South African president
-
ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు. కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్ సతీమణికి నాగాలాండ్‌లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు. ఇక బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్ పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్కు ఛత్తీస్‌గఢ్ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు. -
అధ్యక్షుడికీ తప్పని.. ఓట్లపాట్లు
జొహాన్నెస్‌బర్గ్: ఓట్ల పండగొస్తే అది అనకాపల్లైనా ఆఫ్రికా అయినా గుళ్లో ఉండే దేవుడి కంటే గల్లీలో ఉండే ఓటరు దర్శనానికే నాయకులు క్యూ కడతారు. ఓటరు మహాశయుడిని కలిసి వారి సుఖదుఃఖాలు తెలుసుకుంటారు. మేమున్నామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకుంటారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రాజధానిలో ఉండే నేతలు కూడా వాడవాడకూ, ఇంటింటికీ తిరగాల్సిందే. ప్రజలను కలసి హామీల మాయా మూటలు అప్పజెప్పాల్సిందే. లేదంటే ఓటరు మనసు మారిపోదూ!.. అలా అయిన పక్షంలో ప్రాణం కంటే ఖరీదైన ఓటు జారిపోదూ..! అసలు వివయంలోకి వస్తే మన దేశంలోలాగే భగభగ ‘మండే’లా దక్షిణాఫ్రికాలోనూ ఎన్నికలు రెండు నెలల్లో జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సౌతాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా రాజధానికి దగ్గరలోని మబోపనే టౌన్‌షిప్‌ను సందర్శించారు. ప్రచార అనంతరం మబోపనే నుంచి రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడ రైలు రాక కోసం రామఫొసా గంటసేపు ఎదురు చూడవలసి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన రైలు 45 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రిటోరియా స్టేషన్‌కు వెళ్లడానికి 3 గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు ఆగిపోయింది. ఆ టైమ్‌లో ఆయనతో ఉన్న విలేకరులు ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికాలో రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్ రైల్ ఏజెన్సీ ఆఫ్ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్ సర్కార్ పట్టించుకోవపోవడం పాపమని ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రయాణానంతరం ప్రిటోరియాకు చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని దీన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన రామఫొసా ’’రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామ’’ని అన్నారు. 400 సీట్లున్న సౌతాఫ్రికా పార్లమెంట్లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా రామఫొసో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. -
ఘనంగా గణతంత్రం
న్యూఢిల్లీ: త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 70వ గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి. అంతకుముందు, శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో కలసి రాహుల్ ముందటి వరుసలో కూర్చున్నారు. గతేడాది రాహుల్‌కు ఆరో వరసలో సీటు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమం చివర వాయుసేన ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి అస్సాం రైఫిల్స్ మహిళా జవాన్లు, మహిళా అధికారి బైక్ స్టంట్లు గణతంత్ర వేడుకల్లో చరిత్ర సృష్టించాయి. మహిళా శక్తిని ప్రదర్శించాయి. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు. నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్‌తోపాటు సిగ్నల్స్ కోర్కు చెందిన కెప్టెన్ శిఖా సురభి చేసిన మోటారు సైకిల్ విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో సంప్రదాయంగా వస్తున్న పురుష జవాన్ల ‘డేర్ డేవిల్స్’ బైక్ విన్యాసాల్లో కెప్టెన్ శిఖా సభ్యురాలు. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఆర్మీ సర్వీస్ కార్ప్స్కు లెఫ్టినెంట్ కస్తూరి, ట్రాన్స్‌పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్ కాంటిజెంట్‌కు కెప్టెన్ భావ్నా శ్యాల్ నేతృత్వం వహించారు. ‘రాజస్తాన్‌కు చెందిన నేను, ఒక బస్ కండక్టర్ కూతురుని. నేనే ఈ పని చేయగలిగానంటే బాలికలెవరైనా తమ కలలను నిజం చేసుకోగలరని నా నమ్మకం’ అని ఒక బిడ్డకు తల్లి అయిన మేజర్ కన్వర్ తెలిపారు. లక్షలాది పూలతో సీపీడబ్ల్యూడీ శకటం శకటాల ప్రదర్శనలో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజా పనుల విభాగం) శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటాన్ని ఏకంగా 3 లక్షల బంతిపూలు, మల్లె, గులాబీలతో అలంకరించింది. గాంధీ దండి యాత్రను ప్రదర్శిస్తూ, అహింసా మార్గంలో అనుచరులు, వెనుక ప్రపంచ శాంతి, ఐక్యతను ప్రదర్శించింది. పసుపు, నారింజ తలపాగాతో మోదీ రిపబ్లిక్ డే వేడుకల్లో రంగురంగుల తలపాగా ధరించే ఆనవాయితీని మోదీ ఈసారి కొనసాగించారు. ఎరుపు, పైన పసుపు, నారింజ రంగుతో కూడిన తలపాగా, కుర్తా పైజామా, నెహ్రూ ట్రేడ్‌మార్క్ జాకెట్‌తో ప్రధాని పాల్గొన్నారు. గణతంత్ర, ఆగస్టు 15 వేడుకల్లో మోదీ ధరిస్తున్న తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2018 పంద్రాగస్టు వేడుకల్లో కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ 2017లో చిక్కనైన ఎరుపు, పసుపు వర్ణంలో, బంగారు రంగు చారలు కలిగిన తలపాగాను కట్టుకున్నారు. రాజ్‌పథ్ విశేషాలు.. ► రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు. ► మార్చింగ్ చేసిన ఆర్మీ బృందాల్లో మద్రాస్ రెజిమెంట్, రాజ్‌పుతానా రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, గోర్ఖా బ్రిగేడ్లు ఉన్నాయి. ► సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే ► అమెరికా శతఘ్నులు ఎం777, ఎంబీటీ టీ–90, దేశీయంగా తయారుచేసిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. ► పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ► నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు. ► 144 మంది యువ అధికారులతో కూడిన నేవీ బృందం వెనకే నేవీ శకటం పరేడ్‌లో పాల్గొంది. ► వైమానిక బృందంలో 144 మంది సైనికులకు చోటు కల్పించారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధ వ్యవస్థల్ని వైమానిక దళ శకటం ప్రదర్శించింది. తేలికపాటి యుద్ధ విమానం, దిగువ స్థాయి తేలికపాటి వెయిట్ రాడార్, సుఖోయ్30ఎంకేఐ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ► ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లతో పాటు పారా మిలిటరీ, ఇతర అనుబంధ బలగాలు కూడా పరేడ్‌లో పాల్గొన్నాయి. ► ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కారానికి ఎంపికైన 26 మంది బాలలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ► వైమానిక దళ విమానాలు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ► 70వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శనివారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులకు మిఠాయిలను పంచిపెట్టారు. పాకిస్తానీ సైనికులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని పాక్ సైనికులు ఆలింగనం చేసుకుని, చేతులు కలిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లడఖ్‌లో మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఐటీబీపీ జవాన్లు నజీర్ అహ్మద్ తరఫున భార్యకు అశోకచక్ర అందిస్తున్న కోవింద్. వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ. 3 లక్షల పుష్పాలతో రూపొందించిన శకటం -
సహకార బలోపేతానికి కార్యాచరణ
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతానికి మూడేళ్ల పాటు వ్యూహాత్మక కార్యక్రమాన్ని అమలుపరచాలని భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయించాయి. రక్షణ, వ్యాపారం, తీరప్రాంత భద్రత తదితర భిన్న రంగాల్లో సంబంధాల విస్తరణకు ఈ కొత్త ప్రయోగం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు, రామఫోసా స్పందిస్తూ..వ్యూహాత్మక కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తేవాలని రెండు దేశాల మంత్రులు, అధికారులను ఆదేశించామని తెలిపారు. దక్షిణాఫ్రికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు నైపుణ్యాభివృద్ధిలోనూ కలసిపనిచేస్తున్నాయి. -
జాకబ్ జుమా రీకాల్‌కు ఏఎన్సీ నిర్ణయం
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాను రీకాల్ చేయాలని అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ) నిర్ణయించింది. అవినీతి ఆరోపణలతో నిండా మునిగిన జుమా రాజీనామాకు నిరాకరించటంతో సోమవారం ఏఎన్సీ అత్యున్నత స్థాయి భేటీ జరిపింది. దాదాపు 13 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత జుమాను సాగనంపాలని తీర్మానించింది. అయితే, ఇందుకు గడువేదీ విధించలేదు. ఈ మేరకు జుమాకు ఏఎన్సీ లేఖ రాయనున్నట్లు సమాచారం. రాజీనామాకు అంగీకరించిన జుమా 6 నెలలు కొనసాగాలని భావిస్తున్నట్లు ఏఎన్సీ ప్రధాన కార్యదర్శి మగషులే తెలిపారు. భారీ అవినీతి, దేశ ఆర్థిక మందగమనం, రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగం కారణాలతో జుమాపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థంకాని పరిస్థితి ఏర్పడటంతో పార్లమెంట్‌ను రద్దుచేసి, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నల్ల సూరీడుకి ఘన నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: భారత సంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఐఎస్‌సీయూఎఫ్) జాతీయ సమితి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని గాంధీపీస్ పౌండేషన్ హాలులో నెల్సన్ మండేలాకి ఘనంగా నివాళులర్పించారు. భానుదేవదత్త అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సంతాప సభలో సంఘానికి చెందిన 13 రాష్ట్రాల ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎల్ఏకె.సుబ్బరాజు తెలిపారు. మండేలా సంతాప దినాలను సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో సంతాపసభలు నిర్వహిస్తున్నట్టు వారు పేర్కొన్నారు.జాతి వివిక్షత,అస్పృశ్యత, అణచివేతలకు వ్యతిరేకంగా మండేలా చేసిన పోరు అందరికీ స్పూర్తిదాయకమని వక్తలు అన్నారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సంతాప సభలో మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా, ప్రొఫెసర్ దేవేంద్ర కౌషిక్, విజయ్ కుమార్ పడిహారి, రాధాకృష్ణన్,నారాయణన్, సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.