South Scope
-
స్టార్ హోటల్లో అదరహో అనిపించిన ఫ్యాషన్ షో
-
శాండిల్‌వుడ్ స్వాతిముత్యం!
సౌత్ స్కోప్ సుదీప్.. కన్నడచిత్రపరిశ్రమ శాండల్‌వుడ్ సూపర్‌స్టార్. మాస్లో మంచి ఇమేజ్ ఉన్న స్టార్హీరో. అంతేనా... సుదీప్ ప్రతిభ గురించి ప్రస్తావించాలంటే కమల్‌హాసన్‌ను గుర్తు చేసుకోవాలి, ఈ హీరో ఎదిగిన తీరును గురించి చెప్పాలంటే షారూక్ ఖాన్‌ను ప్రస్తావించాలి. సుదీప్ ప్రయోగాల ప్రస్థానం విషయంలో తమిళ స్టార్హీరో విక్రమ్‌తోనూ పోలిక ఉంటుంది. ఇంతమంది హీరోల్లోని లక్షణాల మేలిమి కలయిక సుదీప్. తెలుగు సినీ సముద్రంలో విరిసిన ‘స్వాతి ముత్యం’ సినిమాను కన్నడలో రీమేక్ చేసిన సాహసి సుదీప్. కమల్‌హాసన్ అసమాన నటనా ప్రతిభకు మైలు రాయిగా నిలిచిపోయిన ‘శివయ్య’ పాత్రను కన్నడలో లీడ్ చేసిన వ్యక్తిగా సుదీప్‌ను మనం పరిచయం చేసుకోవచ్చు. అలా కాదు అనుకొంటే ‘ఈగ’ సినిమాలో విలన్‌గానూ, రక్తచరిత్ర -2 సినిమాతో తెలుగువాళ్లకు తెలిసినవాడే. బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ టీవీ సీరియల్స్ ద్వారానే నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఈ శాండిల్‌వుడ్ బాద్షా కూడా టీవీ సీరియల్స్‌తోనే కెరీర్ మొదలెట్టాడు. చిత్రరంగంలో పెద్దగా సంబంధంలేని ఒక హోటల్ యజమాని కుమారుడు అయిన సుదీప్ టీవీలో అనుకోకుండా వచ్చిన సీరియల్స్‌తో గుర్తింపు సంపాదించుకొని అటు నుంచి సినిమాల్లోకి వచ్చాడు. దాదాపు 300 సినిమాల్లో నటించిన మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి నటించిన తొలి సినిమా ఇంత వరకూ విడుదల కాలేదు. సుదీప్ నటించిన ఫస్ట్ సినిమానూ విడుదల కాలేదు. రెండూ మధ్యలో ఆగిపోయాయి. సుదీప్కైతే రెండో సినిమాతోనూ అదే అనుభవం మిగిలింది. హీరోగా నటించిన ఆ రెండు సినిమాలు విడుదల కాకపోవడంతో 1999లో విడుదల అయిన ‘స్పర్శ’ అనే సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు ఈ హీరో. ఆ సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. తమిళహీరో విక్రమ్ ‘సేతు’ సినిమాతో తొలి హిట్‌ను సొంతం చేసుకొంటే...అదే సినిమాను కన్నడలో రీమేక్ చేసి విజయం సొంతం చేసుకొన్నాడు సుదీప్. 2001లో ‘హుచ్చా’ పేరుతో విడుదల అయ్యింది ఆ సినిమా. తర్వాత ధమ్, నంది సినిమాలు సూపర్‌హిట్స్. 2003లో వచ్చిన ‘కిచ్చా’ సినిమా సుదీప్‌ను స్టార్‌ను చేసింది. ఇందులో కృష్ణ అలియాస్ కిచ్చాగా చేసిన సుదీప్ సౌతిండియా ఫిలింఫేర్లో బెస్ట్యాక్టర్ అవార్డును అందుకొన్నాడు. యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌కు యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, సింగర్, ప్రొడ్యూసర్, డెరైక్టర్‌గా గుర్తింపు ఉంది. సుదీప్ కూడా అచ్చం అలాగే ఈ రంగాలన్నింటిలోనూ ప్రతిభను చాటుకొన్నాడు. మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ సినిమాను కన్నడలో రీమేక్ చేసి దర్శకుడు అయ్యాడు ఈ హీరో. సుదీప్ ప్రతిభ కేవలం కన్నడ చిత్ర పరిశ్రమకే పరిమితం కాలేదు. అక్కడ స్టార్‌గా వెలుగుతున్న ఇతడి కాంతిని బాలీవుడ్ వరకూ తీసుకెళ్లాడు రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ ‘ఫూంక్’తో సుదీప్‌ను బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వర్మ కంపెనీ నుంచే వచ్చిన ఫూంక్-2, రక్తచరిత్ర సినిమాల్లో కూడా సుదీప్ నటించాడు. కర్ణాటకలో సుదీప్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. శాండిల్‌వుడ్ స్థాయికి భారీ ఓపెనింగ్ కలెక్షన్లను సాధించగల సామర్థ్యమున్న స్టార్. ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలకు చాలా ధైర్యం ఉండాలి. ప్రేక్షకులు తమను ఎలా రిసీవ్ చేసుకొంటారో అనే విషయంలో వారు స్థిమితమనస్కులై ఉండాలి. అలాంటి ప్రయోగాత్మక సినిమాలను తొలిసారి చేసే వాళ్ల సంగతి అది. అయితే ఒక హీరో బాగా చేసి పేరు తెచ్చుకొన్న రోల్‌ను రీమేక్ రూపంలో అనుకరించడం అంటే మామూలు విషయం కాదు. అది కత్తిమీద సాము. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా అంతే సంగతులు. సుదీప్ అలాంటి సామునేర్చిన నటుడు. చాలా మంది హీరోలు ప్రయోగాత్మకంగా చేసిన క్యారెక్టర్లను విజయవంతంగా రెండోసారి చేసి చూపించాడు. రీమేక్లతోనే తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు. స్టార్‌హీరోగా, బెస్ట్ యాక్టర్‌గా వెలుగొందుతున్నాడు. - జీవన్ -
త్రిశతక చిత్ర మమ్మూకా...!
మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పానిపరంబిల్... ఈ అసలు పేరు చెబితే ఆయనను మనం గుర్తుపట్టలేం కానీ, ‘మమ్ముట్టి’ అంటే మాత్రం మనవాడే కదా అనుకుంటాం. ఈ మల్లూవుడ్ మెగాస్టార్‌ని మనసారా గుర్తు చేసుకొంటాం. సహజమైన నటనకు చిరునామాగా చెప్పుకునే మమ్ముట్టిని ‘త్రిశతక చిత్ర మమ్మూకా’ అంటూ మలయాళీలు అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన గురించి చెప్పడానికి ఎన్ని పుటలను అక్షరాలతో నింపినా తక్కువే...! కొట్టాయంలోని ఒక సాధారణ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించారు మమ్ముట్టి. బీఎల్ పూర్తి చేసి లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత 1971లో ఆయనకు సినిమా అవకాశం వచ్చింది. అంటే... ఇప్పటికి ఆయనది నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం అన్నమాట. మాస్ క్యారెక్టర్ కావచ్చు, ఆర్టిస్టిక్ క్యారెక్టర్ కావచ్చు. ఏ పాత్రయినా మమ్ముట్టికి కరతలామలకమే. దక్షిణాది సినీ పరిశ్రమలో కమల్‌హాసన్ తర్వాత చెప్పుకోదగ్గ నటుడు మమ్ముట్టి అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కమల్ హాసన్ తర్వాత మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నటుడు కూడా ఆయనే. ఈ పాత్రకు మమ్ముట్టి అయితేనే బావుంటుందని అనేక సినీ పరిశ్రమల వాళ్లు ఆయనను ఏరికోరి తెచ్చుకొంటారంటే అది ఆయన అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ‘స్వాతి కిరణం’ చిత్రంతో మన తెలుగువారూ ఆయన నటనా వైదుష్యాన్ని రుచి చూసి మురిశారు. దళపతి, ప్రియురాలు పిలిచింది వంటి అనేక డబ్బింగ్ సినిమాలతో కూడా పలకరించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారాయన. నటుడిగానే కాదు, ఒక హీరోగా కూడా నేటి తరం నటులకు మమ్ముట్టి ఆదర్శప్రాయుడు. హీరో అనేవాడు ఎక్కువ సినిమాలు చేస్తే పరిశ్రమ పచ్చగా ఉంటుందని నమ్మి, దాన్ని తు.చ. తప్పక పాటించిన మేటి నటుడు! సాధారణంగా మమ్ముట్టి లాంటి సూపర్‌స్టార్స్... సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకుంటారు. కానీ మమ్ముట్టి మాత్రం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు. యేటా ఆయన చేసే సినిమాల సంఖ్య రెండకెల స్థాయిలో ఉంటుందంటే నమ్ముతారా! చాలా సంవత్సరాల పాటు ఏడాదికి 30కి పైగా సినిమాలు చేశారాయన. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలు ఆయన నుంచి వచ్చాయి. ఇండస్ట్రీలో తన ప్రత్యర్థి అయిన మోహన్‌లాల్‌తో కలిసి అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత మమ్ముట్టిది! రికార్డుల మేటి! భారతీయ సినీచరిత్రలో ఎక్కువ చిత్రాల్లో లీడ్‌రోల్ చేసిన హీరో మలయాళ మహానటుడు ప్రేమ్‌నజీర్. ఆయన తర్వాత ఎక్కువ చిత్రాల్లో లీడ్‌రోల్ చేసిన ఘనత మమ్ముట్టిదే. మమ్ముట్టికి ఇప్పుడు 62 ఏళ్లు. సినీనటునిగా 41 ఏళ్లు. ఈ నాలుగు దశాబ్దాల్లో 360 చిత్రాలు చేశారు మమ్ముట్టి. ఆ జనరేషన్లో ఇన్ని సినిమాల్లో నటించిన హీరో ఎవరూ లేరు. రాజకీయంగా వామపక్షవాది. కైరలీ, పీపుల్ టీవీ, వియ్ టీవీ చానళ్లలో ఈయనకు వాటాలున్నాయి. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా హీరో అయ్యాడు. తన తొలి సినిమా ‘సెకెండ్షో’తో బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా ‘ఫిలింఫేర్’ కూడా అందుకొన్నాడు. - జీవన్ ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డు కూడా మమ్ముట్టిదే. 1986లో ఆయన నటించిన 36 సినిమాలు విడుదలయ్యాయి. ఇది నేటికీ చెరగని రికార్డ్. అంతకన్నాముందు 1982లో 32, 1983లో 35, 1984లో 34 చిత్రాల్లో నటించారు మమ్ముట్టి. ఆయన జనరేషన్ హీరోలు తమ కెరీర్ మొత్తం మీద 150 చిత్రాల్లో నటిస్తే, మమ్ముట్టి 1982 నుంచి 86ల మధ్య అంటే... నాలుగేళ్లలో దాదాపు 150 సినిమాల్లో నటించారు. అయితే ఇన్ని సినిమాలు చేసినా మమ్ముట్టి తొలి సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడం నిజంగా చిత్రమే!