లాభాల బాటలో కేఎస్డీఎల్
30న ‘స్వర్ణోత్సవ సంబరాలు’
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్(కేఎస్డీఎల్) లాభాల బాటలో సాగుతోంది. ఈనెల 30న కేఎస్డీఎల్ స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహించనున్నారు. బెంగళూరులో విలేకరుల సమావేశంలో కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్పాండే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడుతూ కేఎస్డీఎల్ లాభాల బాటలో నడుస్తోందని వివరించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.350కోట్ల టర్నోవర్, రూ. 45 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని చెప్పారు. 2015-16కు గాను రూ.416 కోట్ల టర్నోవర్ సాధించగా, రూ.47 కోట్ల నికర లాభాలను ఆర్జించిందన్నారు.
సంస్థ స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకొని సంస్థలోని 542 మంది పర్మినెంట్ ఉద్యోగులకు రూ.20వేల చొప్పున బహుమతిగా అందిస్తామని చెప్పారు. అలాగే సంస్థను మరింతగా ఆధునికీకరించడంతో పాటు కొత్త యంత్రాలను సైతం సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఇదే సందర్భంలో గంధ పరిమళాలతో కూడిన అగరబత్తీలతో పాటు ‘మ్యాంగో హ్యాండ్ వాష్’ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కేఎస్డీఎల్ ఆవరణలో ‘సోప్ సంతె’ను ఏర్పాటు చేసి.. డిస్కౌంట్ ధరలకే సంస్థ ఉత్పత్తులను వినియోగదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. కేఎస్డీఎల్ ఆవరణలో జరగనున్న స్వర్ణోత్సవ సంబరాలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.