ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుద్దాల విలేకర ్లతో మాట్లాడారు. అశోక్‌తేజ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
‘‘నాపై మా నాన్న సుద్దాల హనుమంతు ప్రభావం చాలా ఉంది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. మా కుటుంబ సభ్యులంతా సాంస్కృతిక చైతన్యం ఉన్నవారే. నేను ఎన్నో జానపద గేయాలతో పాటు పలు పాటలు రాశాను. సినీ రంగంపై ఉన్న అభిమానం నన్ను ఆ వైపు నడిపించింది. 1994లో ‘నమస్తే అన్న’ సినిమాలో రాసిన ‘గరం గరం పోరి.. నా గజ్జెల సవ్వారి’ నా మొదటిపాట. దాసరి నారాయణరావు, వందేమాతరం శ్రీనివాస్‌ల కాంబినేషనల్‌లో నేను రాసిన చాలా పాటలు హిట్టయ్యాయి. 2003లో ఠాగూర్ సినిమాకు రాసిన ‘నేను సైతం..’ పాటకు జాతీయ అవార్డు లభించింది.
తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డులు పొందిన శ్రీశ్రీ, వేటూరి సుందరరామమూర్తిల సరసన నా పేరుకూడా చేరడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆ తరువాత మరో రెండు నంది అవార్డులు వచ్చాయి. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. భద్రాచలం సినిమాలో రచించిన ‘ఒకటే జననం, ఒకటే మరణం’ పాట నా స్వీయానుభవంలో నుంచి పుట్టింది. ఈ పాట అనేక మందిని కదిలించింది. పాండురంగడు సినిమాకు రాసిన ‘మాతృదేవోభవ అన్నమాట మరిచాను..’ పాట చాలా మంచిపేరు తెచ్చింది. డాక్టర్ సీ నారాయణరెడ్డి నా అభిమాన కవి.
సినిమా వ్యాపార కళగా మారింది
700 సినిమాల్లో 17 వందల పాటలు రాశా. ‘ఆకుపచ్చ చందమామా..’ అంటూ రైతులపై రాసిన పాట జనాదరణ పొందింది. మానవ త్వానికి, అనుబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ రాసిన పాటలు అనేకం ఉన్నాయి. అయితే కాలానుగుణంగా వచ్చిన మార్పుల ఫలితంగా సినిమా వ్యాపార కళగా మారింది. గుండెను కదిలించే పాటలు రాసే అవకాశం తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ మానవ సంబంధాల గొప్పదనాన్ని, మనిషితనాన్ని ఆవిష్కరించే పాటలను అప్పుడప్పుడూ రాసేందుకు కృషి చేస్తున్నా.
నటనపై ఆసక్తి ఉంది
నేను కేవలం సినీగేయ రచయితను మాత్రమే కాదు నటనపై కూడా ఆసక్తి ఉంది. ‘ఆ ఐదుగురు’ సినిమాలో ఒగ్గు కళాకారునిగా నటిస్తున్నా. వీర తెలంగాణ చిత్రంలో ఒక పాట కూడా పాడా. ఆ ఐదుగురు సినిమాకు పాటలతో పాటు మాటలు కూడా అందిస్తున్నా. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మిస్తున్న ప్రతిఘటన చిత్రంలో మహిళలపై జరిగే అత్యాచారాలను నిరసిస్తూ ‘ఎందుకురా మాపై పగ, మాపై కసి, ఎందుకింత కక్ష, ఎందుకింత వివక్ష, పాములనీ తెలిసీ పాలు పోసినందుకా’ అనే పాటను అశోక్ తేజ మీడియా ముందు పాడి వినిపించారు.
ట్రస్టు పేరిట సేవా కార్యక్రమాలు
నా తల్లిదండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరిట ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. జానపద కళలకు సంబంధించిన మ్యూజియం స్థాపించాలనే కోరిక ఉంది. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలినా తెలుగు భాషకు కలిగే ముప్పేమీ ఉండదు. సమాజాన్ని, సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేస్తేనే మంచి పాటలు రాయగలం.
ఉదయ్‌కిరణ్ మృతి బాధించింది
సినీ హీరో ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య నన్ను బాధించింది. పిరికితనం, పలాయనవాదం పనికిరావు. మనిషి ఆశావాదంతో వ్యవహరించాలి. ధైర్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. పాట, ఉత్తమ సాహిత్యం అందుకు ఆసరా కావాలి’’.
- న్యూస్‌లైన్, ఒంగోలు కల్చరల్