జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్‌లో ప్రస్తుత కలెక్టర్ దినకర్ బాబు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్‌లో ప్రస్తుత కలెక్టర్ దినకర్ బాబు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె చేరికపై ఇన్నాళ్లూ కొనసాగిన అనుమానాలకు తెరపడింది. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న దినకర్ బాబును మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరక్టర్‌గా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ డైరక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను మెదక్ కొత్త కలెక్టర్‌గా నియమిస్తూ గత మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడి వారం రోజులు గడవటంతో స్మితా సబర్వాల్ బాధ్యతల స్వీకరణపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.
దినకర్ బాబు మెదక్ జిల్లా కలెక్టర్‌గా 2014 సాధారణ ఎన్నికలు వరకు కొనసాగించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు దినకర్‌బాబుకు మద్దతుగా సీఎంను కలిసినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్ కొనసాగేందుకు ఆసక్తితో ఉన్న దినకర్‌బాబు తన బదిలీ నిలిచిపోయేలా కొంత ప్రయత్నం చేశారు. అయితే ఇటు దినకర్‌బాబు, అటు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించడం ఖాయమైపోయింది. బక్రీద్ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ బుధవారం మంచి రోజు కావడంతో స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సామాన్యులకు సేవ చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని పరుగు పెట్టించే కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో అవినీతి అధికారులకు చెక్ పెట్టడంతోపాటు ప్రభుత్వ పథకాల అమలులోనూ తనదైన ముద్రవేశారు.