కొడుకు తాగొద్దన్నాడని తండ్రి ఆత్మహత్య
లక్నో: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కుమారుడు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుఖ్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. బాల్లియా ఎస్పీ అనియా అన్సారీ కథనం ప్రకారం.. వీర్ బహదుర్ సింగ్(60) తన కుటుంబంతో పాటు సుఖ్పురాలో నివాసం ఉంటున్నాడు. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి రోజు లాగానే మద్యం సేవించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా అతని కొడుకు బహదూర్ సింగ్ అడ్డుకున్నాడు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యం సేవించడం మానేయాలని తండ్రికి సూచించాడు. కొడుకు మందలించడంతో బహదూర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కుటుంసభ్యులు నిద్రిస్తుండగా ఫ్యాన్‌కు ఉరేసుకుని బహదూర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన అలవాట్లను కొడుకు వ్యతిరేకించడంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని ఎస్పీ అన్సారీ వివరించారు.