
కొలంబో: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శ్రీలంక బోణి కొట్టింది. కొలంబో వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో 14 పరుగులతో సఫారీలపై గెలుపొందింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(115 బంతుల్లో 118;10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకంతో చెలరేగగా.. ఆల్ రౌండర్ చరిత్ అసలంక అర్ధ సెంచరీతో రాణించాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య జట్టు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 300 పరుగుల చేసింది. అవిష్క, అసలంకలకు తోడు ధనుంజయ డిసిల్వా(44) కూడా రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్, షంసీ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ జట్టులో మార్క్‌రమ్(90 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. డస్సెన్(59) హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో హెన్రీచ్ క్లాసెన్(36), రబడా(13 నాటౌట్) జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
చివరి రెండు ఓవర్లలో సఫారీల విజయానికి 32 పరుగులు కావాల్సి ఉండగా.. 49వ ఓవర్‌లో ఆ జట్టు కేవలం 5 పరుగులు మాత్రమే చేసింది. దాంతో చివరి ఓవర్‌లో 27 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌లో రబడా రెండు ఫోర్లతో ఆశలు రేకెత్తించినా.. శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు విజయం లాంఛనమైంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 4న ఇదే వేదికగా జరుగనుంది.
చదవండి: ఆండర్సన్ ఏంటా అంకిత భావం.. రక్తం కారుతున్నా పట్టించుకోవా..?