Society of Authors
-
రచయితలు ఏకతాటిపై నడవాలి
కవులు, రచయితలు ఏకతాటిపై నిలవాలని రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమేపల్లి వెంకటసుబ్బయ్య అన్నారు. రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ లోగో ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేపల్లి మాట్లాడుతూ విభజనానంతరం రాష్ట్రంలో కవులు, కళాకారులు, రచయితలు అనేక రకాలుగా వెనుకబడి ఉన్నారని, తెలుగుభాషా ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం రాష్ట్రంలోని పద మూడు జిల్లాల్లోని కవులను కలిసి వారి అభిప్రాయాల మేరకు నూతన సంస్థను స్థాపించామన్నారు. ఉన్నతాశయాలతో సంస్థను ముందుకు నడిపించాల్సిన అవసరం కవులు గుర్తించాలన్నారు. సీనియర్ పాత్రికేయుడు, కవి, రచయిత సీహెచ్ శర్మ మాట్లాడుతూ రచయిత సంఘాలు రచయితలను ప్రోత్సహించాలని అన్నారు. రచయితలు రాయడం అలవాటుగా చేసుకోవాలని, సాహిత్యాన్ని చదవాలని సూచించారు. రచయితల సంఘం కోశాధికారి కలిమిశ్రీ చిత్రించిన రచయితల సంఘం లోగోను సోమేపల్లి ఆవిష్కరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సంఘం లక్ష్యాలను వివరించారు. రచయిత్రులు వై.పాప, కోపూరి పుష్పాదేవి తదితరులు ప్రసంగించారు. రచయితలు వి.సుధారాణి, పి,రాజశేఖర్, పద్మావతి శర్మ, బి.ఆంజనేయరాజు, అరసవిల్లి కృష్ణ, శిఖా ఆకాష్, కె.ఆంజనేయకుమార్ సంఘ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. -
వేయిపడగలు.. వెయ్యేళ్ల విజ్ఞానం
సీనియర్ పాత్రికేయుడురాఘవాచారి ఘనంగా విశ్వనాథసత్యనారాయణ జయంతి వేడుకలు విజయవాడ కల్చరల్ : వేయిపడగలు నవల వెయ్యేళ్ల విజ్ఞానాన్ని కలిగిస్తుందని సీనియర్ పాత్రికేయుడు సి.రాఘవాచారి పేర్కొన్నారు. మహాకవి విశ్వనాథ సత్యనారాయణ 120వ జయంతిని పురస్కరించుకుని కృష్ణాజిల్లా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖ గురువారం నిర్వహించిన జాతీయ సాహిత్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవాచారి ప్రసంగించారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విశ్వనాథ జాతీయ కవి అని, ఆయన సాహిత్యం ఒక తరంలో ప్రభంజనం సృష్టించిందన్నారు. విశ్వనాథ ఫౌండేషన్ నిర్వాహకుడు ఆచార్య డాక్టర్ వెలిచల కొండలరావు మాట్లాడుతూ కవికి భాషా బేధాలు ఉండకూడదని, వారి సాహిత్యం విశ్వమానవ ప్రేమను కోరుకోవాలన్నారు. విశ్వనాథ తన సాహిత్యం ద్వారా అదే పనిచేశారని చెప్పారు. విశ్వనాథ మనవడు విశ్వనాథ సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వనాథ సంపూర్ణ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆయన నివాసాన్ని స్మృతి కేంద్రంగా మారుస్తున్నామని చెప్పారు. ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎస్ పద్మారావు, కళాశాల సంచాలకుడు వేమూరి బాబూరావు ప్రసంగించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కవి, రచయిత చలపాక ప్రకాష్ రచించిన ‘ఆధునిక తెలుగు అడుగుజాడలు’ సాహిత్య గ్రంథం, ఎంవీఆర్ సత్యనారాయణమూర్తి రచించిన ‘నందిని నందివర్థనం’ కథా సంపుటిని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. పరిశోధనా పత్రాల సమర్పణ విశ్వనాథ సాహితీ వైభవం పేరిట జరిగిన సభలో ‘ప్రకృతి పరిరక్షణ-విశ్వనాథ వారి భావజాలం’డాక్టర్ కె.రామకృష్ణ, విశ్వనాథవారి ఆంధ్రాభిమానంపై డాక్టర్ ద్వానాశాస్త్రి, రామాయణ కల్పవృక్షంపై డాక్టర్ కోడాలి సోమసుందరరావు, మరో 40మందికిపైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలను మద్రాస్ తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్, శతాధిక గ్రంథకర్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, బూడాటి వెంకటేశ్వర్లు, చేకూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. అభిమానుల పుష్పాంజలి ఈ సందర్భంగా గురువారం ఉదయం లెనిన్సెంటర్లోని విశ్వనాథ విగ్రహం వద్ద మండలి బుద్ధప్రసాద్, పరవస్తు చిన్నయ్యసూరి కళాపీఠం అధ్యక్షుడు టి.