దద్దరిల్లిన అసెంబ్లీ
చెరుకు రైతులకు బకాయిపై ప్రభుత్వాన్ని నిలదీసిన విపక్షాలు
రెండేళ్లుగా బకాయిలు చెల్లించ లేదని మండిపాటు
నెలలోపు బకాయిలు చెల్లిస్తామన్న మంత్రి డీకేశి
బెంగళూరు : రైతాంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ విపక్షాలు మండిపడ్డాయి. రెండేళ్లుగా చెరుకు రైతులకు బకాయిలు చెల్లించకపోవడంపై నిప్పులు చెరిగాయి. దీంతో గురువారం అసెంబ్లీ కార్యకలాపాలు దద్ధరిల్లాయి. ఈ నేపథ్యంలో ఏర్పడిన గందరగోళాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు సభను ఏకంగా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభలో గురువారం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే విపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... చెరుకు రైతులకు చక్కెర కర్మాగారాల యజమానులు రెండేళ్లుగా బకాయిపడ్డారని, ఈ మొత్తాన్ని చెల్లించడంలో యాజమాన్యలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. దీంతో కుటుంబ పోషణ భారమైన అన్నదాతలు రోడ్డుపై చేరుకుని ఆందోళనలు చేపట్టాల్సిన దుర్గతిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. చక్కెర కర్మాగారాల యజమానుల నుంచి చెరుకు రైతులకు రూ.1,700 కోట్లు అందాల్సి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో శెట్టర్ వాదనలకు బీజేపీతో పాటు పలువురు జేడీఎస్ సభ్యులు మద్దతు పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శివమూర్తి జోక్యం చేసుకుంటూ బీజేపీకి చెందిన ప్రభాకర్‌కోరే, మురుగేష్ నిరాణి, ఉమేష్ కత్తిలాంటి వారే రైతులకు రూ. కోట్లు బకాయి ఉన్నారని ఆరోపించారు. చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీసే బదులు వారి నుంచి రైతుల బకాయిలు ఇప్పించవచ్చు గదా అని హితవు పలికారు. శివమూర్తి వాదనకు అధికార పక్షం సభ్యులు గొంతు కలిపారు. దీంతో సభలో వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో సభను పదిహేను నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న శివశంకర్‌రెడ్డి ప్రకటించారు.
నెలలోపు బాకీ మొత్తం చెల్లిస్తాం
అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. దాదాపు పది నిమిషాల పాటు ఈ పర్వం కొనసాగింది. అనంతరం ఇంధన శాఖ మంత్రి డీ.కే శివకుమార్ మాట్లాడుతూ....‘నెల లోపు రైతుల బాకీ మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తాం. చెరుకు కర్మాగారాల్లో నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇందుకు వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెరుకు రైతులకు అందజేస్తాం. ఈ మొత్తం ప్రక్రియ ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుంది.’ అని స్పష్టం చేశారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందిన విపక్షాలు ధర్నాను విరమించుకున్నాయి.