భారతీయ ప్రాచీన వైద్యం వైపు.. ప్రపంచ దేశాల చూపు
వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్
సాక్షి, బెంగళూరు : భారతీయ ప్రాచీన వైద్య విధానాలైన యోగ, ఆయుర్వేద, సిద్ధ, యునానిల వైపు ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధులను న యం చేయడంతో పాటు ఆయుష్షును పెంచగల శక్తి ప్రాచీన వైద్య విధానాల సొంతమని అన్నారు. విరూపాక్ష బెళవడి రచించిన ‘సూర్యోపాసన’ పుస్తకాన్ని స్నేహబుక్ హౌస్ సంస్థ ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చారు. శనివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో శరణ్ ప్రకాష్ పాటిల్ ఈ పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు.
ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఎన్నో వ్యాధులను నియంత్రించేందుకు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితాన్ని న గరవాసులు ఎదుర్కొంటున్నారని, అంతేకాక కాలుష్యంతో కూడిన వాతావరణం కూడా ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతోందని అన్నారు. ఇలాంటి సందర్భంలో యోగా అభ్యాసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కార్యక్రమంలో శాండల్‌వుడ్ నటి మేఘనా గావ్కర్, హోమియో వైద్యుడు బి.టి.రుద్రేష్ తదితరులు పాల్గొన్నారు.