కేంద్రంతో కేజ్రీ ఢీ
మళ్లీ రోడ్డెక్కిన కేజ్రీవాల్ - రాజధానిలో ఢిల్లీ సీఎం ధర్నా
ఢిల్లీ వీధుల్లో మహిళలకు భద్రత లేదు.. పోలీసుల అండతోనే సెక్స్, డ్రగ్ రాకెట్లు నడుస్తున్నాయి.. మంత్రులకు సహకరించట్లేదు. అధికారులు డబ్బులు తీసుకుని పోలీసులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారు.. వసూళ్లలో కేంద్ర హోంమంత్రికీ వాటాలున్నాయి. విధి నిర్వహణలో విఫలమైన నలుగురు ఢిల్లీ పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎంగా నేను కోరినా ఫలితంలేదు. పోలీసు విభాగాన్ని రాష్ట్ర పరిధిలోకి తేవాలి. పది రోజులైనా, ఆ తర్వాతా ధర్నా కొనసాగిస్తా. ఉద్యమానికి మద్దతుగా ప్రజలు తరలి రావాలి.. రాజ్‌పథ్‌ను దిగ్బంధించాలి.. నిజాయితీ పోలీసులూ సెలవు పెట్టి ఉద్యమించాలి. ఢిల్లీ పాలనపై ధర్నా ప్రభావం ఏమీ ఉండదు. పాలన యధావిధిగా సాగుతుంది.’’
- అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధభేరి మోగించారు. సీఎం పదవి చేపట్టకముందు వరకూ అవినీతి ఇతర అంశాలపై రోడ్డెక్కి ధర్నాలు, హర్తాళ్లతో ఉద్యమించిన కేజ్రీవాల్.. ముఖ్యమంత్రి హోదాలోనూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తంచేస్తూ మరోసారి రోడ్డెక్కారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవటంతో పాటు.. ఢిల్లీ పోలీసు విభాగాన్ని కేంద్ర హోంశాఖ పరిధి నుంచి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఆయన సోమవారం దేశ రాజధానిలో అనూహ్యంగా ధర్నాకు దిగారు.
ఆరుగురు మంత్రివర్గ సహచరులతో కలిసి.. ప్రధానమంత్రి కార్యాలయానికి అతి సమీపంలో రైల్ భవన్ వద్ద రైసినా రోడ్డుపై బైఠాయించారు. ధర్నాకు మద్దతుగా ప్రజలు తరలిరావాలని.. పోలీసు విభాగంలోని నిజాయితీ ఉద్యోగులు విధులకు సెలవుపెట్టి ధర్నాలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రే స్వయంగా ధర్నాకు దిగటం ద్వారా ఢిల్లీ వీధుల్లో అరాచకం మొదలుపెట్టారన్న విమర్శలపై కేజ్రీవాల్ ఘాటుగా స్పందిస్తూ.. ‘‘నేను అరాచకవాదినే.. ఈ అరాచకాన్ని కేంద్ర హోం మంత్రి వరకూ తీసుకెళతా. న్యాయం జరిగే వరకూ పది రోజులైనా ధర్నా చేయటానికి సిద్ధమయ్యే వచ్చా. అవసరమైతే ఆ తర్వాత కూడా కొనసాగించటానికి సిద్ధం’’ అని స్పష్టంచేశారు.
సీఎం ధర్నా నేపధ్యంలో ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య పలుమార్లు తీవ్ర తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జిలో పలువురు పార్టీ కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే త్రిపాఠి తీవ్రంగా గాయపడ్డారని ఆప్ ప్రకటించింది. కేజ్రీవాల్ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం కూడా కఠిన వైఖరే అవలంబిస్తోంది. నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసులపై తక్షణ చర్యలు తీసుకోవటం సాధ్యం కాదని.. సరైన విచారణ అనంతరమే ఏ చర్యలైనా చేపడతామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే స్పష్టంచేశారు. ఢిల్లీ పోలీసు విభాగాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను షిండే కొట్టిపారేశారు.
