త్రిశతక చిత్ర మమ్మూకా...! | Trisataka Chitra mammuka ...! | Sakshi
Sakshi News home page

త్రిశతక చిత్ర మమ్మూకా...!

Published Sun, Jan 26 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

త్రిశతక చిత్ర మమ్మూకా...!

త్రిశతక చిత్ర మమ్మూకా...!

మహమ్మద్ కుట్టి ఇస్మాయిల్ పానిపరంబిల్... ఈ అసలు పేరు చెబితే ఆయనను మనం గుర్తుపట్టలేం కానీ, ‘మమ్ముట్టి’ అంటే మాత్రం మనవాడే కదా అనుకుంటాం. ఈ మల్లూవుడ్ మెగాస్టార్‌ని మనసారా గుర్తు చేసుకొంటాం. సహజమైన నటనకు చిరునామాగా చెప్పుకునే మమ్ముట్టిని ‘త్రిశతక చిత్ర మమ్మూకా’ అంటూ మలయాళీలు అభిమానంగా పిలుచుకుంటారు. ఆయన గురించి చెప్పడానికి ఎన్ని పుటలను అక్షరాలతో నింపినా తక్కువే...!
 
 కొట్టాయంలోని ఒక సాధారణ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించారు మమ్ముట్టి. బీఎల్ పూర్తి చేసి లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు జూనియర్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత 1971లో ఆయనకు సినిమా అవకాశం వచ్చింది. అంటే... ఇప్పటికి ఆయనది నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం అన్నమాట.
 
 మాస్ క్యారెక్టర్ కావచ్చు, ఆర్టిస్టిక్ క్యారెక్టర్ కావచ్చు. ఏ పాత్రయినా మమ్ముట్టికి కరతలామలకమే. దక్షిణాది సినీ పరిశ్రమలో కమల్‌హాసన్ తర్వాత చెప్పుకోదగ్గ నటుడు మమ్ముట్టి అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కమల్ హాసన్ తర్వాత మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న నటుడు కూడా ఆయనే. ఈ పాత్రకు మమ్ముట్టి అయితేనే బావుంటుందని అనేక సినీ పరిశ్రమల వాళ్లు ఆయనను ఏరికోరి తెచ్చుకొంటారంటే అది ఆయన అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం. ‘స్వాతి కిరణం’ చిత్రంతో మన తెలుగువారూ ఆయన నటనా వైదుష్యాన్ని రుచి చూసి మురిశారు. దళపతి, ప్రియురాలు పిలిచింది వంటి అనేక డబ్బింగ్ సినిమాలతో కూడా పలకరించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారాయన.
 
నటుడిగానే కాదు, ఒక హీరోగా కూడా నేటి తరం నటులకు మమ్ముట్టి ఆదర్శప్రాయుడు. హీరో అనేవాడు ఎక్కువ సినిమాలు చేస్తే పరిశ్రమ పచ్చగా ఉంటుందని నమ్మి, దాన్ని తు.చ. తప్పక పాటించిన మేటి నటుడు! సాధారణంగా మమ్ముట్టి లాంటి సూపర్‌స్టార్స్... సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని కథల్ని ఎంచుకుంటారు. కానీ మమ్ముట్టి మాత్రం పరిశ్రమను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తారు. యేటా ఆయన చేసే సినిమాల సంఖ్య రెండకెల స్థాయిలో ఉంటుందంటే నమ్ముతారా!  చాలా సంవత్సరాల పాటు ఏడాదికి 30కి పైగా సినిమాలు చేశారాయన. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మకమైన పాత్రలు ఆయన నుంచి వచ్చాయి. ఇండస్ట్రీలో తన ప్రత్యర్థి అయిన మోహన్‌లాల్‌తో కలిసి అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత మమ్ముట్టిది!
 
రికార్డుల మేటి!
భారతీయ సినీచరిత్రలో ఎక్కువ చిత్రాల్లో లీడ్‌రోల్ చేసిన హీరో మలయాళ మహానటుడు ప్రేమ్‌నజీర్. ఆయన తర్వాత ఎక్కువ చిత్రాల్లో లీడ్‌రోల్ చేసిన ఘనత మమ్ముట్టిదే.
     
 మమ్ముట్టికి ఇప్పుడు 62 ఏళ్లు. సినీనటునిగా 41 ఏళ్లు. ఈ నాలుగు దశాబ్దాల్లో 360 చిత్రాలు చేశారు మమ్ముట్టి. ఆ జనరేషన్‌లో ఇన్ని సినిమాల్లో నటించిన హీరో ఎవరూ లేరు.  
     
 రాజకీయంగా వామపక్షవాది. కైరలీ, పీపుల్ టీవీ, వియ్ టీవీ చానళ్లలో ఈయనకు వాటాలున్నాయి.
     
 మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా హీరో అయ్యాడు. తన తొలి సినిమా ‘సెకెండ్‌షో’తో బెస్ట్ డెబ్యూట్ యాక్టర్‌గా ‘ఫిలింఫేర్’ కూడా అందుకొన్నాడు.
 
 - జీవన్
 
 ఒక ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన రికార్డు కూడా మమ్ముట్టిదే. 1986లో ఆయన నటించిన 36 సినిమాలు విడుదలయ్యాయి. ఇది నేటికీ చెరగని రికార్డ్. అంతకన్నాముందు 1982లో 32, 1983లో 35, 1984లో 34 చిత్రాల్లో నటించారు మమ్ముట్టి. ఆయన జనరేషన్ హీరోలు తమ కెరీర్ మొత్తం మీద 150 చిత్రాల్లో నటిస్తే, మమ్ముట్టి 1982 నుంచి 86ల మధ్య అంటే... నాలుగేళ్లలో దాదాపు 150 సినిమాల్లో నటించారు. అయితే ఇన్ని సినిమాలు చేసినా మమ్ముట్టి తొలి సినిమా మాత్రం ఇప్పటికీ విడుదల కాకపోవడం నిజంగా చిత్రమే!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement