పరి‘ఛీ’లన | clean chit to primary agricultural credit cooperative society | Sakshi
Sakshi News home page

పరి‘ఛీ’లన

Published Wed, Feb 5 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

clean chit to primary agricultural credit cooperative society

సాక్షి, సంగారెడ్డి: అనుకున్నట్లే జరిగింది. సొసైటీల అక్రమాలకు ఎప్పటిలాగే జిల్లా సహకార శాఖ అధికారులు వంత పాడారు. భారీ అవకతవకతలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గానికి జిల్లా సహకార శాఖ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. ఆరోపణల తీవ్రత రీత్యా సమగ్ర విచారణ జరపకుం డానే కేవలం ‘పరిశీలన’తో సరిపెట్టుకున్నారు.

పాలకవర్గం మాటలు నమ్మి మోసపోయిన బాధిత రైతులను కనీసం సంప్రదించకుండానే పరిశీలన తంతును సైతం తూతూమంత్రంగా ముగించేశారు. అసలు అక్రమాలేవి జరగలేదని నిగ్గు తేల్చేసి కళ్లకు గంతలు కట్టారు. వెల్దుర్తి పీఏసీఎస్‌పై జిల్లా సహకార శాఖ జరిపిన ఉత్తుత్తి పరిశీలనపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 కక్కుర్తి నేపథ్యం..
 ఓ ప్రైవేటు కంపెనీలో బీమా చేయించుకుంటేనే రుణాలు చెల్లిస్తామని వెల్దుర్తి పీఏసీఎస్ మెలిక పెట్టి మరీ రైతుల ద్వారా ప్రీమియం కట్టించుకుంది. 2007-10 మధ్యకాలంలో సుమారు 300 మంది రైతులు రూ.20 లక్షల వరకు బీమా ప్రీమియాన్ని చెల్లించారు.

 ఆ సమయంలో వెల్దుర్తి పీఏసీఎస్ చైర్మన్ టి. అనంతరెడ్డి కుమారుడు టి. నరేందర్ రెడ్డి  స్థానికంగా మ్యాక్స్ లైఫ్ న్యూయార్క్ ఇన్సూరెన్స్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఈ క్రమంలో బీమా వ్యాపారాన్ని పెంచుకోవడానికి పీఏసీఎస్‌ను సదరు బీమా సం స్థ కార్యాలయంగా మార్చేశారు.  రుణ మొత్తం ఆధారంగా ఒక్కోక్కరి నుంచి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు  మినహాయించుకుని ప్రీమియంగా కట్టించుకున్నారు. ఒక్కో బీమాపై 10 నుంచి 30 శాతం వరకు కమీషన్‌ను బీమా సంస్థ నుంచి పొందారు. గతేడాది బీమా కాలపరిమితి మించిపోయినా పునరుద్ధరించకుండా గప్‌చుప్‌గా ఉండిపోయారు. దీంతో రైతులు కట్టిన ప్రీమి యం ఉత్తిపుణ్యానికి బీమా సంస్థ జేబుల్లోకి వెళ్లిపోయింది.

 ఈ వ్యవహారంపై గతేడాది ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్పటి కలెక్టర్ దినకర్ బాబు విచారణకు ఆదేశించారు. జిల్లా సహకార శాఖాధికారి సాయికృష్ణుడు కలెక్టర్ ఉత్తర్వులకు భిన్నంగా పరిశీలన జరిపిం చారు. మెదక్ డివిజన్ సహకార అధికారి కార్యాలయ అసిస్టెంట్ రిజిస్ట్రార్ డీ చంద్రశేఖర్‌ను గత సెప్టెంబర్ 12న పరిశీలన అధికారిగా నియమించారు. ఆయన ఇటీవల సమర్పించిన నివేదికలోని సారాంశం ఇలా ఉంది.

 ఆరోపణ: బీమా పేరుతో అక్రమ వసూళ్లు
 పరిశీలన నివేదిక: సొసైటీలో ప్రత్యేక కౌంటర్ పెట్టి బీమా వసూలు చేసే అంశంపై ఉద్యోగులు, పాలకవార్గనికి నోటిసులు జారీ చేశాం. డీసీసీబీ బ్యాంక్ సర్క్యులర్ మేరకే కౌంటర్ ఏర్పాటు చేసి రైతులను బీమా సంస్థకు పరిచయం చేయడానికి పరిమితమయ్యామని సమాధానమిచ్చారు. సొసైటీ అధ్యక్షుడు, సిబ్బందిని విచారించిన తర్వాత సొసైటీ సిబ్బంది బీమా సంస్థ తరఫున అనధికారికంగా ప్రీమియం వసూలు చేయలేదని తేలింది.

 ఆరోపణ: రుణమాఫీ పథకం-2008 అమలులో సైతం అక్రమాలు జరిగాయి. రుణాలు ఇచ్చే సమయంలో నిబంధనల మేరకు 10 శాతం మొత్తాన్ని సొసైటీలో రైతు వాటాగా మినహాయించకుంటారు. రుణ మాఫీ తర్వాత ఈ 10 శాతం వాటాలను రైతులకు తిరిగి చెల్లించలేదు.

 పరిశీలిన నివేదిక: రుణ మాఫీ కింద లబ్ధిపొందిన రైతులకు వారి 10 శాతం వాటా ధనాన్ని తిరిగి చెల్లించలేదని సంబంధించిన రికార్డులను పరిశీలించగా తేలింది.

 లబ్ధిదారులు ఎవరైనా వచ్చి రాతపూర్వకంగా వాటా ధనం అడిగితే చెల్లిస్తామని సొసైటీ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. సొసైటీలో రుణ మాఫీ పథకం అమలుపై శాఖపరమైన ఆడిట్ జరిపిన ఆడిటర్లు ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదు.

 ఆరోపణ: మాజీ సీఈఓ వి.నర్సింహ రెడ్డి అనధికార పెత్తనం
 పరిశీలన నివేదిక: వెల్దుర్తి పీఏసీఎస్‌లో సీఈఓగా పనిచేసిన నర్సింహ రెడ్డి డీసీసీబీ తూప్రాన్ శాఖకు బదిలీ అయ్యారు. ఆయన తరుచుగా సొసైటీని సందర్శించి రికార్డుల నిర్వహణ విషయంలో సిబ్బందికి సహకరించే వారు. సొసైటీ మెలు కోరే ఆయనీ సేవలందించారు. అందుకు ఈ విషయంపై తదుపరి విచారణ అవసరం లేదు.

 ఆరోపణ: వెల్దుర్తి సొసైటీలో  2009-13 మధ్యకాలంలో ఎన్నో ఆర్థిక అవకతవకతలు జరిగాయి.
 పరిశీలన నివేదిక: పైన పేర్కొన్న విషయాలు మినహా .. 2009-13 మధ్యకాలంలో సొసైటీ జరిపిన లావాదేవీలపై పరిశీలన జరపగా ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement