ఉంది? మీరు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వొచ్చు? ఎస్పీ: క్షేత్రస్థాయి అనుభవాల తరువాత ఆయా జిల్లాలకు ఇంకా ఎన్ని పోస్టులు అవసరం అవుతాయో అంచనా వేస్తాం. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. ఇక నా విషయం అంటారా..! ప్రభుత్వం నాకు ఎక్కడ ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వర్తిస్తా. ఇక్కడే చేస్తా...అక్కడైతే చేయలేననేది లేదు. సాక్షి: కొత్త జిల్లాల సరిహద్దులతో పోలీసింగ్‌లో సమస్యలు ఏర్పడవా? ఎస్పీ: అలాంటి ఏమీ ఉండదు. కాకపోతే పోలీసు శాఖ మరింత సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. నేరాల అదుపునకు అంతర్ జిల్లా, రాష్ట్ర నేర ముఠాలను పట్టుకోవడానికి ఒక జిల్లా ఎస్పీ పక్క జిల్లా ఎస్పీతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంటారు. అంతర్రాష్ట్ర విషయానికి వస్తే తరచుగా బోర్డర్ క్రైం మీటింగ్‌లు పెడతాం. ఇంకో విషయం చెప్పాలి. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అందుకే ఇక్కడ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే కొంత సులువుగా ఉంటుంది. -
నిబంధనలు పాటించాలి
మండపాల నిర్వాహకులకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచన సంగారెడ్డి టౌన్: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రాహాల ప్రతిష్ఠ, మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలు జారీ చేశామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని కోరారు. విగ్రహాల ప్రతిష్టాపన కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులు పొందాలని సూచించారు. వివాదాస్పద స్థలాల్లో, రోడ్డు మధ్యలో మండపాలు నిర్మించొద్దన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకుల వివరాలు, విగ్రహాలను తీసుకువెళ్ళే దారి, నిమజ్జన స్థలం తదితర వివరాలు అనుమతి పొందే సమయంలో సమర్పించాలని తెలిపారు. మైక్ అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని ఉపయోగించాలన్నారు. మండలపాల వద్ద గుర్తు తెలియని వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచా కాల్చరాదని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మతసామరస్యంతో వేడుకలు జరుపుకోవాలని కోరారు. -
తప్పుల కొలత!
ఇదీ పోలీస్ ఎంపిక ప్రక్రియ తీరు కొలతల పేరుతో అభ్యర్థులకు గుండెకోత వందలాది మంది పోలీస్ కొలువులకు దూరం 500 మందికి అన్యాయం జరిగినట్టుగా ఆరోపణలు చట్టబద్ధత లేని స్కేల్ ఉపయోగిస్తున్నారంటున్న అభ్యర్థులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష ప్రక్రియలో మరో కోణం బయటికొచ్చింది. తప్పుడు మెజర్మెంటుతో తమకు అన్యాయం చేస్తున్నారని ఎంపిక ప్రక్రియలో డిస్క్వాలిఫై అయిన అభ్యర్థులు వాపోతున్నారు. ఎత్తు, ఛాతీ, చుట్టుకొలతల విషయంలో పోలీసుల స్కేల్ తప్పుగా ఉందంటూ వారంతా కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తూనికలు కొలతల అధికారులు కొలతల మెజర్మెంట్ స్కేల్ తెచ్చినప్పటికీ మళ్లీ పోలీసుల మెజర్మెంట్తోనే కొలతలతో అన్యాయం జరిగిందని, ఇది తమ జీవి తాల్ని దెబ్బతీసిందని అభ్యర్థులు వాపోతున్నారు. పక్కాగా లేని కొలతలతో పరేషాన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి పోలీసు శాఖ లో భారీ ఖాళీలు ఏర్పడటంతో లక్షలాది మంది యు వత ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకొని పరీక్షల్లో అర్హత సాధించారు. కాని ఈవెంట్స్‌లో పోలీస్ అధికారులు తప్పుల తడకగా కొలతలు కొలిచి వందలాది మంది అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టేశారు. 