శోభనాద్రి, తెలుగు అధ్యాపకుడు గుమ్మా సాంబశివరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, కవి, రచయిత ద్వానా శాస్త్రి, చలపాక ప్రకాష్, ఆచార్య వెలమల సిమ్మన్న, కృష్ణాజిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకుడు కాలనాథభట్ల వీరభద్రశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ‘విశ్వనాథ విజయం’ విజయవాడ కల్చరల్ : విశ్వనాథ సత్యనారాయణ జయంతిని పురస్కరించుకుని సిద్ధార్థ కళావేదికపై గురువారం సాయంత్రం నిర్వహించిన సాహితీ కార్యక్రమం ఆకట్టుకుంది. విశ్వనాథుని మిత్రుడు కొడాలి ఆంజనేయులు పాత్రలో డాక్టర్ చివుకుల సుందరరామశర్మ, విశ్వనాథ గురువు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి పాత్రలో డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కవి కాటూరిగా డాక్టర్ పింగళి వెంకటకృష్ణారావు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి పాత్రలో జంధ్యాల మహతీ శంకర్, గుర్రం జాషువా పాత్రలో ఎంపీ జానుకవి, కవయిత్రి తెన్నేటి హేమలత పాత్రలో కావూరి సత్యవతి తదితరులు విశ్వనాథునితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. -
మరణంకంటే జీవితం గొప్పది
ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుద్దాల విలేకర ్లతో మాట్లాడారు. అశోక్‌తేజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ‘‘నాపై మా నాన్న సుద్దాల హనుమంతు ప్రభావం చాలా ఉంది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. మా కుటుంబ సభ్యులంతా సాంస్కృతిక చైతన్యం ఉన్నవారే. నేను ఎన్నో జానపద గేయాలతో పాటు పలు పాటలు రాశాను. సినీ రంగంపై ఉన్న అభిమానం నన్ను ఆ వైపు నడిపించింది. 1994లో ‘నమస్తే అన్న’ సినిమాలో రాసిన ‘గరం గరం పోరి.. నా గజ్జెల సవ్వారి’ నా మొదటిపాట. దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్‌ల కాంబినేషనల్లో నేను రాసిన చాలా పాటలు హిట్టయ్యాయి. 2003లో ఠాగూర్ సినిమాకు రాసిన ‘నేను సైతం..’ పాటకు జాతీయ అవార్డు లభించింది. తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డులు పొందిన శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తిల సరసన నా పేరుకూడా చేరడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత మరో రెండు నంది అవార్డులు వచ్చాయి. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. భద్రాచలం సినిమాలో రచించిన ‘ఒకటే జననం, ఒకటే మరణం’ పాట నా స్వీయానుభవంలో నుంచి పుట్టింది. ఈ పాట అనేక మందిని కదిలించింది. పాండురంగడు సినిమాకు రాసిన ‘మాతృదేవోభవ అన్నమాట మరిచాను..’ పాట చాలా మంచిపేరు తెచ్చింది. డాక్టర్ సీ నారాయణరెడ్డి నా అభిమాన కవి. సినిమా వ్యాపార కళగా మారింది 700 సినిమాల్లో 17 వందల పాటలు రాశా. ‘ఆకుపచ్చ చందమామా..’ అంటూ రైతులపై రాసిన పాట జనాదరణ పొందింది. మానవ త్వానికి, అనుబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రాసిన పాటలు అనేకం ఉన్నాయి. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల ఫలితంగా సినిమా వ్యాపార కళగా మారింది. గుండెను కదిలించే పాటలు రాసే అవకాశం తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ మానవ సంబంధాల గొప్పదనాన్ని, మనిషితనాన్ని ఆవిష్కరించే పాటలను అప్పుడప్పుడూ రాసేందుకు కృషి చేస్తున్నా. నటనపై ఆసక్తి ఉంది నేను కేవలం సినీగేయ రచయితను మాత్రమే కాదు నటనపై కూడా ఆసక్తి ఉంది. ‘ఆ ఐదుగురు’ సినిమాలో ఒగ్గు కళాకారునిగా నటిస్తున్నా. వీర తెలంగాణ చిత్రంలో ఒక పాట కూడా పాడా. ఆ ఐదుగురు సినిమాకు పాటలతో పాటు మాటలు కూడా అందిస్తున్నా. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్న ప్రతిఘటన చిత్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలను నిరసిస్తూ ‘ఎందుకురా మాపై పగ, మాపై కసి, ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష, పాములనీ తెలిసీ పాలు పోసినందుకా’ అనే పాటను అశోక్ తేజ మీడియా ముందు పాడి వినిపించారు. ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు నా తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరిట ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. జానపద కళలకు సంబంధించిన మ్యూజియం స్థాపించాలనే కోరిక ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినా తెలుగు భాషకు కలిగే ముప్పేమీ ఉండదు. సమాజాన్ని, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తేనే మంచి పాటలు రాయగలం. ఉదయ్‌కిరణ్ మృతి బాధించింది సినీ హీరో ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య నన్ను బాధించింది. పిరికితనం, పలాయనవాదం పనికిరావు. మనిషి ఆశావాదంతో వ్యవహరించాలి. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. పాట, ఉత్తమ సాహిత్యం అందుకు ఆసరా కావాలి’’. - న్యూస్‌లైన్, ఒంగోలు కల్చరల్