‘నల్లా’వి తెల్లగా
అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
మార్గదర్శకాలు రూపొందిస్తున్న జలమండలి
80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటే రూ.2500
80-200 చదరపు మీటర్ల విస్తీర్ణమైతే రూ.8500
స్వచ్ఛందంగా ముందుకొస్తే జరిమానా ఉండదు
ఈ వారంలోనే శ్రీకారం
సిటీబ్యూరో:గ్రేటర్ పరిధిలో అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు జలమండలి సిద్ధమవుతోంది. దీని కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు అక్రమ నల్లా కలిగి ఉండి బోర్డుకు ఎలాంటి చార్జీలు చెల్లించని వారిపై అపరాధరుసుం (జరిమానా) విధించరాదని నిర్ణయించింది. 80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకున్న అల్పాదాయ పేదలకు గృహ వినియోగ కనెక్షన్ (డొమెస్టిక్)కు రూ.2500, 80 నుంచి 200 చదరపు మీటర్ల విస్తీర్ణం లోపల ఇళ్లు నిర్మించిన వారికి రూ.8500, ఆపై పెరిగే ప్రతి చదరపు మీటరు విస్తీర్ణానికి రూ.47 చొప్పున వసూలు చేసి అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వస్తే జరిమానా ఉండదని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు తప్పవని బోర్డు రెవెన్యూ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. క్రమబద్ధీకరణకు నగరంలో నిర్వహణ డివిజన్ల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, కాలనీలు, బస్తీల్లో వీధివీధినా మైకులతో ప్రచారం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే ఈ ప్రక్రియ చేపడతామన్నారు.
గుర్తించింది ఏడు వేలే...
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా (ఆస్కి) నగరంలో అక్రమ నల్లాలపై సర్వే చేపట్టింది. కేవలం ఏడు వేల అక్రమ కనెక్షన్లు ఉన్నట్టు తేల్చింది. కానీ అనధికారికంగా వీటి సంఖ్య సుమారు లక్ష వరకు ఉంటుంద న్నది బహిరంగ రహస్యం. భూమి లోపల ఉన్న అక్రమ నల్లాలను కనిపెట్టడం జలమండలికి కత్తిమీద సాముగామారింది. ముఖ్యంగా పాతనగరం, శివార్లలో వేలాదిగా అక్రమ నల్లాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వీటిపై ఎవరైనా సమాచారం అందిస్తేనే బోర్డు విజిలెన్స్ సిబ్బంది అక్రమార్కుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అవసరమైన పోలీసు సిబ్బంది లేకపోవడంతో ఈ విభాగం అక్రమార్కులను కట్టడి చేయడంలో విఫలమవుతోంది. అదనపు సిబ్బంది కేటాయింపుతో విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి, క్రమబద్ధీకరణతో పాటు తనిఖీలు ముమ్మరం చేస్తేనే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
బిల్లు బకాయిదారులపై ఆర్.ఆర్.యాక్ట్
నీటి బిల్లు బకాయిదారులపై జలమండలి బుధవారం నుంచి మరోమారు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు రూ.1075 కోట్ల మేర బిల్లులు పేరుకుపోయిన నేపథ్యంలో దశలవారీగా దీర్ఘకాలిక బకాయిదారులను గుర్తించి వారి చరాస్తులను జప్తు చేయాలని నిర్ణయించింది. తాజాగా 15 మంది బకాయిదారుల ఆస్తులను జప్తునకు బోర్డు రెవెన్యూ విభాగం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. పెండింగ్ నీటి బిల్లుల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, వివిధ ప్రభుత్వ సంస్థలు, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థల బిల్లులే సింహభాగం ఉండడం గమనార్హం. వీటి నుంచి బకాయిల వసూలు బోర్డుకు కత్తిమీద సాములా మారనుంది.