ఎదుటి వారి అమాయకత్వాన్ని, అవకాశాన్ని స్మార్ట్‌గా సొమ్ము చేసుకునే కంత్రీగాళ్లు మన చుట్టూనే వై..ఫై లా తిరుగుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నమ్మించి నట్టేట ముంచేయడానికి ఏ మాత్రం వెనుకాడరు. అలా 17జంటలకు టోకరా ఇచ్చిన ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళా స్కామర్ పోలీసులకు చిక్కింది. ఆమె చేసిన ఫ్రాడ్ ఏంటి? పోలీసులు ఆమెను ట్రాక్ చేశారు?
భారతీయ సంతతికి చెందిన ప్రీలిన్ మోహానాల్ (53) దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తోంది. వివాహాలను ప్లాన్ చేసుకోవాలనుకునే ప్రేమ జంటలను సోషల్ మీడియా ద్వారా వలవేసి పట్టుకునేంది. వారికి అందమైన వెడ్డింగ్ నేషన్స్ చూపిస్తానంటూ వారితో నమ్మబలికేది. ఆ స్థలంతో ఎటువంటి సంబంధం లేకుండా వేదిక కోసం పెద్ద మొత్తాలను ముందుగానే చెల్లించాలన పట్టుబట్టేది. సొమ్ములనురాబట్టేది. తీరా అక్కడికెళ్లాక విస్తుపోవడం ఖాళీ ప్లేస్ ప్రేమ జంట వంతయ్యేది. ఉనికిలో లేని, లేదా కనీస వసతులు కూడా లేని ప్రదేశాన్ని చూసి లబోదిబోమనేవారు. నీళ్లు, కరెంట్ కూడా లేకపోవడంతో వారి కలకాలం తీపి గుర్తుగా మిగిలిపోవాల్సిన పెళ్లి సందడి కాస్త జీవితంలో మర్చిపోలేనంత విచారకరంగా మారిపోయేది. ఇలా దక్షిణాఫ్రికా వ్యాప్తంగా ఒకే రోజు ఒకే వేదిక కోసం డబ్బులు తీసుకొని దేశవ్యాప్తంగా 17 జంటలను మోసం చేసింది. తమ వివాహాన్ని రద్దు చేసుకుని, ఈ సంవత్సరం చివరిలో తిరిగి ప్లాన్ చేసుకోవడానికి చాలాకష్టపడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
చివరికి పేరు చెప్పడానికి ఇష్టపడని జంట ఫిర్యాదుతో గుట్టు రట్టయింది. వీరు గత ఏడాది డిసెంబర్‌లో భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికా (RUSA) తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెను ట్రాక్ చేసి (జనవరి 7) అరెస్టు చేశారు. నిందితురాలు మోసానికి పాల్పడినట్లు ,ఆమెకు క్రిమినల్ రికార్డ్ ఉందని 20 సంవత్సరాలకు పైగా జరిగిన స్కామ్‌ల చరిత్ర ఉందని నిర్ధారించినట్టు రూసా ప్రతినిధి బలరామ్ చెప్పారు.
మరోవైపు ఇది స్కామ్ కాదు, తాను స్కామర్‌ను కాదని ఆమె వాదిస్తోంది. కంపెనీ చాలా కష్టాలను ఎదుర్కొంది. ప్రతీ పైసా తిరిగి చెల్లిస్తానని ప్రతీ జంటకు లేఖలు పంపాననీ తెలిపింది. కానీ భాగస్వాములు అక్టోబర్‌లో వైదొలిగిన కారణంగా సకాలంలో తిరిగి చెల్లించలేకపోయానని స్థానికమీడియాకు తెలిపింది. తొమ్మిది జంటలకు సుమారు 60వేలు దక్షిణాఫ్రికా రాండ్ (రూ.2,72,319) బాకీ ఉందని అంగీకరించి, వాటిని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చింది.
అయితే నేరాన్ని అంగీకరించి, బాధితులందరికీ తిరిగి చెల్లిస్తానని ఆమె న్యాయవాది, కుటుంబ సభ్యులు కేడా చెప్పడంతో ఆమె జైలు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి దీనిపై కోర్టు ఎలా నిర్ణయిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment