S&P 500 Index
-
వ్యాక్సిన్ హోప్- యూఎస్ దూకుడు
వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం మరోసారి దూకుడు చూపాయి. వ్యాక్సిన్ల అందుబాటు కారణంగా డిసెంబర్‌కల్లా కోవిడ్-19కు చెక్పెట్టగలమంటూ వెలువడిన అంచనాలు సెంటిమెంటుకు జోష్‌నివ్వగా.. మరో సహాయక ప్యాకేజీపై స్పీకర్ నాన్సీ పెలోసీతో ఆర్థిక మంత్రి స్టీవెన్ ముచిన్ చర్చలు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఎస్అండ్పీ 54 పాయింట్లు(1.5%) బలపడి 3,581కు చేరగా.. నాస్డాక్ 117 పాయింట్లు(1%) ఎగసి 12,056 వద్ద ముగిసింది. వెరసి 2020లో ఇప్పటివరకూ ఎస్అండ్పీ 22వసారి, నాస్డాక్ 43వ సారి సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఇక డోజోన్స్ 455 పాయింట్లు(1.6%) జంప్‌చేసి 29,100 వద్ద స్థిరపడింది. తద్వారా ఫిబ్రవరి గరిష్టానికి 1.5 శాతం చేరువలో నిలవడంతోపాటు.. 6 నెలల తదుపరి తిరిగి 29,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. బ్లూచిప్స్ దన్ను ప్రధానంగా దిగ్గజ కంపెనీలు బలపడటంతో మార్కెట్లు జోరందుకున్నాయి. కోక కోలా, జనరల్ మోటార్స్, హెచ్‌పీ 4 శాతం, ఇంటెల్ కార్ప్, ఫేస్బుక్ 2.5 శాతం, మైక్రోసాఫ్ట్ 2 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఏడీపీ 3 శాతం, ఫోర్డ్ మోటార్, బోయింగ్ 1.75 శాతం, అమెజాన్ 1 శాతం చొప్పున ఎగశాయి. బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌ను సలహాదారుగా నియమించుకోవడంతో డ్రాఫ్ట్‌కింగ్స్ 8 శాతం దూసుకెళ్లింది. కంపెనీలో అతిపెద్ద ఇన్వెస్టర్ ఒకరు షేర్లను విక్రయించినట్లు వెల్లడించడంతో ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 6 శాతం పతనమైంది. ఇక బుధవారం భారీగా ఎగసిన జూమ్ వీడియో 7.5 శాతం దిగజారగా.. యాపిల్ ఇంక్ 2 శాతం క్షీణించింది. -
ఎస్అండ్పీ- నాస్డాక్.. రికార్డ్ రికార్డ్స్
ప్రధానంగా ఫాంగ్(FAAMNG) స్టాక్స్ పురోగమించడంతో అమెరికన్ స్టాక్ ఇండెక్సులు మంగళవారం సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. అయితే ఓవైపు డోజోన్స్ నీరసించినప్పటికీ ఎస్అండ్పీ-500, నాస్డాక్ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తాజాగా ఎస్అండ్పీ 8 పాయింట్లు(0.25 శాతం) పుంజుకుని 3,390వద్ద ముగిసింది. తద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి 19న 3,386 వద్ద నిలవడం ద్వారా సాధించిన సరికొత్త గరిష్టాన్ని తిరగరాసింది. అంతేకాకుండా మార్చి 23న నమోదైన కనిష్టం నుంచీ ఏకంగా 55 శాతం ర్యాలీ చేసింది! దీంతో గత 87ఏళ్లలో అత్యధిక లాభాలను ఆర్జించిన రికార్డును సైతం ఎస్అండ్పీ సొంతం చేసుకుంది. ఫలితంగా ఫిబ్రవరి- మార్చి మధ్య నెల రోజుల కాలంలోనే బేర్ ట్రెండ్ అంతమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇది అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతితక్కువ కాలం నిలిచిన బేర్ మార్కెట్‌గా నమోదైనట్లు తెలియజేశారు. నాస్డాక్ జోరు ఈ ఏడాది జూన్‌లోనే ఫిబ్రవరి గరిష్టాలను దాటిన నాస్డాక్ మంగళవారం 81 పాయింట్లు(0.75 శాతం) ఎగసి 11,211 వద్ద నిలిచింది. వెరసి జూన్ నుంచీ ఇప్పటివరకూ నాస్డాక్ 18సార్లు సరికొత్త గరిష్టాలను నెలకొల్పడం