జాతీయ గీతాలాపన సందర్భంగా సెల్యూట్ చేస్తున్న కోవింద్, వెంకయ్య, మోదీ, రమఫోసా, నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల పాటవ ప్రదర్శన, దేశ చరిత్ర, సంస్కృతి, వైవిధ్యాన్ని చాటుతూ సాగిన శకటాల కవాతు నడుమ 70వ గణతంత్ర వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో పలువురు విదేశీ అతిథులుసహా రాజకీయ, ఆర్మీ అధికార గణం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 90 నిమిషాల పాటు సాగిన వేడుకలకు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, ఆదర్శాలు ఉట్టిపడేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. మొత్తం 22 శకటాలు పరేడ్‌లో పాల్గొనగా, అందులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవి 16 కాగా, మిగిలిన ఆరు కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందినవి ఉన్నాయి.
అంతకుముందు, శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పరాక్రమ పురస్కారం అశోకచక్రను రాష్ట్రపతి కోవింద్..అమర జవాను లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ కుటుంబ సభ్యులకు ప్రదానం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌తో కలసి రాహుల్ ముందటి వరుసలో కూర్చున్నారు. గతేడాది రాహుల్‌కు ఆరో వరసలో సీటు కేటాయించడం పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కార్యక్రమం చివర వాయుసేన ప్రదర్శించిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రిపబ్లిక్ డే పరేడ్‌లో నారీశక్తి
అస్సాం రైఫిల్స్ మహిళా జవాన్లు, మహిళా అధికారి బైక్ స్టంట్లు గణతంత్ర వేడుకల్లో చరిత్ర సృష్టించాయి. మహిళా శక్తిని ప్రదర్శించాయి. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన, 183 ఏళ్ల చరిత్ర గల అస్సాం రైఫిల్స్‌కు మేజర్ కుష్బూ కన్వర్(30) నేతృత్వం వహించారు. నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్‌తోపాటు సిగ్నల్స్ కోర్‌కు చెందిన కెప్టెన్ శిఖా సురభి చేసిన మోటారు సైకిల్ విన్యాసం అందరినీ అబ్బురపరిచింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో సంప్రదాయంగా వస్తున్న పురుష జవాన్ల ‘డేర్ డేవిల్స్’ బైక్ విన్యాసాల్లో కెప్టెన్ శిఖా సభ్యురాలు. మొత్తం పురుష జవాన్లతో కూడిన ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌కు లెఫ్టినెంట్ కస్తూరి, ట్రాన్స్‌పోర్టబుల్ శాటిలైట్ టెర్మినల్ కాంటిజెంట్‌కు కెప్టెన్ భావ్‌నా శ్యాల్ నేతృత్వం వహించారు. ‘రాజస్తాన్‌కు చెందిన నేను, ఒక బస్ కండక్టర్ కూతురుని. నేనే ఈ పని చేయగలిగానంటే బాలికలెవరైనా తమ కలలను నిజం చేసుకోగలరని నా నమ్మకం’ అని ఒక బిడ్డకు తల్లి అయిన మేజర్ కన్వర్ తెలిపారు.
లక్షలాది పూలతో సీపీడబ్ల్యూడీ శకటం
శకటాల ప్రదర్శనలో సీపీడబ్ల్యూడీ (కేంద్ర ప్రజా పనుల విభాగం) శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శకటాన్ని ఏకంగా 3 లక్షల బంతిపూలు, మల్లె, గులాబీలతో అలంకరించింది. గాంధీ దండి యాత్రను ప్రదర్శిస్తూ, అహింసా మార్గంలో అనుచరులు, వెనుక ప్రపంచ శాంతి, ఐక్యతను ప్రదర్శించింది.
పసుపు, నారింజ తలపాగాతో మోదీ
రిపబ్లిక్ డే వేడుకల్లో రంగురంగుల తలపాగా ధరించే ఆనవాయితీని మోదీ ఈసారి కొనసాగించారు. ఎరుపు, పైన పసుపు, నారింజ రంగుతో కూడిన తలపాగా, కుర్తా పైజామా, నెహ్రూ ట్రేడ్‌మార్క్ జాకెట్‌తో ప్రధాని పాల్గొన్నారు. గణతంత్ర, ఆగస్టు 15 వేడుకల్లో మోదీ ధరిస్తున్న తలపాగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2018 పంద్రాగస్టు వేడుకల్లో కాషాయ రంగు తలపాగా ధరించిన మోదీ 2017లో చిక్కనైన ఎరుపు, పసుపు వర్ణంలో, బంగారు రంగు చారలు కలిగిన తలపాగాను కట్టుకున్నారు.
రాజ్‌పథ్ విశేషాలు..
► రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత 21 తుపాకుల సెల్యూట్‌తో జాతీయ గీతాలాపాన జరిగింది. ఆ తరువాత కవాతు బృందాల నుంచి కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు.
► మార్చింగ్ చేసిన ఆర్మీ బృందాల్లో మద్రాస్ రెజిమెంట్, రాజ్‌పుతానా రైఫిల్స్, సిక్కు రెజిమెంట్, గోర్ఖా బ్రిగేడ్‌లు ఉన్నాయి.
► సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ)లో సభ్యులైన నలుగురు ఈసారి పరేడ్‌లో పాల్గొనడం విశేషం. వారందరి వయసు 90 ఏళ్లకు పైనే
► అమెరికా శతఘ్నులు ఎం777, ఎంబీటీ టీ–90, దేశీయంగా తయారుచేసిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.
► పూర్తిగా మహిళలతో కూడిన అస్సాం రైఫిల్స్ బృందం తొలిసారి రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది.
► నేవీ, ఆర్మీ సర్వీస్ కోర్, సిగ్నల్స్ యూనిట్ కోర్ బృందాలకు మహిళా అధికారులే నేతృత్వం వహించారు.
► 144 మంది యువ అధికారులతో కూడిన నేవీ బృందం వెనకే నేవీ శకటం పరేడ్‌లో పాల్గొంది.
► వైమానిక బృందంలో 144 మంది సైనికులకు చోటు కల్పించారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధ వ్యవస్థల్ని వైమానిక దళ శకటం ప్రదర్శించింది. తేలికపాటి యుద్ధ విమానం, దిగువ స్థాయి తేలికపాటి వెయిట్ రాడార్, సుఖోయ్30ఎంకేఐ, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
► ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లతో పాటు పారా మిలిటరీ, ఇతర అనుబంధ బలగాలు కూడా పరేడ్‌లో పాల్గొన్నాయి.
► ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కారానికి ఎంపికైన 26 మంది బాలలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
► వైమానిక దళ విమానాలు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
► 70వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా శనివారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తానీ సైనికులకు మిఠాయిలను పంచిపెట్టారు. పాకిస్తానీ సైనికులు, బీఎస్‌ఎఫ్ సిబ్బందిని పాక్ సైనికులు ఆలింగనం చేసుకుని, చేతులు కలిపి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
లడఖ్‌లో మంచుకొండల్లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఐటీబీపీ జవాన్లు
నజీర్ అహ్మద్ తరఫున భార్యకు అశోకచక్ర అందిస్తున్న కోవింద్. వేడుకలకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న మోదీ.
3 లక్షల పుష్పాలతో రూపొందించిన శకటం
Comments
Please login to add a commentAdd a comment