South Africa vs Srilanka
-
అవిష్క సూపర్ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం
కొలంబో: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక బోణి కొట్టింది. కొలంబో వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో 14 పరుగులతో సఫారీలపై గెలుపొందింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 118;10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకంతో చెలరేగగా.. ఆల్ రౌండర్ చరిత్ అసలంక అర్ధ సెంచరీతో రాణించాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల చేసింది. అవిష్క, అసలంకలకు తోడు ధనుంజయ డిసిల్వా(44) కూడా రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్రమ్, షంసీ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో మార్క్రమ్(90 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. డస్సెన్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో హెన్రీచ్ క్లాసెన్(36), రబడా(13 నాటౌట్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివరి రెండు ఓవర్లలో సఫారీల విజయానికి 32 పరుగులు కావాల్సి ఉండగా.. 49వ ఓవర్లో ఆ జట్టు కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. దాంతో చివరి ఓవర్లో 27 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్లో రబడా రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించినా.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 4న ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..? -
పరాజయాలకు బ్రేక్: మరో సిరీస్‌కు సిద్ధమైన శ్రీలంక
కొలంబో: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు శ్రీలంక టూర్ ఖరారైంది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ల నిమిత్తం ప్రొటిస్ జట్టు లంకలో పర్యటించనుంది. సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 14 వరకు మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే ఈ సిరీస్‌లు జరుగనున్నాయి. టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న తరుణంలో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఇరు జట్లకు కావాల్సినంత ప్రాక్టీసు దొరకనుంది. జోరు మీదున్న ప్రొటిస్.. తాజా సిరీస్ గెలుపుతో జోష్‌లో లంక ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. ఇప్పటికే వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉంది. ఇక, ఐదు వరుస టీ20 సిరీస్ పరాజయాల తర్వాత గురువారం నాటి మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించి శ్రీలంక జట్టు తమ అపజయాల పరంపరకు అడ్డుకట్ట వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక ఆటగాళ్లు సైతం ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టనున్నారు. ద్వైపాక్షిక సిరీస్ ఖరారైన నేపథ్యంలో దక్షిణాఫ్రికా తాత్కాలిక సీఈఓ ఫొలేసీ మొసేకి మాట్లాడుతూ.. ఉపఖండ జట్టుపై తమ టీం తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌నకు ముందు తమ బలాబలాలను పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నాడు. శ్రీలంక- దక్షిణాఫ్రికా వన్డే, టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి వన్డే: సెప్టెంబరు 2, 2021- కొలంబో ►రెండో వన్డే: సెప్టెంబరు 4, 2021- కొలంబో ►మూడో వన్డే: సెప్టెంబరు 7, 2021- కొలంబో ►మొదటి టీ20: సెప్టెంబరు 10, 2021- కొలంబో ►రెండో టీ20: సెప్టెంబరు 12, 2021- కొలంబో ►మూడో టీ20: సెప్టెంబరు 14, 2021- కొలంబో -
శ్రీలంకను కట్టడి చేశారు..!
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 204 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు ఆదిలోనే షాక్ తగిలింది. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో కుశాల్ పెరీరా-అవిష్కా ఫెర్నాండాల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 67 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(30) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై కాసేపటికి కుశాల్ పెరీరా(30) కూడా ఔట్ కావడంతో లంక 72 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత కుశాల్ మెండిస్(23), ధనంజయ డిసిల్వా(24), జీవన్ మెండిస్(18), తిషారా పెరీరా(21)లు సైతం నిరాశపరిచారు. చివర్లో ఇసురా ఉదానా(17) ఫర్వాలేదనిపించడంతో లంక 49.3 ఓవర్లలో 203 పరుగులు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్, మోరిస్‌లు తలో మూడు వికెట్లు సాధించగా,కగిసో రబడా రెండు వికెట్లు తీశాడు. ఫెహ్లుక్వోయో, జేపీ డుమినీలకు తలో వికెట్ దక్కింది. -
శ్రీలంకకు సవాల్
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా రివర్సైడ్ గ్రౌండ్లో జరగనున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో లంకేయులు తలపడనున్నారు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ లంక నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో నెగ్గి.. రెండు ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దుకావడంతో ఆ జట్టు 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. నాకౌట్‌కు చేరాలంటే లంక తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. దీంతో సౌతాఫ్రికాపై నెగ్గి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని కరుణరత్నే సేన పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో లంక బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌తో పోల్చితే బౌలింగ్‌లో ఆ జట్టు బలంగా ఉంది. లసిత్ మలింగ, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉదాన, ప్రదీప్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నారు. ఇంగ్లండ్‌పై వెటరన్ పేసర్ లసిత్ మలింగ 4 వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు కేవలం 3 పాయింట్లతో తొమ్మిదోస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. లంకపై గెలిచి పరువు దక్కించుకోవాలని సఫారీలు భావిస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 76 మ్యాచ్‌లు జరగ్గా... లంక 31 మ్యాచ్‌ల్లో నెగ్గింది. దక్షిణాఫ్రికా 43 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మరోదాంట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో ఐదు సార్లు ఎదురుపడగా మూడుసార్లు దక్షిణాఫ్రికా, ఒకసారి లంక గెలిచాయి. మరో మ్యాచ్ టైగా ముగిససింది. తాజా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తొలుత లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.