విశేషం! అంతేకాకుండా 2020లో ఇప్పటివరకూ 34సార్లు ఈ ఫీట్ సాధించింది. కాగా.. రిటైల్ దిగ్గజాలు హోమ్ డిపో, వాల్‌మార్ట్ ఆకర్షణీయ ఫలితాలు సాధించినప్పటికీ షేర్లు 1 శాతం చొప్పున డీలాపడటంతో డోజోన్స్ 67 పాయింట్లు(0.25 శాతం) నీరసించి 27,778 వద్ద స్థిరపడింది. టెస్లా దూకుడు మంగళవారం ట్రేడింగ్‌లో టెక్నాలజీ, ఈకామర్స్, సోషల్ మీడియా దిగ్గజాలకు డిమాండ్ పెరిగింది. అమెజాన్ 4 శాతం జంప్‌చేయగా, గూగుల్ 2.7 శాతం ఎగసింది. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్ 2 శాతం, యాపిల్ 0.8 శాతం, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇక ఆటో, టెక్నాలజీ కంపెనీ టెస్లా ఇంక్ 2.8 శాతం పెరిగింది. ఆసియా అటూఇటుగా ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌కు సెలవుకాగా.. జపాన్, కొరియా 0.5 శాతం చొప్పున ఎగశాయి. సింగపూర్ నామమాత్ర లాభంతో కదులుతోంది. అయితే తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఇండొనేసియా 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. -
బ్యాంకింగ్ దన్ను- డోజోన్స్‌కు జోష్
ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్‌కు డిమాండ్ పెరగడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు బుధవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 553 పాయింట్లు(2.2 శాతం) జంప్‌చేసి 25,548 వద్ద ముగిసింది. ఎస్అండ్పీ ఇండెక్స్ 44 పాయింట్లు(1.5 శాతం) బలపడి 3,036 వద్ద నిలవగా.. నాస్డాక్ 72 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 9,412 వద్ద స్థిరపడింది. మార్చి 5 తదుపరి ఎస్అండ్పీ 3,000 పాయింట్ల ఎగువన ముగియడం గమనార్హం! పలు రాష్ట్రాలలో లాక్‌డవున్ ఎత్తివేస్తున్న కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కనున్న అంచనాలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఇటీవల కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ అభివృద్ధిలో పలు కంపెనీలు ముందడుగు వేయడం కూడా సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాలు ఇన్వెస్టర్లలో అంతర్గతంగా ఆందోళనలకు కారణమవుతున్నట్లు వివరించారు. జేపీ మోర్గాన్ ప్లస్ బ్యాంకింగ్ దిగ్గజాలలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ 7 శాతం చొప్పున దూసుకెళ్లగా.. జేపీ మోర్గాన్ చేజ్ దాదాపు 6 శాతం జంప్‌చేసింది. రెండో క్వార్టర్లో క్రెడిట్ రిజర్వ్‌లను పెంచుకోనున్నట్లు బ్యాంక్ సీఈవో జేమీ డైమన్ పేర్కొనడంతో వరుసగా రెండో రోజు ఈ కౌంటర్ జోరందుకుంది. ఈ బాటలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, గోల్డ్‌మన్ శాక్స్ సైతం పుంజుకోవడంతో బ్యాంకింగ్ ఇండెక్స్ రెండు రోజుల్లో 10 శాతం ఎగసింది. కాగా.. లాక్‌డవున్ ఎత్తివేయడంతో ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్ థీమ్ పార్క్‌ను జులై 11 నుంచి దశల వారీగా ప్రారంభించనున్నట్లు వాల్ట్ డిస్నీ వెల్లడించింది. ఈ బాటలో లాస్‌వెగాస్‌లోని నాలుగు క్యాసినోలను జూన్ 4 నుంచీ తిరిగి తెరవనున్ననట్లు ఎంజీఎం రిసార్ట్స్ పేర్కొంది. దీంతో ఈ షేరు 2.6 శాతం పుంజుకుంది. ఎస్అండ్పీ ఇండెక్స్‌లో 7 షేర్లు 52 వారాల గరిష్టాలను తాకగా.. నాస్డాక్ కంపెనీలలో 41 కొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే మరో 10 కంపెనీలు కొత్త కనిష్టాలకు చేరాయి. ఇతర కౌంటర్లూ లాక్‌డవున్ ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఇటీవల అమ్మకాలతో దెబ్బతిన్న కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. క్రూయిజ్ నిర్వాహక కంపెనీ కార్నివాల్ కార్ప్ 6 శాతం జంప్‌చేయగా.