14 ఏళ్లు, 1,37,900 కిలోమీటర్లు... ఇంకా ముందుకే
ఆయన పేరు సోమన్ దేవ్నాథ్. పశ్చిమబెంగాల్ సుందర్బన్లోని ‘బసంతి’ ఆయన గ్రామం. ఓ లక్ష్యం కోసం ఆయన 2004లో తన యాత్రను ప్రారంభించారు. ఇప్పటికే 14 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా తన ప్రయాణాన్ని ఆపలేదు. 2020 వరకు తన సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తారట. ఆయన ఊరు నుంచి ప్రారంభమైన ఆయన సైకిల్‌యాత్ర రాష్ట్రం గుండా, దేశం గుండా, ఖండాల గుండా సాగి 1.37,900 కిలోమీటర్లు చుట్టింది. ఈ సందర్భంగా ఆయన సైకిల్‌పైనే 126 దేశాలు సందర్శించారు. 2020 నాటికి రెండు లక్షల కిలోమీటర్లను అధిగమించి 191 దేశాలు తిరిగి, కనీసం 20 కోట్ల మంది ప్రజలనైనా కలుసుకోవాలన్నది ఆయన లక్ష్యం.
ఆయన సైకిల్ యాత్ర సరదాగే ఏమీ సాగలేదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ల చెరలో చిక్కుకున్నారు. ఇరాక్‌లో తృటిలో బాంబుపేలుడు నుంచి తప్పించుకున్నారు. ఆరుసార్లు ఆయన సైకిల్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఎన్నోరోజులు నిద్రాహారాలు లేకుండా గడిపారు. అయినా లక్ష్యసాధనలో ఆయన ముందుకే సాగుతున్నారు. ప్రస్తుతం అర్జెంటీనాలో నగరాల్లో పర్యటిస్తున్న ఆయన త్వరలో అంటార్కిటికా ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఆయన బడికెళ్లి చదువుకుంటున్నప్పుడు 14 ఏళ్ల వయస్సులో ఎయిడ్స్ మహమ్మారి గురించి ఓ వ్యాసం చదివారట. ఆ వ్యాధి బారిన పడినవారిని సమాజం ఎంత నీచంగా నిర్దయగా చూస్తుందో తెలుసుకున్నారట. వ్యాధి గురించి మరింత లోతుగా అధ్యయనం చేశారు.
వ్యాధి పట్ల ప్రజలకు సరైన అవగాహన కలిగించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. అప్పటికి ఏం చేయాలో తెలియదు. డిగ్రీ పూర్తి చేశారు. సైకిల్ కొనుక్కున్నారు. సైకిల్‌పై రాష్ట్రమంతా తిరిగి ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సిన చికిత్స, వారి పట్ల సమాజం వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రచారం చేశారు. మూడు నెలలతో తన యాత్ర ఆపకూడదనుకున్నారు. మరో ఆరు నెలలు దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఇదే ప్రచారం చేశారు. అప్పటికీ తృప్తినివ్వలేదు. ప్రపంచదేశాల్లో కూడా ఈ ప్రచారయాత్రను కొనసాగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. మరి ఎలా? అంత డబ్బులు తనకు ఎక్కడున్నాయని ఆలోచించారు. సైకిల్‌పై వెళ్లొచ్చుకదా అన్న ఆలోచన వచ్చింది. అదే తడువుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు.
ఈ యాత్రకు మీ కుటుంబం ఒప్పుకుందా? అని దారి మధ్యలో మీడియా ఆయన్ని ప్రశ్నించగా ‘ఏ కుటుంబం? నా కుటుంబమా, గ్లోబల్ కుటుంబమా !’ అని ఆయన ప్రశ్నించారు. ‘మా నాన్న అసలు అంగీకరించలేదు. కొంతకాలం నాతో మాట్లాడలేదు. అదే పనిగా అమ్మకు నచ్చచెబుతూ వచ్చా. చివరకు అమ్మ ఒప్పుకున్నది. అమ్మతోనే నాన్నను ఒప్పించాను. అంతే నా యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రపంచం గురించి నేను కొన్ని సత్యాలు తెలుసుకున్నాను. మనం గందరగోళంలో ఉంటే, ప్రపంచం కూడా గందరగోళంగా ఉంటుంది. మనం నిరాశపడితే మనల్ని ప్రపంచం మరింత నిరుత్సాహ పరుస్తుంది. మనం ఆశావాద దృక్పథంతో వ్యవహరిస్తే. ప్రపంచం కూడా మన పట్ల అదే దృక్పథంతో వ్యవహరిస్తుంది. అంటే, మన స్పందన ఎలా ఉంటే, ప్రపంచం ప్రతి స్పందన అలాగే ఉంటుంది’ అని చెప్పారు.
‘నేను సైకిల్‌పై బట్టలు, పడుకోడానికి చాప, పడుకునే బ్యాగు, టెంట్, అల్పాహారం తీసుకెళుతున్నాను. ఇద్దరు వ్యక్తులు, ఓ కంపెనీ నా యాత్రకు ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. అయినా నా యాత్ర పూర్తి అవడానికి కావాల్సినంత డబ్బు సమకూరడం లేదు. 30 శాతం మాత్రమే సమకూరింది. అంటార్కిటికా వెళ్లేందుకు అవసరమైన టిక్కెట్లు కొనుక్కున్నాను. ముందేం జరుగుతుందో చూడాలి. ఫలితం ఆశించకుండా లక్ష్యం దిశగా సాగిపోవాలన్న భగవద్గీత సందేశమే నాకు స్ఫూర్తి’ అని ఆయన చెప్పారు.
భారత్‌కు తిరిగొచ్చి సొంతూరుకు చేరుకున్నాక ఏం చేయాలన్నది మీ లక్ష్యమని మీడియా ఆయనను ప్రశ్నించగా ‘నా ఊళ్లో గ్లోబల్ గ్రామాన్ని నిర్మించడం నా లక్ష్యం. ఏ దేశం వ్యక్తినైనా, ఏ జాతి వ్యక్తినైనా నా గ్లోబల్ గ్రామానికి ఆహ్వానిస్తాను’ అని చెప్పారు.