6వ జోన్ లో సుమారు 10 వేల పోలీస్ కానిస్టేబుల్, 539 ఎస్ఐ పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేష¯ŒS జారీ చేసింది. వేలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కొందరు అటు ఎస్ఐగా, ఇటు కా నిస్టేబుల్గానూ ప్రాథమిక అర్హత పరీక్షల్లో అర్హత సాధించారు. వీరికి 20 రోజులుగా మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ముందుగా ఎస్ఐ పోస్టులకు పూర్తయ్యా యి. కానిస్టేబుల్ పోస్టులకు ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయి మెజర్మెంటుతో సంపూర్ణ విశ్వాçÜంతో బరిలోకి దిగిన అభ్యర్థులు ఊహించని విధంగా ఎత్తు, ఛాతీ చుట్టుకొలతల పరీక్షల్లో డిస్క్వాలిఫై అవుతున్నారు. నిబంధన ప్రకారం తూనికలు –కొలతల శాఖ అధికారులు సూచించిన మెజర్మెం ట్ స్కేల్ ఆధారంగా ఎత్తు కొలవాల్సి ఉండగా పోలీ సులు రూపొందించిన స్కేల్‌తో కొలవటం వలన కనీసం 2 సెంటీమీటర్ల ఎత్తులో తేడా వస్తుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒకటి–రెండు అంగుళాల ఎత్తు తక్కువ ఉందనే కారణంతో దాదాపు 250 మందిని రిజెక్టు చేశారు. ఈ మెజర్మెంట్ స్కేల్‌కు చట్టబద్దత లేదని అభ్యర్థులు అంటున్నారు. ఇదేం విడ్డూరం? ఎస్ఐ ఎంపిక పరీక్షల్లో ఎత్తు, ఛాతీల్లో అర్హత సాధిం చిన అభ్యర్థులు కానిస్టేబుళ్ల ఈవెంట్స్‌కు సైతం వ చ్చారు. ఎస్ఐగా క్వాలిఫై అయిన వారిని కానిస్టేబుల్ అర్హత పరీక్షల్లో నిరాకరించడం వివాదాలకు తావి స్తోంది. దీంతో 256 మంది అభ్యర్థులు పోలీసు కొలతలు తప్పుగా ఉన్నాయంటూ ఒక్కో అభ్యర్థి రూ. 500 ఛలానా చెల్లించి అప్పీల్ చేసుకున్నారు. తూని కలు కొలతలశాఖ, వైద్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి తిరిగి ఈనెల 25న మళ్లీ 256 మందికి కొలతలు నిర్వహించారు. ఇందులో 80 మంది వర కు అర్హత సాధించినట్లు అధికారులు సర్టిఫై చేశారు. అయినా పోలీసుల మెజర్మెంట్ స్కేల్ తప్పుగా ఉం దని, అందువల్లే అర్హత కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. తూనికలు కొలతల మెజర్మెంట్ స్కేల్ తెచ్చినప్పటికీ మళ్లీ పోలీసుల మెజర్మెంట్తోనే కొలతలు తీసుకుంటుండటంతో అన్యాయం జరుగుతోందని వారంటున్నారు. ఎత్తు, ఛాతీ విషయంలో మెజర్మెంట్ స్కేల్ అంతా ఒక్కటే ఉంటుందా? లేక పోలీసులది వేరేగా ఉంటుందా? అనేది పోలీసులే చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏళ్ల తరబడి శిక్షణ పొంది తీరా తప్పుడు కొలతలతో తమకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. త్రిసభ్య కమిటీ సమక్షంలో కొలతలు తీశాం అభ్యర్థుల ఎత్తు, ఛాతీ, చుట్టుకొలత లెక్క కట్టడానికి తూనికలు–కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ సర్టిఫై చేసిన మెజర్మెంట్ స్కేల్‌నే ఉపయోగించాం. రూ.500 చలానా కట్టి ఛాలెంజ్ చేసిన అభ్యర్థుల కోసం ముగ్గురు సభ్యుల కమిటీ వేశాం. ఈ కమిటీలో జిల్లా ఎస్పీగా నేను, తూనికలు–కొలతల శాఖ ఇన్ స్పెక్టర్, ప్రభుత్వ వైద్యుడు ఉన్నారు. అందరి సమక్షంలోనే కొలతలు చేశాం. సవాల్ చేసిన 250 మందిలో 36 మంది క్వాలిఫై అయ్యారు. ఇందులో లెక్క తప్పటానికి అవకాశం లేనే లేదు. తల ఎంత వరకు దించాలి?, ఎంత ఎత్తాలో స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఇలా చేయడంలో ఏ కాస్త తేడా వచ్చినా కొన్ని సెంటిమీటర్లు ఎక్కువగా వస్తాయి. అదే కొలమానం కాదు కదా.! ఏ అభ్యర్థికీ అన్యాయం జరగకుండా ప్రామాణికమైన కొలతలు ఉపయోగించాం.– ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి -