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 4 శాతం పుంజుకుంది. జీఈ లైటింగ్ బిజినెస్ విక్రయ నేపథ్యంలో జనరల్ ఎలక్ట్రిక్ 7 శాతం పెరిగింది. హెచ్‌బీవో మ్యాక్స్ సర్వీసులను ప్రారంభించడంతో ఏటీఅండ్‌టీ 4 శాతం ఎగసింది. ట్రాక్టర్ల కంపెనీ టీఎస్సీవో 8 శాతం జంప్‌చేయగా.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ట్విటర్ మాత్రం 3 శాతం పతనమైంది. -
హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను విజయం వరిస్తే ల పరిస్థితేమిటా? అనే సందిగ్ధత మార్కెట్లలో నెలకొంది. ఇన్ని రోజులు హిల్లరీ గెలుపు అవకాశాలతో మార్కెట్లు ఆశాజనకంగా స్పందించాయి. కానీ చివరి దశలో అంచనాలు తారుమారు అవుతూ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పీఠం వరించబోతుందా అనగానే, మార్కెట్లలో కలవరం ప్రారంభమైంది. అటు అమెరికా మార్కెట్లే కాదు, ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఎన్నికల నేపథ్యంలోనైనా మార్కెట్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏమిటి? హిల్లరీ విజయం సాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం... స్టాక్ మార్కెట్లు : హిల్లరీ గెలిస్తే... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఇప్పటికే మార్కెట్లు ఓ అంచనాల్లో ఉన్నాయి. కాబట్టి తాను గెలిస్తే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. మూలధన పన్నులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు హిల్లరీ పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రిస్క్‌తో కూడుకున్న ఈక్విటీలపై పడనుందని తెలుస్తోంది. ఫైనాన్స్ , డ్రగ్ కంపెనీలు ఆమె గెలుపు అతిపెద్ద నష్టం. ఇటు బ్యాంకులకు ఇవి అత్యంత కఠినతరమైన ఎన్నికలుగా విశ్లేషకులు చెబుతున్నారు. కఠినతరమైన నిబంధనలు, పన్నుల మార్పులు కంపెనీలను ఎక్కువగా దెబ్బతీయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. క్లింటన్ హయాంలో ఫార్మా స్యూటికల్, బయోటెక్ స్టాక్స్ చాలా ఒత్తిడికి లోనయ్యాయి. డ్రగ్స్ ధరలు విపరీతంగా పెంచడాన్ని ఆమె నియంత్రించారు. అమెరికా ఎన్నికల ఆందోళనతో ఇప్పటికే యూరోపియన్ హెల్డ్ కేర్ ఇండస్ట్రి తమ రేటింగ్‌ను తగ్గించుకుంది. ఎప్పుడైతే హిల్లరీ గెలుపు అవకాశాల్లో పడిపోతుందనగానే, ఈ షేర్లు లాభపడటం ప్రారంభమయ్యాయి. మరోవైపు శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీ ప్రొడ్యూసర్లపై ఆమె ఎక్కువగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇది కూడా ఎనర్జీలో కొన్ని స్టాక్స్‌కు ప్రతికూలం చూపించనున్నట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే... యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులంటున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ 11 నుంచి 13 శాతం పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. జపాన్ ఎగుమతి దారులకు గండికొట్టి యెన్ విలువ దిగజారే అవకాశం ఉందట. అయితే ట్రంప్ నేతృత్వంలో డ్రగ్స్ తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా లాభపడనున్నాయని వెల్లడవుతోంది. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా ట్రంప్‌పై మొగ్గుచూపుతున్నాయని తెలుస్తోంది. సివిల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ ఇండస్ట్రి అతిపెద్ద లాభప్రదాయనిగా నిలువనుందట. క్లింటన్ కంటే ట్రంప్ ఎక్కువగా సివిల్ మౌలికసదుపాయాల రంగంలో ఖర్చు చేయనున్నారని మొదటి నుంచి తెలుస్తోంది. కరెన్సీలపై ఈ ఎన్నికల ప్రభావం.. హిల్లరీ గెలిస్తే.. ఇతర అభివృద్ది మార్కెట్లతో పోలిస్తే అమెరికా డాలర్ ఎక్కువగా లాభపడనుందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వెంటనే డిసెంబర్లో రేట్లపెంపు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రష్యా మినహా ఇతర ఎమర్జింగ్ దేశాల కరెన్సీలు పాజిటివ్‌గానే ట్రేడ్ కానున్నాయంట. క్లింటన్ గెలుపుపై చైనా యువాన్ ఎక్కువగా బలపడనుందని టాక్. ట్రంప్ గెలిస్తే.. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పదవిలోకి వస్తే, ఇతర మేజర్ కరెన్సీలు యెన్, యూరో, పౌండ్లతో పోలిస్తే డాలర్ విలువ బలహీనపడనుందని తెలుస్తోంది. ఫెడ్ ద్రవ్యవిధానపరపతి సమీక్షలో రేట్ల పెంపు మరికొన్ని రోజుల వాయిదా పడనుందని విశ్లేషకులంటున్నారు. అయితే గ్రీన్ బ్యాక్ కరెన్సీ మాత్రం మూడు నుంచి తొమ్మిది నెలల ర్యాలీ జరుపనుందట. కమోడిటీలు ఎలా స్పందించనున్నాయి.. హిల్లరీ గెలిస్తే.. హిల్లరీ మొదటి నుంచి పర్యావరణ విధానాలపై ఎక్కువగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులపై హిల్లరీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నారు. కోల్ వాడకం తగ్గించి సహజవాయువుల ఉపయోగాన్ని పెంచుతానని ఆమె అంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్ అండ్ ఆయిల్ షేర్లు ఒత్తిడి పడి, సహజ వాయువుల మార్కెట్ ఎక్కువగా అభివృద్ధి చెందనుందని విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే.. అయితే ట్రంప్ నేతృత్వంలో కోల్ ఎక్కువగా లాభపడి, సహజవాయువులకు దెబ్బకొట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం. సెప్టెంబర్‌లో బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందట. రిపబ్లికన్ అభ్యర్థి నేతృత్వంలో సహజ వాయువుల డిమాండ్ 11 శాతం క్షీణిస్తుందని, కోల్ వాడకం విపరీతంగా పెరుగుతుందని తెలిసింది. అదేవిధంగా గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా అతిపెద్ద లాభదాయకమైన కమొడిటీలుగా ఉండనున్నాయి. ఎఫ్‌బీఐ, హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ వాడక ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని పునఃవిచారణ చేపడుతుందనగానే, అన్ని విలువైన మెటల్స్ ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వెండి 3.4 శాతం, బంగారం 2 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే డాలర్ క్షీణిస్తూ వచ్చింది.