‘పోలవరం’ నిర్వాసితుల గోడు వినాలి
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గోడును పాలకులు వినాల్సిన అవసరముందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. ‘సామాజిక సమస్యలు-ఆర్టీఐ చట్టం’ అనే అంశంపై భద్రాచలంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ఆదివారం చర్చాగోష్ఠిలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ఒకరికి న్యాయం చేసేందుకని మరొకరికి అన్యాయం చేయటం సరికాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రెండులక్షల మంది నిర్వాసితులవుతారని, 400 గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘పోలవరం ప్రాజెక్టుతో లక్షలాది ఎకరాల భూమి మునిగిపోతుండగా.. వేరొక ప్రాంతంలో ఏడులక్షల ఎకరాలకు సాగు నీరoదుతుంది. ఇది అభివృద్ధి ఎలా అవుతుందని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు’’ అని అన్నారు. ముంపు తక్కువగా, అభివృద్ధి ఫలం ఎక్కువగా ఉండడమే ప్రాజెక్టుల పరమార్థంగా ఉండాలన్నారు. ‘‘పోలవరం ప్రాజెక్టుతో ఉన్న భూమంతా పోయింది. వ చ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేశాను. కొత్తగా పంపించే చోట ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకోకపోతే బిక్షమెత్తుకోవటమో.., ఆత్మహత్య చేసుకోవటమే తప్ప మరో ప్రత్నామ్యాయం కనిపించటం లేదని ఓ రైతు నా వద్ద ఆవేదన వెలిబుచ్చారు.
ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరముంది’’అని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి, రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 5, 6వ షెడ్యూళ్లను పాలకులు పకడ్బందీగా అమలవడం లేదన్న ఆవేదన వారిలో (ఆదివాసీల్లో) ఉందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని సహజ సంపదను వారు వినియోగించుకునే పరిస్థితి లేదని, వేరొకరు దోచుకుంటున్నారని, ఈ కారణంగానే ఉద్యమాలు వస్తున్నాయని అన్నారు.
భద్రాచలం పరిస్థితి గందరగోళమే
రాష్ట్ర విభజనతో భద్రాచలం ప్రాంతం గందరగోళంలో పడిందని మాడభూషి శ్రీధర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతమంతా మునిగిపోతుందని, ప్రకృతి వనరులు.. ఆలయాలు ముంపులోకి పోతాయాని నిపుణులు చెబుతున్నారని, చివరకు భద్రాచలం రామాలయం చుట్టూ కూడా నీళ్లు చేరే పరిస్థితుంటుందని అంటున్నారని, ఇవన్నీ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ‘‘ఇదే జరిగితే భద్రాచలం ఆలయం కోసం మరో భద్రుడు తపస్సు చేయాల్సిందే’’ అని అన్నారు.
భూముల నివేదికలు భద్రపరుచుకోవాలి
పోలవరం నిర్వాసితులు తమకు సంబంధించిన భూముల నివేదికలను భద్రపరుచుకోవాలని మాడభూషి శ్రీధర్ సూచించారు. కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చినందున భవిష్యత్తులో పరిహారాన్ని పెంచితే ఈ నివేదికల అవసరం ఎంతో ఉంటుందన్నారు. అవసరమైతే వాటి కోసం సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి
పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ పద్ధతిలో చేపట్టేందుకు ప్రభుత్వాలు ఆలోచించాలని నీటిపారుదల శాఖ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ధర్మారావు కోరారు. ఇందుకోసం టన్నెల్ విధానంలో భూగర్భం ద్వారా నీటిని తీసుకెళ్లవచ్చని అన్నారు. ఈ బాధ్యతలను తనకు అప్పగిస్తే చేసి చూపిస్తానన్నారు.
ఈ చర్చాగోష్ఠిలో భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఆర్డీవో అంజయ్య తదితరులు పాల్గొన్నారు.