గంభీరంలో రేడియేషన్ రీసెర్చ్ ల్యాబ్
♦ ఐఐఎం స్థలానికి సమీపంలోనే స్థలం కేటాయింపు
♦ రూ.80 కోట్లు కేటాయించిన కేంద్రం
♦ దేశంలో ఇది నాల్గవది
♦ నేవీ, ఆర్మీలకు ఉపయోగకరం
♦ ముఖ్యమంత్రిచే శంకుస్థాపనకు ఏర్పాట్లు
ఆనందపురం : మండలంలోని గంభీరంలో సమీర్ (సొసైటీ ఫర్ అప్లయిడ్ మైక్రో వేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్) అనే మరో ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటు కానుంది. దీంతో విశాఖ ప్రాంతానికి మరింత గుర్తింపు రానుంది. ఇప్పటికే ఇక్కడ ఐఐఎంతో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఇక్కడ సమీర సంస్థ ఏర్పాటుకు ఏపీఐఐసీ 13 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, కేంద్రం రూ.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుచే శంకుస్థాపన చేయించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలాంటి సంస్థలు దేశంలో చెన్నై, ముంబై, కలకత్తాలో ఉండగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది నాల్గవది. ఇక్కడ ఏర్పాటు కానున్న రేడియేషన్ నిర్ధారణ కేంద్రం వల్ల నేవీ, ఆర్మీ వంటి సంస్థలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రంగాల్లో వినియోగించే వివిధ రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు, చిప్స్ వంటి వాటి నుంచి వెలువడే రేడియేషన్ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ పరిశీలన చేసి నిర్ధారిస్తారు. వాటితో పాటు వివిధ ప్రైవేటు సంస్థలకు సేవలను అందిస్తారు. ఈ విషయమై ప్రోగ్రామ్ డెరైక్టర్ సురేష్ మాట్లాడుతూ ఇక్కడ ఏర్పాటు చేయబోయే ల్యాబ్లో వివిధ పరికరాల వల్ల వెలువడే రేడియేషన్ను కచ్చితంగా అంచనా వేసి నివేదికను అందజేస్తామన్నారు. దీనివల్ల ఆయా సంస్థల రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.