dinakar babu
-
పరి‘ఛీ’లన
సాక్షి, సంగారెడ్డి: అనుకున్నట్లే జరిగింది. సొసైటీల అక్రమాలకు ఎప్పటిలాగే జిల్లా సహకార శాఖ అధికారులు వంత పాడారు. భారీ అవకతవకతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గానికి జిల్లా సహకార శాఖ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. ఆరోపణల తీవ్రత రీత్యా సమగ్ర విచారణ జరపకుం డానే కేవలం ‘పరిశీలన’తో సరిపెట్టుకున్నారు. పాలకవర్గం మాటలు నమ్మి మోసపోయిన బాధిత రైతులను కనీసం సంప్రదించకుండానే పరిశీలన తంతును సైతం తూతూమంత్రంగా ముగించేశారు. అసలు అక్రమాలేవి జరగలేదని నిగ్గు తేల్చేసి కళ్లకు గంతలు కట్టారు. వెల్దుర్తి పీఏసీఎస్‌పై జిల్లా సహకార శాఖ జరిపిన ఉత్తుత్తి పరిశీలనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కక్కుర్తి నేపథ్యం.. ఓ ప్రైవేటు కంపెనీలో బీమా చేయించుకుంటేనే రుణాలు చెల్లిస్తామని వెల్దుర్తి పీఏసీఎస్ మెలిక పెట్టి మరీ రైతుల ద్వారా ప్రీమియం కట్టించుకుంది. 2007-10 మధ్యకాలంలో సుమారు 300 మంది రైతులు రూ.20 లక్షల వరకు బీమా ప్రీమియాన్ని చెల్లించారు. ఆ సమయంలో వెల్దుర్తి పీఏసీఎస్ చైర్మన్ టి. అనంతరెడ్డి కుమారుడు టి. నరేందర్ రెడ్డి స్థానికంగా మ్యాక్స్ లైఫ్ న్యూయార్క్ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో బీమా వ్యాపారాన్ని పెంచుకోవడానికి పీఏసీఎస్‌ను సదరు బీమా సం స్థ కార్యాలయంగా మార్చేశారు. రుణ మొత్తం ఆధారంగా ఒక్కోక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు మినహాయించుకుని ప్రీమియంగా కట్టించుకున్నారు. ఒక్కో బీమాపై 10 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను బీమా సంస్థ నుంచి పొందారు. గతేడాది బీమా కాలపరిమితి మించిపోయినా పునరుద్ధరించకుండా గప్‌చుప్‌గా ఉండిపోయారు. దీంతో రైతులు కట్టిన ప్రీమి యం ఉత్తిపుణ్యానికి బీమా సంస్థ జేబుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంపై గతేడాది ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్పటి కలెక్టర్ దినకర్ బాబు విచారణకు ఆదేశించారు. జిల్లా సహకార శాఖాధికారి సాయికృష్ణుడు కలెక్టర్ ఉత్తర్వులకు భిన్నంగా పరిశీలన జరిపిం చారు. మెదక్ డివిజన్ సహకార అధికారి కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డీ చంద్రశేఖర్‌ను గత సెప్టెంబర్ 12న పరిశీలన అధికారిగా నియమించారు. ఆయన ఇటీవల సమర్పించిన నివేదికలోని సారాంశం ఇలా ఉంది. ఆరోపణ: బీమా పేరుతో అక్రమ వసూళ్లు పరిశీలన నివేదిక: సొసైటీలో ప్రత్యేక కౌంటర్ పెట్టి బీమా వసూలు చేసే అంశంపై ఉద్యోగులు, పాలకవార్గనికి నోటిసులు జారీ చేశాం. డీసీసీబీ బ్యాంక్ సర్క్యులర్ మేరకే కౌంటర్ ఏర్పాటు చేసి రైతులను బీమా సంస్థకు పరిచయం చేయడానికి పరిమితమయ్యామని సమాధానమిచ్చారు. సొసైటీ అధ్యక్షుడు, సిబ్బందిని విచారించిన తర్వాత సొసైటీ సిబ్బంది బీమా సంస్థ తరఫున అనధికారికంగా ప్రీమియం వసూలు చేయలేదని తేలింది. ఆరోపణ: రుణమాఫీ పథకం-2008 అమలులో సైతం అక్రమాలు జరిగాయి. రుణాలు ఇచ్చే సమయంలో నిబంధనల మేరకు 10 శాతం మొత్తాన్ని సొసైటీలో రైతు వాటాగా మినహాయించకుంటారు. రుణ మాఫీ తర్వాత ఈ 10 శాతం వాటాలను రైతులకు తిరిగి చెల్లించలేదు. పరిశీలిన నివేదిక: రుణ మాఫీ కింద లబ్ధిపొందిన రైతులకు వారి 10 శాతం వాటా ధనాన్ని తిరిగి చెల్లించలేదని సంబంధించిన రికార్డులను పరిశీలించగా తేలింది. లబ్ధిదారులు ఎవరైనా వచ్చి రాతపూర్వకంగా వాటా ధనం అడిగితే చెల్లిస్తామని సొసైటీ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. సొసైటీలో రుణ మాఫీ పథకం అమలుపై శాఖపరమైన ఆడిట్ జరిపిన ఆడిటర్లు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు. ఆరోపణ: మాజీ సీఈఓ వి.నర్సింహ రెడ్డి అనధికార పెత్తనం పరిశీలన నివేదిక: వెల్దుర్తి పీఏసీఎస్‌లో సీఈఓగా పనిచేసిన నర్సింహ రెడ్డి డీసీసీబీ తూప్రాన్ శాఖకు బదిలీ అయ్యారు. ఆయన తరుచుగా సొసైటీని సందర్శించి రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బందికి సహకరించే వారు. సొసైటీ మెలు కోరే ఆయనీ సేవలందించారు. అందుకు ఈ విషయంపై తదుపరి విచారణ అవసరం లేదు. ఆరోపణ: వెల్దుర్తి సొసైటీలో 2009-13 మధ్యకాలంలో ఎన్నో ఆర్థిక అవకతవకతలు జరిగాయి. పరిశీలన నివేదిక: పైన పేర్కొన్న విషయాలు మినహా .. 2009-13 మధ్యకాలంలో సొసైటీ జరిపిన లావాదేవీలపై పరిశీలన జరపగా ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది. -
