చర్చ జరిగితే అంగీకరించినట్లే: జగన్
చిత్తూరు: శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరిగితే రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం యాత్ర సోమల గ్రామం చేరుకున్న తరువాత అక్కడ జరిగిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. శాసనసభలో సమైక్యతీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పునీరే ఉంటుందని హెచ్చరించారు.
ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరుగుతోందని చెప్పారు. 30 లోక్సభ సీట్లు గెలుచుకుందామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం అన్నారు. మన నీటికోసం మనమే తన్నుకోవాలా? అని ప్రశ్నించారు. విభజన జరిగితే సాగుకు నీళ్లుండవు, యువతకు ఉద్యోగాలుండవని హెచ్చరించారు.