somala
-
పోలీస్స్టేషన్ పై ప్రజల దాడి
పుంగనూరు: పోలీసులపైకి ప్రజలు తిరగబడ్డారు. రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. అనంతరం పోలీసులను పోలీస్ స్టేషన్ లోపలే ఉంచి బయట తాళం వేశారు. ఈ సంఘటన చిత్తూరు సోమల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. సోమలలోని ప్రభుత్వ స్థలంలో స్థానికంగా నివాసం ఉంటున్న రెడ్డెమ్మ రవికుమార్ ఇల్లు కట్టుకుంటున్నాడు. అది ప్రభుత్వ స్థలం కావడంతో పాటు ఆ నిర్మాణం పూర్తయితే రోడ్డు ఉండదని గ్రహించిన గ్రామస్థులు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టకుండా.. ఫిర్యాదులో పేర్కొన్న 30 మందిని స్టేషన్కు పిలిపించి అకారణంగా వారిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడి చేసి వారిని లోపల ఉంచి బయట తాళం వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చర్చ జరిగితే అంగీకరించినట్లే: జగన్
చిత్తూరు: శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరిగితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్ర సోమల గ్రామం చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. శాసనసభలో సమైక్యతీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పునీరే ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. 30 లోక్సభ సీట్లు గెలుచుకుందామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. మన నీటికోసం మనమే తన్నుకోవాలా? అని ప్రశ్నించారు. విభజన జరిగితే సాగుకు నీళ్లుండవు, యువతకు ఉద్యోగాలుండవని హెచ్చరించారు. -
చర్చ జరిగితే అంగీకరించినట్లే: జగన్