ఏం జరిగినా సర్కారుదే బాధ్యత...
ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగటం దేశ చరిత్రలో బహుశా ఇదే తొలిసారి. సోమవారం ఉదయం కేజ్రీవాల్ తన మద్దతుదారులతో కలిసి.. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్ వద్దకు వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నందున ఆ సమీపంలోని విజయ్చౌక్తో పాటు రాజ్‌పథ్ మొత్తాన్నీ మూసివేయటం.. ఆ పరిసరాల్లో నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడరాదన్న నిషేధాజ్జలు అమలులో ఉండటంతో.. రైల్ భవన్ వద్దనే కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేజ్రీవాల్ అక్కడే ధర్నాకు దిగారు. ఈ పరిస్థితికి కారణం ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర ప్రభుత్వాలే కారణమని పేర్కొన్నారు. తన ధర్నా వల్ల గణతంత్ర వేడుకలకు ఎలాంటి అంతరాయాలు కలిగినా, మరెలాంటి సంక్షోభాలు తలెత్తినా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.
ధర్నా స్థలం మార్చేందుకు ససేమిరా...
సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కీలక ప్రాంతమైన కేంద్ర సచివాలయాల నడుమ, పార్లమెంటు భవవ ప్రహరాకు పక్కన కేజ్రీవాల్ ధ ర్నాకు దిగారు. ధర్నాను రైల్ భవన్ వద్ద నుంచి సమీపంలోని జంతర్‌మంతర్‌కు మార్చాలని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కోరగా.. అందుకు ఆయన తిరస్కరించారు. ఉదయం 11 గంటల సమయంలో ధర్నా ప్రారంభించినప్పుడు పలుచగా ఉన్న జనం.. కేజ్రీవాల్ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు కేంద్రమే బాధ్యత వహించాలని కే జ్రీవాల్ పేర్కొన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ పరిస్థితి చేయిదాటిపోతుందన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వంలోనూ వ్యక్తమవుతోంది.
- ఆప్ కార్యకర్తలను అరెస్టు చేయటంతో పాటు అదుపు చేసేందుకు వారిపై పోలీసులు పలుమార్లు లాఠీచార్జి చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతోంది.
- సీఎం, మంత్రులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మోడల్ టౌన్ ఆప్ ఎమ్మెల్యే అఖిలేశ్మణిత్రిపాఠిపై పోలీసులు లాఠీచార్జి చేయటంతో ఆయన స్పృహ తప్పారు. వెంటనే ఆయనను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.
- ఢిల్లీ సీఎం స్వయంగా రోడ్డుపై ధర్నాకు దిగటంతో దాదాపు 4,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు.
ఇదీ వివాదానికి మూలం...
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్‌భారతి గత బుధవారం అర్థరాత్రి దాటాక పలువురు ఆప్ కార్యకర్తలను వెంట తీసుకుని.. తన నియోజకవర్గం మాల్వియానగర్లోని ఒక భవనం వద్దకు వెళ్లారు. ఆ భవనంలో మాదకద్రవ్యాలు, వ్యభిచార రాకెట్ నడుస్తోందని.. దానిపై దాడి చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. అయితే.. సోదా కోసం తమ వద్ద వారెంట్ లేదంటూ పోలీసులు దాడికి నిరాకరించారు. మరోవైపు ఆప్ కార్యకర్తలు.. ఆ భవనంలో ఇద్దరు ఉగాండా యువతుల నుంచి బలవంతంగా యూరిన్ నమూనాలు సేకరించారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి ఆప్‌పై అన్నివైపుల నుంచీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. సెక్స్, డ్రగ్ రాకెట్ నడుస్తోందని స్వయంగా మంత్రి చెప్పినా చర్యలు తీసుకోవటానికి నిరాకరించిన పోలీసులతో పాటు.. ఇతర కేసుల్లోనూ మంత్రులకు సహకరించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం సోమవారం వరకూ గడువు ఇచ్చింది.