హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?
హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?
Published Sat, Nov 5 2016 4:01 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను విజయం వరిస్తే ల పరిస్థితేమిటా? అనే సందిగ్ధత మార్కెట్లలో నెలకొంది.
ఇన్ని రోజులు హిల్లరీ గెలుపు అవకాశాలతో మార్కెట్లు ఆశాజనకంగా స్పందించాయి. కానీ చివరి దశలో అంచనాలు తారుమారు అవుతూ డొనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష పీఠం వరించబోతుందా అనగానే, మార్కెట్లలో కలవరం ప్రారంభమైంది. అటు అమెరికా మార్కెట్లే కాదు, ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఎన్నికల నేపథ్యంలోనైనా మార్కెట్లు పాజిటివ్గానే ట్రేడ్ అయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏమిటి? హిల్లరీ విజయం సాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం...
స్టాక్ మార్కెట్లు :
హిల్లరీ గెలిస్తే... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఇప్పటికే మార్కెట్లు ఓ అంచనాల్లో ఉన్నాయి. కాబట్టి తాను గెలిస్తే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. మూలధన పన్నులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు హిల్లరీ పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రిస్క్తో కూడుకున్న ఈక్విటీలపై పడనుందని తెలుస్తోంది. ఫైనాన్స్ , డ్రగ్ కంపెనీలు ఆమె గెలుపు అతిపెద్ద నష్టం. ఇటు బ్యాంకులకు ఇవి అత్యంత కఠినతరమైన ఎన్నికలుగా విశ్లేషకులు చెబుతున్నారు.
కఠినతరమైన నిబంధనలు, పన్నుల మార్పులు కంపెనీలను ఎక్కువగా దెబ్బతీయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. క్లింటన్ హయాంలో ఫార్మా స్యూటికల్, బయోటెక్ స్టాక్స్ చాలా ఒత్తిడికి లోనయ్యాయి. డ్రగ్స్ ధరలు విపరీతంగా పెంచడాన్ని ఆమె నియంత్రించారు. అమెరికా ఎన్నికల ఆందోళనతో ఇప్పటికే యూరోపియన్ హెల్డ్ కేర్ ఇండస్ట్రి తమ రేటింగ్ను తగ్గించుకుంది. ఎప్పుడైతే హిల్లరీ గెలుపు అవకాశాల్లో పడిపోతుందనగానే, ఈ షేర్లు లాభపడటం ప్రారంభమయ్యాయి.
మరోవైపు శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీ ప్రొడ్యూసర్లపై ఆమె ఎక్కువగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇది కూడా ఎనర్జీలో కొన్ని స్టాక్స్కు ప్రతికూలం చూపించనున్నట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
ట్రంప్ గెలిస్తే...
యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులంటున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ 11 నుంచి 13 శాతం పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. జపాన్ ఎగుమతి దారులకు గండికొట్టి యెన్ విలువ దిగజారే అవకాశం ఉందట.
అయితే ట్రంప్ నేతృత్వంలో డ్రగ్స్ తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా లాభపడనున్నాయని వెల్లడవుతోంది. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా ట్రంప్పై మొగ్గుచూపుతున్నాయని తెలుస్తోంది. సివిల్ ఇన్ఫ్రాక్ట్ర్చర్ ఇండస్ట్రి అతిపెద్ద లాభప్రదాయనిగా నిలువనుందట. క్లింటన్ కంటే ట్రంప్ ఎక్కువగా సివిల్ మౌలికసదుపాయాల రంగంలో ఖర్చు చేయనున్నారని మొదటి నుంచి తెలుస్తోంది.
కరెన్సీలపై ఈ ఎన్నికల ప్రభావం..
హిల్లరీ గెలిస్తే.. ఇతర అభివృద్ది మార్కెట్లతో పోలిస్తే అమెరికా డాలర్ ఎక్కువగా లాభపడనుందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వెంటనే డిసెంబర్లో రేట్లపెంపు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రష్యా మినహా ఇతర ఎమర్జింగ్ దేశాల కరెన్సీలు పాజిటివ్గానే ట్రేడ్ కానున్నాయంట. క్లింటన్ గెలుపుపై చైనా యువాన్ ఎక్కువగా బలపడనుందని టాక్.
ట్రంప్ గెలిస్తే.. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పదవిలోకి వస్తే, ఇతర మేజర్ కరెన్సీలు యెన్, యూరో, పౌండ్లతో పోలిస్తే డాలర్ విలువ బలహీనపడనుందని తెలుస్తోంది. ఫెడ్ ద్రవ్యవిధానపరపతి సమీక్షలో రేట్ల పెంపు మరికొన్ని రోజుల వాయిదా పడనుందని విశ్లేషకులంటున్నారు. అయితే గ్రీన్ బ్యాక్ కరెన్సీ మాత్రం మూడు నుంచి తొమ్మిది నెలల ర్యాలీ జరుపనుందట.
కమోడిటీలు ఎలా స్పందించనున్నాయి..
హిల్లరీ గెలిస్తే..
హిల్లరీ మొదటి నుంచి పర్యావరణ విధానాలపై ఎక్కువగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులపై హిల్లరీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నారు. కోల్ వాడకం తగ్గించి సహజవాయువుల ఉపయోగాన్ని పెంచుతానని ఆమె అంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్ అండ్ ఆయిల్ షేర్లు ఒత్తిడి పడి, సహజ వాయువుల మార్కెట్ ఎక్కువగా అభివృద్ధి చెందనుందని విశ్లేషకులంటున్నారు.
ట్రంప్ గెలిస్తే..
అయితే ట్రంప్ నేతృత్వంలో కోల్ ఎక్కువగా లాభపడి, సహజవాయువులకు దెబ్బకొట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం. సెప్టెంబర్లో బ్లూమ్బర్గ్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందట. రిపబ్లికన్ అభ్యర్థి నేతృత్వంలో సహజ వాయువుల డిమాండ్ 11 శాతం క్షీణిస్తుందని, కోల్ వాడకం విపరీతంగా పెరుగుతుందని తెలిసింది.
అదేవిధంగా గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా అతిపెద్ద లాభదాయకమైన కమొడిటీలుగా ఉండనున్నాయి. ఎఫ్బీఐ, హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ వాడక ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని పునఃవిచారణ చేపడుతుందనగానే, అన్ని విలువైన మెటల్స్ ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వెండి 3.4 శాతం, బంగారం 2 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే డాలర్ క్షీణిస్తూ వచ్చింది.
Advertisement