జిల్లాలో పోలీసు యాక్టు అమలు
సంగారెడ్డి టౌన్: జిల్లాలో మంగళవారం నుంచి నెల రోజుల పాటు 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, సమావేశాలు, సభలు, నిరాహార దీక్షలు చేపట్టరాదన్నారు. -
అప్రమత్తంగా ఉండండి
సీఎం సభలో అవరోధాలు సృష్టించొచ్చు బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి అదనపు ఎస్పీ ఆదేశాలు కర్నూలు: సీఎం బహిరంగ సభలో కొంతమంది అంతరాయం కలిగించే అవకాశం ఉన్నందున విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. కర్నూలు జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి బందోబస్తు విధులు నిర్వహించేందుకు భారీ సంఖ్యలో సోమవారం సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయానికి తరలివచ్చారు. పరేడ్ మైదానంలో హాజరైన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు చెక్‌పోస్టు, బస్టాండు, రైల్వే స్టేషన్ లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ వద్ద వీవీఐపీలను మాత్రమే అనుమతించాలని సూచించారు. అనుమానితులు కనిపించగానే సంబంధిత సెక్టార్ ఇన్‌చార్జీలకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అనంతరం ఏపీఎస్పీ రెండవ పటాలంలోని హెలిప్యాడ్, ప్రభుత్వ అతిధిగృహం, ఔట్‌డోర్ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ రిహార్సల్ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రమణమూర్తి, బాబుప్రసాద్, కె.శ్రీనివాసులు, వై.హరినాథ్‌రెడ్డి, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు. బాంబ్ స్వ్కాడ్ బృందాలుముమ్మర తనిఖీ: మూడు బాంబ్‌స్క్వాడ్ బృందాలు, రెండు డాగ్‌స్వ్కాడ్ బృందాలు సోమవారం నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఏపీఎస్పీ మైదానంలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ఔట్‌డోర్ స్టేడియంలోని బహిరంగ సభ స్థలం వరకు రోడ్లకు ఇరువైపులా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల పార్కింగ్ స్థలాలు ఇవే ►వీఐపీ వాహనాల పార్కింగ్ ఎస్టీబీసీ కళాశాల మైదానం. ►స్కూలు విద్యార్థులు, మహిళా సంఘాలు, ఇతర ప్రజలు తరలివచ్చే వాహనాలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్. ►బహిరంగ సభకు ప్రవేశ ద్వారాలు ►వీవీఐపీలకు ఔట్‌డోర్ స్టేడియం మెయిన్‌గేటు, మహిళా సంఘాలు, స్కూలు విద్యార్థులకు సింహపురి కాలనీ స్కూలు గేటు, మున్సిపల్ ఆఫీసు గేటు ద్వారా ప్రవేశం. వాహనాల దారి మళ్లింపు కర్నూలు నగరంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆదోని, కోడుమూరు వైపు నుంచి వచ్చే వాహనాలు బళ్లారి చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు నిషేధం ప్రకటించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కల్లూరు, బిర్లాగేటు, కలెక్టరేట్, రాజ్‌విహార్ మీదుగా ఎగ్జిబిషన్ మైదానం చేరుకోవాల్సి ఉంటుంది. -
పుష్కరాలు విజయవంతం
