మండపాల నిర్వాహకులకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచన
సంగారెడ్డి టౌన్: వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విగ్రాహాల ప్రతిష్ఠ, మండపాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన నియమ నిబంధనలు జారీ చేశామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు విధిగా నిబంధనలు పాటించాలని కోరారు.
విగ్రహాల ప్రతిష్టాపన కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతులు పొందాలని సూచించారు. వివాదాస్పద స్థలాల్లో, రోడ్డు మధ్యలో మండపాలు నిర్మించొద్దన్నారు. గణేష్ ఉత్సవ నిర్వాహకుల వివరాలు, విగ్రహాలను తీసుకువెళ్ళే దారి, నిమజ్జన స్థలం తదితర వివరాలు అనుమతి పొందే సమయంలో సమర్పించాలని తెలిపారు. మైక్ అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వాటిని ఉపయోగించాలన్నారు.
మండలపాల వద్ద గుర్తు తెలియని వాహనాలు, వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి బాణసంచా కాల్చరాదని తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా మతసామరస్యంతో వేడుకలు జరుపుకోవాలని కోరారు.