ఐటీపార్క్‌పై మరో ముందడుగు
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో ఐటీపార్క్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్‌లో అధికారులు సోమవారం సమావేశమయ్యారు. నగర శివార్లలో ఉన్న మార్క్‌ఫెడ్ భూమి ఇందుకు అనుకూలంగా ఉంటుందని జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ స్థలాన్ని ఐటీపార్క్‌కు కేటాయించేందుకు మార్క్‌ఫెడ్ నిరాకరిస్తున్నట్టు సమాచారం. చాలాకాలంగా జిల్లాలో ఐటీపార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఇందుకోసం వివిధ చోట్ల స్థలపరిశీలన చేశారు. చివరకు సిరిసిల్ల రోడ్డులో ఉన్న పదెకరాల మార్క్‌ఫెడ్ స్థలంలో ఐటీపార్క్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందని భావించారు. ఈ మే రకు జిల్లా అధికారులు 1050 సర్వే నంబర్లోని పదెకరాల నాలుగు గుంటల భూమి కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలతోపాటు సం బంధిత అంశాలపై చర్చించేందుకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మా ర్క్‌ఫెడ్ ఈ స్థలంలో గోదాములు నిర్మించాలని భావిస్తున్నందున ఐటీ పార్క్‌కు కేటాయించడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు తెలుస్తోంది. మార్క్‌ఫెడ్ గోదాముల కోసం అవసరమైన స్థలాన్ని మరోచోట కేటాయిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చినట్టు తెలిసిం ది. ఈ స మావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి టక్కర్, మార్క్‌ఫెడ్ ఎండీ దినకరబాబు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలను, మార్క్‌ఫెడ్ అభిప్రాయాలను ప్రభు త్వ ప్రధానకార్యదర్శి పరిశీలిస్తారని, ఐటీపార్క్ స్థలంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుం టుందని ఇన్చార్జి కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. -
నేడు విధుల్లోకి కొత్త కలెక్టర్
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు నూతన సమీకృత కలెక్టరేట్లో ప్రస్తుత కలెక్టర్ దినకర్ బాబు నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో ఆమె చేరికపై ఇన్నాళ్లూ కొనసాగిన అనుమానాలకు తెరపడింది. ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న దినకర్ బాబును మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరక్టర్‌గా, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ డైరక్టర్‌గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్‌ను మెదక్ కొత్త కలెక్టర్‌గా నియమిస్తూ గత మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఉత్తర్వులు వెలువడి వారం రోజులు గడవటంతో స్మితా సబర్వాల్ బాధ్యతల స్వీకరణపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దినకర్ బాబు మెదక్ జిల్లా కలెక్టర్‌గా 2014 సాధారణ ఎన్నికలు వరకు కొనసాగించాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు దినకర్‌బాబుకు మద్దతుగా సీఎంను కలిసినట్లు సమాచారం. మరోవైపు జిల్లా కలెక్టర్ కొనసాగేందుకు ఆసక్తితో ఉన్న దినకర్‌బాబు తన బదిలీ నిలిచిపోయేలా కొంత ప్రయత్నం చేశారు. అయితే ఇటు దినకర్‌బాబు, అటు ప్రజాప్రతినిధుల ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో జిల్లా కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించడం ఖాయమైపోయింది. బక్రీద్ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ బుధవారం మంచి రోజు కావడంతో స్మితా సబర్వాల్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. సామాన్యులకు సేవ చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగాన్ని పరుగు పెట్టించే కలెక్టర్‌గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో అవినీతి అధికారులకు చెక్ పెట్టడంతోపాటు ప్రభుత్వ పథకాల అమలులోనూ తనదైన ముద్రవేశారు.