జిల్లాకు రెండో స్థానం, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ క్రైం : అందరి సహకారంతో గోదావరి పుష్కరాలు విజయవంతమయ్యూయని ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన జిల్లాల్లో కరీంనగర్‌కు మొదటి స్థానం, నిజామాబాద్‌కు రెండో స్థానం దక్కడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని 11 ప్రాంతాల్లో 18 ఘాట్ల వద్ద జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఒక కోటి లక్ష మంది పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే పోచంపాడ్ ఉండడంతో ైెహ దరాబాద్ నుంచి ఎక్కువ మంది పోచంపాడ్‌కు వచ్చారని, దీంతో అందరూ పోచంపాడ్‌కు వెళ్లకుండా.. సావెల్, దోంచందా, గుమ్మిర్యాల్, తడ్పాకకు భక్తులను తరలించి ట్రాఫిక్ రద్దీని నివారించామని వెల్లడించారు. ఇందల్వాయి టోల్గేట్ నుంచి పుష్కరాలకు వెళ్లే మార్గంలో ఘాట్ల వివరాలు తెలిపే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. 300 మంది ఎస్పీఓలు.. 300 మంది గ్రామీణ యువకులను స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (ఎస్పీఓ)గా రూట్ బందోబస్తుకు నియమించి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వీరికి నిత్యం ఒక్కొక్కరికి రూ. 150 చెల్లించామని చెప్పారు. బాసరకు వెళ్లే మార్గంలో జిల్లా సరిహద్దు యంచ, కందకుర్తి, పోచంపాడ్ వద్ద 50 ఎకరాలకు స్థలాలను గుర్తించి పార్కింగ్ కోసం ఉపయోగించామని వెల్లడించారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల పోలీసు లు కూడా పుష్కరాల్లో విధులు నిర్వర్తిం చారని గుర్తుచేశారు. ఆరుగురు మృతి.. పుష్కర సమయంలో ముగ్గురు రోడ్డు ప్రమాదాలు, మరో ముగ్గురు గోదావరి నదిలో పడి చనిపోయినట్లు ఎస్పీ చెప్పా రు. తప్పిపోరుున 297 మందిని పోలీస్ కంట్రోల్ రూంకు తరలించి మైక్‌ల ద్వారా అనౌన్స్ చేసి వారి వారి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. 15 మంది బ్యా గ్లు పోగొట్టుకోగా.. 13 మందికి బ్యాగ్‌లు అప్పగించామని, 10 మంది సెల్ఫోన్లు పోగొట్టుకోగా 9 మందికి ఇప్పించామని ఎస్పీ గుర్తుచేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఎస్బీ డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
వేధిస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలి
ఎస్పీని కలిసిన బాధితురాలు నిజామాబాద్క్రైం : మరిది(భర్త తమ్ముడు) వేధింపుల నుంచి తనను, తన పిల్లలను కాపాడాలని ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన దేవుసరి రేఖ మంగళవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వేడుకుంది. మరిది తనపై దౌర్జన్యం చేస్తున్నాడని, అత్యాచారం చేసి చంపాలని ప్ర యత్నించాడని, అతని వల్ల తన కు, తన పిల్లలకు ప్రాణభయం ఉందని చెప్పింది. అనంతరం బాధితురాలు తన ఇద్దరు పిల్లల తో కలిసి జిల్లా కేంద్రంలోని సాక్షి కార్యాలయానికి వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. రేఖ భర్త పోతన్న పదేళ్ల క్రితం విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. వీరికి ఒక బాబు(13), పాప(11) ఉన్నారు. భర్త చనిపోయిన నాటి నుంచి భర్త తమ్ముడు విజయ్‌కుమార్ నిత్యం వేధిస్తున్నాడని తెలిపింది. ఈనెల 17న తనను వెంట్రుకలు పట్టుకుని ఈడ్చుకుని ఇంట్లోకి లాక్కెళ్లాడని, తాను ప్రతిఘటించడంతో ఆయన భార్య శోభ, ఆమె తల్లిదండ్రులు కలిసి తనను, పిల్లలను చంపేందుకు దాడి చేశారని విలపించింది. గల్లీవాసులు, కులస్తులు తమను కాపాడి తన మరిదిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారని చెప్పింది. పుష్కరాలు పూర్తయ్యూక రమ్మని చెప్పడంతో ఈనెల 27న మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని, పోలీసులు విజయ్‌కుమార్ , అతని భార్య శోభను స్టేషన్‌కు తీసుకొచ్చి నామమాత్రపు విచారణ జరిపి పంపించి వేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. తన భర్త చనిపోయూక తమకున్న ఐదెకరాల పొలం అమ్మగా వచ్చిన రూ. 