సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి భూ సమీకరణ ప్రక్రియలో పీవోటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్) చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ ఎస్సీలు, ఇతర బలహీన వర్గాలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన వ్యవసాయ భూములకు బదులుగా కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ‘రాజధాని అమరావతి’పై సోమవారం శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి బొత్స మాట్లాడారు.
అసైన్డ్ భూమి కలిగి ఉన్న వ్యక్తులు తెల్ల కాగితంపై సంతకం చేసి ఇచ్చినా ప్రామాణికంగా తీసుకొని ఆ భూమికి బదులుగా థర్డ్ పార్టీ వ్యక్తులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్‌డీఏ అనుమతిచ్చిందని, ఇది పూర్తిగా పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. 455 మంది అసైన్డ్ రైతులకు సంబంధించి 289 ఎకరాల భూమికి బదులుగా 1,68,300 చదరపు అడుగుల మేర ప్లాట్లు ధర్డ్ పార్టీ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిందన్నారు.
కమిటీ సూచనల ప్రకారమే నిర్ణయం
భూ సమీకరణలో పీవోటీ చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం ఎస్సీ, బలహీన వర్గాలకు చేసిన అన్యాయాలను సరిదిద్దేందుకు అలాంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని బొత్స చెప్పారు. గుంటూరు– విజయవాడ మధ్య ఉండే సారవంతమైన భూముల్లో రాజధాని ఏర్పాటు సరైంది కాదని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా సూచించిందని బొత్స గుర్తు చేశారు. అది భవన నిర్మాణాలకు అనువైన ప్రాంతం కాదని కూడా కమిటీ సూచించిందని, ఆ కమిటీ చెప్పినట్టే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి 102 అడుగుల మేర పునాదులు వేయాల్సి రావడం వాస్తవం కాదా? అని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి ప్రణాళికల సమీక్ష, రాజధానితోపాటు మొత్తం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం సమగ్ర వ్యూహాలను సూచించేందుకు నలుగురు నిపుణులతో కమిటీని నియమించినట్లు మంత్రి వివరించారు. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్‌ఆర్ కన్వీనర్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగానే రాజధానిపై ఏ నిర్ణయమైనా ఉంటుందని మంత్రి వివరించారు.
దురాక్రమణ, అవినీతి, దోపిడీ
సీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం 2,600 ఎకరాల అసైన్డ్ భూములపై విచారణ కొనసాగుతుందని బొత్స స్పష్టం చేశారు. సీఆర్‌డీఏ పరిధిని మొదట 217 చదరపు కిలోమీటర్లగా నిర్ధారించి తర్వాత చంద్రబాబు వియ్యంకుడికి భూ కేటాయింపులపై గత ప్రభుత్వం జీవో విడుదల చేశాక వారికి ప్రయోజనం చేకూర్చేలా సీఆర్‌డీఏ పరిధిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో దురాక్రమణ, అవినీతి, దోపీడీ జరిగిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment