
స్పందించకుంటే నిరవధిక దీక్ష: కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పోలీసుల తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నా రెండోరోజు కూడా కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పోలీసుల తీరుకు నిరసనగా చేపట్టిన ధర్నా రెండోరోజు కూడా కొనసాగుతోంది. రైల్ భవన్ దగ్గర ఆయనతో పాటు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాత్రి పూట చలిలో కూడా వారు అక్కడే నిద్రించి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికైనా స్పందించకుంటే నిరవధిక దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు. కాగా ఈరోజు జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం కూడా దీక్షాస్థలి వద్దే నిర్వహించాలని కేజ్రీవాల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ధర్నా దృష్ట్యా ఇవాళ కూడా 4 మెట్రో స్టేషన్లు మూసివేశారు.
కాగా కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన ఇంటి దగ్గర డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ చేయనందుకే ఆ గార్డును సస్పెండ్ చేసే షిండే.. ఢిల్లీలో మహిళలకు భద్రత లేకుండా పోయినా పట్టించుకోవడంలేదని సిసోడియా ఆరోపించారు. పోలీసుల అండతోనే ఢిల్లీలో సెక్స్ రాకెట్, డ్రగ్ మాఫియా జరుగుతోందని... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.