5 లక్షలు మరిది విజయ్ తన తల్లిని బెదిరించి దుబారా ఖర్చు చేశాడని తెలిపింది. అలాగే ఆలూరులోని పాత ఊరులో ఉన్న ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బులు, తల్లి ఆరోగ్యం ఖర్చుల కొరకు దాచిన పెట్టిన డబ్బులు రూ. 18 వేలు సైతం వాడుకున్నాడని తెలిపింది. తన ఆత్తకు సంబంధించిన మూడు తులాల బంగారం, తన భర్త మృతితో వచ్చిన నష్టపరిహారం రూ. 50 వేలు కూడా అతడే వాడుకున్నాడని వివరించింది, ఈనెల 16న అత్త అనారోగ్యంతో చనిపోతే చావు ఖర్చులకు మరిది ఒక్కపైసా ఇవ్వలేదని, తన వద్ద ఉన్న రూ. ఆరువేలు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చానని చెప్పింది. మరుసటి రోజు తనను, తన పిల్లలను చంపి తన ఇంటిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. రేఖ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే ఆర్మూర్ పోలీసులకు విషయాన్ని తెలిపి బాధితురాలికి అండగా ఉంటడాలని ఆదేశించారు. -
మహిళలపై వేధింపులను ఉపేక్షించం
►ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం ►దొంగనోట్ల చలామణి అరికడతాం ►పోలీసులు సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దు ► పెట్రోలింగ్ ముమ్మరం చేస్తాం ►కొత్త ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి నిజామాబాద్ క్రైం : జిల్లాలో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీ సుకోనున్నట్లు జిల్లా ఎస్పీగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెరిగిన టెక్నాలజీ వల్ల మహిళలు ఎక్కువగా వేధింపుల కు గురవుతున్నారని, వారి కి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మహిళలు స్వేచ్ఛగా పోలీసులను ఆశ్రయించవచ్చని అన్నారు. మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విభాగంలో అందరూ మహిళ అధికారులనే నియమిస్తామన్నారు. ఫిర్యాదులు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. చైన్ స్నాచింగ్‌లను నిరోధించేదుకు శ్రద్ధ పెడతామన్నారు. ఈ తరహా చోరీలపై మహిళలను చైతన్య పరుస్తామన్నారు. జిల్లాలో మహిళ పోలీస్స్టేషన్లు పెంచేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం చేసి జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షిస్తామన్నారు. పాత నేరస్తులపై నిఘా పెడతామన్నారు. జిల్లాలో ఆటోడ్రైవర్ల ఆగడాలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసిందని, అటువంటి వారి ఆటలు కట్టించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నకిలీ నోట్ల చెలమణి ఎక్కువ ఉందని తెలిసిందన్నారు. పోలీస్స్టేషన్లలో ఎస్సైలు సివిల్ తగాదాలు, సెటిల్మెంట్లు చేస్తే ఉపేక్షించేదిలేదన్నారు. న్యాయం కోసం పోలీస్స్టేషన్లకు వచ్చే బాధితులతో పోలీసులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాపై అవగాహన ఉంది మెదక్ జిల్లా రామచంద్రపురం డీఎస్పీగా, ఆదిలాబాద్ జిల్లా ఓఎస్డీగా విధులు నిర్వహించే సమయంలో తనకు జిల్లా గురించి కొంత అవగాహన ఏర్పడిందన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ పరిధి అతిక్రమించకుండా విధులు నిర్వహిస్తానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మండలం తిర్మారాస్‌పల్లి గ్రామానికి చెందిన తాను పుట్టి పెరిగింది పల్లె ప్రాంతంలోనేన్నారు. 10వ తరగతి వరకు గ్రామంలోనే చదివాను, గ్రామీణ ప్రజల బాధలు తనకు తెలుసన్నారు. పేదలకు న్యాయం జరిగేలా కృషిచేస్తానన్నారు. అంతకుముందు ఎస్పీ తరుణ్‌జోషీ కొత్త ఎస్పీకి పూల బొకేతో స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు.